ఫోన్లు, ట్యాబ్ లకు అడిక్ట్ అవుతున్నపిల్లలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హైదరాబాద్, వెలుగు: లాక్​డౌన్​లో పిల్లలు గ్యాడ్జెట్స్ కి మరింత దగ్గరవుతున్నారు. స్మార్ట్ ఫోన్, ట్యాబ్, టీవీని వదిలిపెట్టడం లేదు. మామూలు రోజుల్లో స్కూల్ కి టైం అవుతుందనో, హోంవర్క్ చేయాలనో చెప్పి.. పేరెంట్స్​ దూరం పెడుతుంటారు. ఇప్పుడు మాత్రం ఎంటర్ టైన్ మెంటే గాక క్లాస్ లూ ఆన్​లైన్​లోనే. వర్క్ ఫ్రం హోం చేస్తున్న కొందరు పేరెంట్స్ కూడా తమ పని డిస్ట్రబ్ చేయకుండా ఉండేందుకు పిల్లల చేతికి మొబైల్ ఇస్తున్నారు.  మరికొందరు పిల్లలు అన్నం తినాలన్నా, ఏడుపు మానాలన్నా, అల్లరి చేయకుండా ఉండాలన్నా చేతిలో ఫోన్ పెడుతున్నారు. వీడియో గేమ్స్, యూట్యూబ్ వీడియోలు, సోషల్ యాప్స్ చూస్తూ వాళ్లు లోకం మర్చిపోతున్నారు. అలా చేయడం వల్ల పిల్లలు గ్యాడ్జెట్స్ కి మరింతగా అడిక్ట్ అవుతారంటున్నారు సైకాలజిస్ట్ లు. ఇప్పటినుంచే కంట్రోల్​చేయకపోతే లాక్ డౌన్ తర్వాత పిల్లలను స్మార్ట్ ఫోన్ కి దూరంపెట్టడం కష్టమని చెబుతున్నారు. దాంతో పిల్లల ఆలోచన విధానంలో మార్పులతోపాటు హెల్త్ పై ఎఫెక్ట్ ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

క్లాసులూ ఆన్ లైన్ లోనే..

కరోనా ఎఫెక్ట్ తో మార్చి 15 నుంచే రాష్ట్రంలో స్కూల్స్ కి హాలీడేస్ ఇచ్చారు. అప్పటికే దాదాపు అకడమిక్ సిలబస్ కంప్లీట్ అవడంతో స్టూడెంట్స్ కి సబ్జెక్ట్ రివిజన్, టెస్టుల కోసం స్కూళ్లు ఆన్ లైన్ లో క్లాస్​లు కండక్ట్ చేస్తున్నాయి. పిల్లలు యూనిఫామ్ వేసుకుని ఇంట్లోనే స్మార్ట్ టీవీ లేదా స్మార్ట్ ఫోన్ లో ఆన్ లైన్ క్లాస్​లు వినడంతోపాటు టెస్ట్​లు అటెండ్ చేస్తున్నారు. సిటీలో సగం మందికిపైగా అలా స్క్రీన్స్ చూస్తూ ఉండిపోతున్నారు.  దాంతో పిల్లలకు రేడియేషన్, కంటి సంబంధ వ్యాధులు వచ్చే ప్రమాదముందని డాక్టర్లు చెప్తున్నారు. కొన్ని స్కూల్స్ మాత్రం ఈ సమస్యను ముందే గుర్తించి స్టూడెంట్స్ ఫోన్ కి అడిక్ట్ కాకుండా పేరెంట్స్ మొబైల్ కు వర్క్ షీట్స్, హోం వర్క్ పంపిస్తున్నాయి.  తల్లిదండ్రులే పిల్లలతో హోం వర్క్ చేయించి  ఫొటో తీసి వాట్సాప్ లో అప్ లోడ్ చేయాలని చెప్తున్నాయి.

ప్లానింగ్​ బెటర్ గా ఉండాలె..

పిల్లలు ఫోన్​లో ఏ యాప్స్, వీడియోస్ చూస్తున్నారనేది పేరెంట్స్ గమనిస్తుండాలె. లాక్ డౌన్​లో పిల్లలు  రోజును ఎలా గడపాలో కరెక్ట్​గా ప్లాన్ చేయాలె. ఎక్కువ టైం ఫోన్ లో స్కూల్ వర్క్ చేస్తే ఏం నేర్చుకున్నారో చెప్పమని అడగాలె. పిల్లలకి ఫోన్ ఇచ్చి వదిలేసి గుర్తొచ్చినప్పుడు చూసి తిడ్తే అవుట్ ఆఫ్ కంట్రోల్ అయితరు. లాక్ డౌన్ తర్వాత ఒకటి రెండ్రోజులు స్కూల్ కి బాగనే పోయినా.. తర్వాత వాళ్ల బిహేవియర్ లో మార్పులు వస్తయి. కోపం, చికాకు పెరుగుతయి. అందుకని ఇప్పట్నుంచే పేరెంట్స్ కంట్రోల్ చేయాలె.

– డా. హరిణి, సైక్రియాట్రిస్ట్

ఇండోర్  గేమ్స్ ఆడించాలె

లాక్ డౌన్ తర్వాత హ్యూమన్ లైఫ్ స్టైల్, ఆలోచన విధానం వంటి 20 అంశాలపై ఆన్ లైన్ లో సర్వే కండక్ట్ చేస్తున్నం. ముఖ్యంగా పిల్లల విషయంలో చాలామంది పేరెంట్స్ ట్రెయిన్డ్ గా లేరు. కొన్ని స్కూల్స్ ఆన్ లైన్ లో క్లాసెస్ కండక్ట్ చేస్తున్నయి. దాంతో లాక్ డౌన్ తర్వాత స్కూల్ కి పోకపోయినా ఏంకాదనే ఆలోచన పిల్లల్లో వస్తోంది. ఆన్ లైన్ టెస్ట్ ల వల్ల నోట్ బుక్స్ లో రాయడం కూడా తగ్గిస్తరు. గ్యాడ్జెట్స్ అడిక్షన్ నుంచి వారిని మార్చాలంటే ఇంట్లోనే ఫిజికల్ గేమ్స్ అలవాటు చేయాలె. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి మాట్లాడుకోవడంతో పాటు పిల్లలతో టైం స్పెండ్ చేయాలె.

– డా.వీరేందర్ ,సైకాలజిస్ట్

నా వర్క్ డిస్ట్రబ్ అవొద్దని..

నా పెద్ద కూతురు సెకండ్ క్లాస్ చదువుతోంది. లాక్ డౌన్ తో ఆన్ లైన్ క్లాసెస్ స్టార్ట్ అయినయి. స్మార్ట్ ఫోన్ ముందు పెట్టుకుని క్లాసులు వింటోంది. బయటకు తీసుకెళ్లే చాన్స్​ లేకపోవడంతో ఆ తర్వాత కూడా టీవీ, ఫోన్ చూస్తోంది.   నేను వర్క్ ఫ్రమ్ హోం చేస్తుండడం వల్ల పిల్లలు వచ్చి డిస్ట్రబ్ చేయకుండా వారికి ఫోన్ ఇస్తున్నా. కాసేపటికి తర్వాత ఫోన్ ఎక్కువసేపు వాడొద్దని చెప్పినా వినడం లేదు.

– కుమార్,  పేరెంట్

Latest Updates