‘కరోనా’ వైరస్‌… ఒకరి నుంచి ఒకరికి సోకుతుంది

    ఆరుకు పెరిగిన మృతుల సంఖ్య

    ప్రపంచ దేశాలు అలర్ట్​..

    థర్మల్​ స్కానర్లతో చెకింగ్‌లు

    చైనా లూనార్​ న్యూ ఇయర్​ వేడుకలు రద్దు

     చైనా మార్కెట్లు పతనం.. మాస్క్‌ కంపెనీల షేర్ల విలువ పెరుగుదల

కరోనా వైరస్​ గురించి చైనా సర్కార్​ కొత్త ప్రకటన చేసింది. అది ఒకరి నుంచి మరొకరికి అది సోకుతుందని మంగళవారం వెల్లడించింది. ఈ వైరస్​ వల్ల చనిపోయిన వారి సంఖ్య ఆరుకు పెరిగింది. దేశంలో 308 మందికి ఈ వైరస్​ సోకినట్టు తెలిపింది. ఒక్క మంగళవారమే (జనవరి 20) 77 కొత్త కేసులు నమోదైనట్టు ఆ దేశ నేషనల్​ హెల్త్​ కమిషన్​ ప్రకటించింది.  అత్యధికంగా హ్యూబీలో 270 మందికి ఈ వైరస్​ సోకినట్టు చెప్పింది. ఆ తర్వాత గ్వాంగ్​డాంగ్​లో 14, బీజింగ్​లో 5, షాంఘైలో 2 కేసులు నమోదైనట్టు వెల్లడించింది. ఇప్పటికే థాయ్​లాండ్​, హాంకాంగ్​, జపాన్​, దక్షిణకొరియా దేశాలకు పాకిన వైరస్​, ఆస్ట్రేలియాకూ పాకినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఓ వ్యక్తికి ఆస్ట్రేలియా డాక్టర్లు టెస్టులు చేశారు. అది కరోనా వైరసేనని తేల్చారు. అయితే, ప్రపంచవ్యాప్తంగా 1700కు పైగా కరోనావైరస్​ కేసులు నమోదైనట్టు చెబుతున్నారు.

పాకకుండా చర్యలు

వైరస్​ మరింత విజృంభించకుండా చైనా చర్యలు ప్రారంభించింది. ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాల్సిందిగా చైనా ప్రెసిడెంట్​ షి జిన్​పింగ్​ సోమవారం ఆదేశించిన నేపథ్యంలో, ఎయిర్​పోర్టులు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో స్క్రీనింగ్​ సెంటర్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఒక్క చైనాలోనే కాకుండా ప్రపంచ దేశాలన్నీ వైరస్​పై అప్రమత్తమయ్యాయి. మలేసియా, తైవాన్​, ఇండియా, రష్యా, దక్షిణకొరియా, అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్​ వంటి దేశాల్లో ప్రయాణికులను చెక్​ చేస్తున్నారు. థర్మల్​ స్కానర్ల ద్వారా ప్రతి ప్రయాణికుడిని చెక్​ చేశాకే పంపిస్తున్నారు. వేరే దేశం నుంచి వచ్చిన ప్యాసింజర్లను విమానం దిగకముందే అందులోనే చెక్​ చేసి బయటకు పంపుతున్నారు. వుహాన్​ నుంచి వివిధ దేశాల్లోని సిటీలకు కనెక్షన్లుండడంతో ఆయా దేశాల్లోనూ ముందస్తు జాగ్రత్త చర్యలు ప్రారంభించారు. న్యూయార్క్​, శాన్​ఫ్రాన్సిస్కో, లాస్​ఏంజిలిస్​లలో మెడికల్​ ఆఫీసర్లు అప్రమత్తమయ్యారు. రష్యా, కజకిస్థాన్​ వంటి దేశాల్లో నూ ఎయిర్‌‌పోర్టుల్లో థర్మల్‌‌ స్కానర్లు పెట్టారు.

లూనార్​ న్యూ ఇయర్​ సెలబ్రేషన్స్​ క్యాన్సిల్​

కొత్త వైరస్​ నేపథ్యంలో చైనా ఘనంగా నిర్వహించుకునే లూనార్​ న్యూ ఇయర్​ వేడుకలను ఆ దేశ ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో చాలా మంది తమ తమ ప్రయాణాలను రద్దు చేసుకున్నారు. దాని ఎఫెక్ట్​ చైనా స్టాక్​మార్కెట్లపై పడింది. మంగళవారం మార్కెట్​ పతనమైంది. అయితే, సర్జికల్​ మాస్క్​లకు సంబంధించిన కంపెనీల షేర్ల విలువ మాత్రం బాగా పెరిగింది. దానికీ కారణం లేకపోలేదు. కొత్త వైరస్​ నేపథ్యంలో వాటి అమ్మకాలు పెరుగుతాయని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. దీంతో వాటిపై ఎక్కువగా
ఇన్వెస్ట్​ చేస్తున్నారు.

వీసాల కోసం అప్లై చేసుకున్నోళ్ల వివరాలివ్వండి

కరోనా వైరస్​ దాడి నేపథ్యంలో మన వీసా కోసం అప్లై చేసుకున్న వాళ్ల వివరాలు ఇవ్వాల్సిందిగా విదేశీ వ్యవహరాల శాఖను కేంద్ర ఆరోగ్య శాఖ కోరింది. డిసెంబర్​ 31 నుంచి ఎవరెవరు వీసాకు అప్లై చేసుకున్నారో, వుహాన్​ సిటీ నుంచి వచ్చిన ప్రయాణికులెందరో చెప్పాలని కోరింది. అన్ని రాష్ట్రాలూ అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లేఖ రాశారు. హాస్పిటళ్లు, ల్యాబుల్లో అన్ని సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. వెంటిలేటర్​పై చికిత్స పొందుతున్న శ్వాసకోశ రోగులకు సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. హైదరాబాద్​, ఢిల్లీ, ముంబై, కోల్​కతా, బెంగళూరు, చెన్నై విమానాశ్రయాల్లో థర్మల్​ స్క్రీనింగ్​ను ఏర్పాటు చేయాల్సిందిగా పౌర విమానయాన శాఖకు సూచించింది. ఇంటర్నేషనల్​ సివిల్​ ఏవియేషన్​ ఆర్గనైజేషన్​ గైడ్​లైన్స్​ను విధిగా పాటించాలని చెప్పింది. చైనా నుంచి ఎవరైనా అనారోగ్యంతో ఉన్నట్టు కనిపిస్తే వెంటనే రిపోర్ట్​ చేయాలని చెప్పింది. ఇప్పటికే శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు, ఢిల్లీ, ముంబై, కోల్​కతా విమానాశ్రయాల్లో థర్మల్‌ స్కానర్లు ఏర్పాటు చేశౠరు. కరోనా వైరస్​కు సంబంధించి సైన్​ బోర్డులు ఏర్పాటు చేశారు.

ఎట్ల సోకుతది?
వైరస్ సోకిన వాళ్లకు దగ్గరగా మాట్లాడడం
షేక్హ్యాండివ్వడం, ముట్టుకోవడం
దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు గాల్లోని వైరస్ వల్ల 
వైరస్ ఉన్న వస్తువును ముట్టుకుని నోరు, లేదా ముక్కు దగ్గర పెట్టుకుంటే.. 
రేర్ కేసుల్లో మలం కంటామినేషన్ ద్వారా

 

సోకకుండా ఏం చేయాలి?
వ్యక్తిగత పరిశుభ్రత 
ఏవైనా పనులు చేసినప్పుడు చేతులు కడుక్కోవాలి
చేతులను కళ్లు, ముక్కు, నోటికి దూరంగా పెట్టాలి
జబ్బు చేసిన వాళ్లకు దూరంగా ఉండాలి
జంతువులకూ కొంచెం దూరం ఉంటే మంచిది
జంతువులను ముట్టుకుంటే సబ్బుతో చేతులు కడుక్కోవాలి
రోగ నిరోధక వ్యవస్థను కుంగదీసే తిండికి దూరంగా ఉండాలి
పాలు మంచిగా కాగబెట్టి తాగాలి
మాంసాన్ని బాగా ఉడికించాలి..ఎచ్చిపచ్చిగా వండొద్దు
కొంచెం అనారోగ్యమనిపిస్తే స్కూలు, కాలేజీ లేదా ఆఫీసుకెళ్లకపోవడం మంచిది
నోరు, ముక్కుకు తప్పనిసరిగా మాస్క్ కట్టుకోవాలి

Latest Updates