హలో ట్రంప్.. ముందు యూఎన్ కు బకాయిలు చెల్లించు: చైనా

న్యూయార్క్: కరోనా వైరస్ విషయంలో చైనా ప్రపంచాన్ని మోసం చేసిందంటూ అమెరికా ఆరోపిస్తోంది. అందుకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ప్రెసిడెంట్ ట్రంప్ పలు మార్లు చైనాకు వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో చైనా.. అమెరికాపై విమర్శలు చేస్తూ శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. యునైటెడ్ నేషన్స్ కు అమెరికా భారీ మొత్తం బాకీ పడిందని, వాటిని వెంటనే చెల్లించాలని సూచించింది. సాధ్యమైనంత తొందరలో ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలన్నీ కూడా బకాయిలను చెల్లించాలని పేర్కొంది. మే 14 నాటికి యూఎన్ రెగ్యులర్ బడ్జెట్, పీస్ కీపింగ్ బడ్జెట్ అంచనాలు వరుసగా 1.63 బిలియన్ డాలర్లు, 2.14 బిలియన్ యూఎస్ డాలర్లు. ఇందులో ప్రపంచ దేశాలన్నింటిలో యూఎస్ ఎక్కువగా బకాయి పడిందని, రెగ్యులర్ బడ్జెట్ కు1.165 బిలియన్ డాలర్లు, పీస్ కీపింగ్ బడ్జెట్ లో 1.332 బిలియన్ యూఎస్ డాలర్లు బయాయి పడిందని చెప్పింది.
యుఎన్ బడ్జెట్లో అత్యధికంగా నిధులను యూఎస్ ఏటా అందజేస్తోంది. మొత్తం బడ్జెట్​లో 22 శాతం (దాదాపు 3 బిలియన్ యూఎస్ డాలర్లు) అమెరికా అందజేస్తోంది. పీస్ కీపింగ్ సంబంధిత కార్యక్రమాల్లోనూ సంవత్సరానికి 25 శాతం(6 బిలియన్ డాలర్లు) సాయం చేస్తోంది. ఏటా 27.89 శాతం నిధుల్ని అందజేసే అమెరికా.. ట్రంప్ అధికారంలోకి వచ్చాక 2017 లో దానిని 25 శాతానికి తగ్గించారు.

దృష్టి మరల్చేందుకే చైనా అబద్దాలు ప్రచారం : యూఎస్
చైనా చేస్తున్న ఆరోపణలను యునైటెడ్ నేషన్స్ .. యూఎస్ మిషన్ తీవ్రంగా ఖండించింది. చైనా ఇచ్చిన పిలుపును తోసిపుచ్చింది. చైనాను ప్రపంచదేశాలన్నీ తప్పుపడుతున్నాయి కాబట్టి దాని నుంచి దృష్టి మరల్చేందుకు ఆ దేశం ఇలాంటి ప్రతిపాదనలు చేస్తోందని ఆరోపించింది. వైరస్ వ్యాప్తి విషయంలో దోషిగా ఉన్న చైనా అబద్ధాలు ప్రచారం చేస్తోందని ఫైర్ అయింది. యూఎస్ ఈ మధ్యే శాంతి పరిరక్షణ అంచనా బడ్జెట్​కోసం 726 మిలియన్ డాలర్లను చెల్లించిందని యూఎస్ మిషన్ పేర్కొంది. పీస్ కీపింగ్ బడ్జెట్ కు బాకీ పడింది 888 మిలియన్ డాలర్లు మాత్రమేనని పేర్కొంది. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత యూఎస్ చెల్లిస్తున్న మొత్తం 25 శాతానికి తగ్గించారని, ఆ ప్రకారంగా కాకుండా చైనా 27.89 శాతం చొప్పున లెక్కలు కట్టి ఎక్కువ మొత్తంలో తాము బాకీ పడినట్లు చూపిస్తోందని మండిపడింది.

 

Latest Updates