ఆ అమ్మకు ఎంత కష్టం

  • మస్కులర్ డిస్ట్రో ఫీతో మంచానికే పరిమితమైన పిల్లలు
  • స్నానం..అన్నం అన్నీ తల్లి చేతులమీదనే…
  • పింఛన్ డబ్బులు.. రేషన్ బియ్యంతోనే సాగుతున్న జీవితం
  •  అయినా ఆశతో బతుకుతున్న అమ్మ

 

ఆమె పేరు సరళ. భర్త , ముగ్గురు పిల్లలతో సంసారం సంతోషంగా గడిచిపోతోంది. ఆ సమయంలోనే భర్త కన్నుమూశాడు. దీంతో దొరికిన చోట పని చేస్తూ పిల్లలను సాదే బాధ్యత తీసుకుంది. తండ్రి లేడనే లోటు వారికి తెలియకుండా పెంచుతూ వచ్చింది. ఇంటర్ చదువుతున్న పెద్ద కొడుకు అజయ్ ని మస్కులర్ డిస్ట్రోఫీ అనే వ్యాధి కదలలేని స్థితికి చేర్చింది. మరో మూడేండ్లయితే డిగ్రీ పూర్తి చేసుకుని ఇంటికి ఆసరాగా మారతాడనుకుంటే మంచానికే పరిమితమయ్యాడు. అతడికి సపర్యలు చేస్తూ మిగతా ఇద్దరు పిల్లలను చదివిస్తుండగా, కూతురు అఖిలప్రియను కూడా అదే వ్యాధి చుట్టు ముట్టింది. ఆమె కూడా ఇంటర్‌‌ చదువుతున్నప్పుడే కదలలేని స్థితికి చేరుకుంది. దీంతో సరళ కష్టాలు ఎక్కువయ్యాయి. సొంత పనులు కూడా చేసుకోలేని పిల్లలను కచ్చితంగా ఇంట్లో ఉండి చూసుకోవాల్సిందే. అలా చేస్తేతిండికి, బట్టకు, పొట్టకు కరువొస్తుంది. బయట పనికి పోతే పిల్లలను అరుసుకునేవాళ్లుండరు. అయినా వారికి అన్ని సేవలు చేస్తూ ధైర్యం చెడకుండా ఏనాటికైనా బాగవుతారనే నమ్మకంతో ముందుకు సాగుతోంది.

కరీంనగర్ లోని హస్నాపూర్ కాలనీలోఉండే దురుముట్ల సరళ పని ఉదయం లేచిన దగ్గరినుంచి ఆమె పని పిల్లలకు సేవ చేయడంతో మొదలై ఆ పిల్లల సేవతోనే ముగుస్తుంది. మస్కులర్డి స్ట్రోఫీ వ్యాధితో బాధపడుతున్న పిల్లలు కాలు కదపలేరు. అడుగు బయటపెట్టలేరు. చూడ్డానికి పైకి బాగానే కనిపించినా తమంతట తాము లేవలేరు. బ్రషింగ్..స్నానం.. టిఫిన్…అన్నం..మంచినీళ్లు..ఒకటికి, రెంటికి… ఆఖరికి బెడ్ పైన పడుకోబెట్టడం కూడా అన్నీ ఆ తల్లే చేస్తోంది.

పైసల్లేవ్..మందుల్లేవ్

పెద్దకొడుక్కి జబ్బువచ్చిన తర్వాత అతడిని పట్టుకుని ఎన్నో దవాఖానాలు తిరిగింది. దొరికిన చోటల్లా అప్పు చేసి డాక్టర్లకు చూపించింది. ముంబయిలో సైతం ట్రీట్ మెంట్ చేయించింది. ఆయుర్వేదం.. అల్లోపతి..యునాని ఇలా అన్ని గడపలూ తొక్కింది. మొక్కని భగవంతుడులేడు..తిరగని హాస్పిటల్ లేదు. రోజూఫిజియోథెరపీ ఇంట్లోనే చేయిస్తోంది. లక్షల్లో ఖర్చు కావడంతో అమ్మగారిచ్చిన భూమిని, రామ చంద్రాపురం కాలనీలోఉన్న ఇల్లు అమ్మేసింది. అక్క డక్కడా అప్పులు చేసింది. ఆస్తులు కరిగిపోవడంతో తన మామను ఇంట్లో పిల్లలను చూసుకోమని చెప్పి ఓ స్కూల్లో ఆయా పనికి వెళ్లింది. కొన్నిరోజులకు మామ కూడా కాలం చేయడంతో ఇంట్లో ఉండక తప్పని పరిస్థితి. ఉన్న ఉద్యోగాన్నీ మానేసి వారికే టైం కేటాయిస్తోంది. వీలైనపుడు బట్టలు కుడుతూ, వితంతు పింఛన్..రేషన్ బియ్యంతో సంసారాన్ని వెల్ల దీస్తోంది. ఇప్పుడు చేతిలో పైసా లేకపోవడం తో మందులు కూడా తీసుకురావడం లేదు. ఆరు నెలలుగా ఇంటి రెంట్ కూడా కట్టడం లేదు. ఉన్ననాడు తింటున్నరు..లేని నాడు ఉపాసం ఉంటున్నరు.

ఆశలు చిగురించినా

వ్యాధి బారినపడిన అజయ్ వేళ్లు ఇప్పటికీ పనిచేస్తున్నాయ్. దీంతో అతడు సెల్‌ఫోన్ ఆపరేట్ చేస్తాడు. అతడికి ఉన్న నాలెడ్జ్ తోఅమ్మపడే కష్టాలు చూడలేక ఇంటర్నెట్‌‌‌‌లో మస్కులర్డిస్ట్రో ఫీ ట్రీట్మెంట్ గురించి సెర్చ్ చేశాడు. పలువురు డాక్టర్లకు తన వీడియోల తో పాటు చెల్లి వీడియోలను కూడా పంపించాడు. ఇది చూసిన హర్యానాలోని ఓ డాక్టర్ చికిత్సకు అంగీకరించాడు. అజయ్, అఖిల ఉన్న స్టేజ్ లో ట్రీట్ మెంట్చేస్తే ఫలితాలు ఉంటాయని చెప్పడంతో ఆ తల్లిలో ఆశలు రేకెత్తాయి. ట్రీట్ మెంట్ కు రూ.15 లక్షలు ఖర్చవుతాయని, తినడానికే లేని పరిస్థితుల్లో వారిని ఎలా బాగు చేసుకోవాలో తెలియక బాధ పడుతోంది. దాతలెవరైనా సాయం చేస్తే వారికి జీవితాంతం రుణపడి ఉంటానంటోంది.

ఏంటీ మస్కులర్ డిస్ట్రో ఫీ?

మస్కులర్ డిస్ట్రో ఫీ వ్యాధి మెల్లమెల్లగా శరీరంలోని ఒక్కో భాగాన్ని కదపలేని స్థితికి చేరుస్తుంది. కాళ్లూ…చేతులు కదపలేరు. చివరికి కూర్చోలేని స్థితికి చేరుకుంటారు. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే అబ్జర్వ్ చేస్తే ఈ వ్యాధిని గుర్తించడానికి అవకాశం ఉంటుంది. వంకర టింకరగా నడవడం ఈ వ్యాధిలోని ప్రథమ లక్షణం. ఇలా ఉన్నప్పుడు ల్యాబ్‌లో సీకేపీ అనే టెస్ట్ చేస్తే తెలిసిపోతుంది.

Latest Updates