ఇట్ల కొట్లాడింది : చైనా వర్సెస్ కరోనా

5 కోట్ల మందిని ఇండ్ల నుంచి బయటకి రానీయలే
ఎక్కడా జనాన్ని గుమిగూడనీయలే
అలీ పే, వీ చాట్ యాప్స్​ తో నిఘా పెట్టిన్రు
వైరస్‌తో దాదాపుగా యుద్ధమే చేసిన్రు

ప్రపంచాన్ని కమ్మేసిన కరోనా మహమ్మారి.. చైనాలో మాత్రం కూల్ అయిపోయింది. వుహాన్ లో మొదలై..160కి పైగా దేశాలకు పాకి దునియా అంతటినీ వణికిస్తున్న కొవిడ్ రోగం.. అక్కడ ప్రస్తుతానికి పూర్తిగా కంట్రోల్ లోకి వచ్చేసింది. ఒకవైపు యూరప్ దేశాలు, అమెరికాలో కరోనా వైరస్ భీకరంగా విజృంభిస్తుండగా.. మరోవైపు బుధవారం చైనాలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. దీంతో కరోనాపై డ్రాగన్ కంట్రీ విజయం సాధించినట్లేనని చెప్తున్నారు. వాస్తవానికి ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న చైనాలో ఈ రోగం మొదలవడంతో ఏమాత్రం తేడా వచ్చినా కోట్లాది ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. కానీ.. 80 వేల మందికి వైరస్ సోకినా.. 3 వేల మరణాలే సంభవించాయి. ఈ మహమ్మారి రెండు నెలల్లోనే ప్రపంచమంతా పాకినా.. చైనాలో మాత్రం ఇంత త్వరగానే కంట్రోల్లోకి రావడం వెనక ఆ దేశం తీసుకున్న అతి కఠినమైన నిర్ణయాలే కారణమని అంతర్జాతీయ నిపుణులు అంటున్నారు. చైనా చేపట్టిన చర్యలు మిగతా దేశాలన్నీ పాటిస్తే.. కరోనాను ఖతం చేయొచ్చని చెప్తున్నారు. మరికొందరేమో.. చైనాలో చేపట్టిన కఠినమైన చర్యలు ఇతర దేశాల్లో అమలు చేయడం వల్ల లాభం లేదని పేర్కొంటున్నారు.

డబ్ల్యూహెచ్ఓ మెచ్చుకుంది

చైనాలో కొవిడ్-19 విశ్వరూపం చూపి.. కాస్త నెమ్మదిస్తున్న సమయం. ఫీల్డ్ లెవల్ లో పరిస్థితి ఎలా ఉంది? అన్నది పరిశీలించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆధ్వర్యంలోని 13 మంది విదేశీ ప్రతినిధులు, 12 మంది చైనీస్ సైంటిస్టుల బృందం వైరస్ కు కేంద్రస్థానంగా ఉన్న వుహాన్, హుబే ప్రావిన్స్ లలో పర్యటించింది. ఆ బృందం ఫిబ్రవరి10న పర్యటన మొదలుపెట్టిన రోజున చైనాలో నమోదైన కొత్త కేసులు 2,478. రెండు వారాల తర్వాత ఆ బృందం పర్యటన ముగించుకుని వెళ్లిపోతున్న రోజున నమోదైన కొత్త కేసులు 409 మాత్రమే. ఎంత వేగంగా కరోనా మహమ్మారి కమ్మేసిందో.. దానిని అంతే వేగంగా చైనా కంట్రోల్ చేసిందనేందుకు ఇదే ఉదాహరణ. వైరస్ ను కట్టడి చేసేందుకు ఫీల్డ్ లెవల్ లో తీసుకుంటున్న చర్యలను చూసి ఆ బృందం కూడా ఆశ్చర్యపోయింది. సర్కారు చేపట్టిన చర్యల వల్లే కోట్లాది మందికి కొవిడ్ ముప్పు తప్పిందని అభిప్రాయపడింది. చైనా చరిత్రలోనే కనీవినీ ఎరుగని స్థాయిలో కఠిన చర్యలతో వైరస్ ను అణచేసిందని అభినందించింది.

సొంతిండ్లలో బందీలుగా

వుహాన్ లో మొదలైన కరోనా వైరస్ ఆ ప్రావిన్స్ తో పాటు పక్కనే ఉన్న హుబే ప్రావిన్స్ లోనూ తీవ్రంగా విజృంభించింది. జనవరి 23 నాటికి పరిస్థితి భీకరంగా మారింది. దీంతో ఆ రోజునే వుహాన్ ను చైనా దాదాపుగా లాక్ డౌన్ చేసింది. హుబే ప్రావిన్స్ లోని పలు సిటీలను కూడా పూర్తిగా అధికారులు కంట్రోల్లోకి తీసుకున్నారు. దాదాపుగా 5 కోట్ల మందిని బలవంతంగా క్వారంటైన్ చేశారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లో మాత్రం ప్రజలకు స్వచ్ఛందంగా క్వారంటైన్లకు వచ్చే అవకాశం కల్పించారు. దేశమంతా పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఎక్కడిక్కడ ప్రత్యేకంగా లీడర్లను నియమించారు.

డౌట్ ఉన్న ప్రతి ఒక్కరినీ ట్రేస్ చేశారు..

కొద్దిరోజుల్లోనే వేలాది కేసులు నమోదు కావడంతో చైనా అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు ప్రారంభించారు. వుహాన్ లో వారంలోనే రెండు ప్రత్యేక హాస్పిటళ్లను కట్టారు. మిగతా ప్రాంతాల నుంచి  డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందిని వుహాన్ కు తరలించారు. వైరస్ సోకి ఉంటుందని అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరినీ వెతికి పట్టుకున్నారు. ఇందుకోసం చైనా సర్కారు చేసిన ప్రయత్నమే యుద్ధంలా ఉంది. ఒక్క వుహాన్ లోని అనుమానితులను ట్రేస్ చేసేందుకే ఐదుగురి చొప్పున 1800 టీంలను సర్కారు సిద్ధం చేసింది. ఈ టీంలన్నీ అడుగడుగూ జల్లెడపట్టాయి. వేలాది మంది అనుమానితులను క్వారంటైన్ లకు తీసుకొచ్చాయి.

అలీపే, వీచాట్ యాప్ లతో నిఘా..

చైనాలో అలీపే పేమెంట్ యాప్, వీచాట్ (వాట్సాప్ లాంటిది) చాలా ఫేమస్. అయితే, కరోనా వైరస్ విజృంభించగానే సర్కారు వీటిని కూడా జనంపై నిఘాకు వాడుకున్నది. ఈ రెండు యాప్ ల ద్వారా జనం ఎప్పుడెప్పుడు, ఎక్కడెక్కడ తిరుగుతున్నారు? ఏం చేస్తున్నారన్నదీ నిరంతరం కన్నేసి ఉంచింది. ఇక కొవిడ్ బారిన పడిన పేషెంట్లు, అనుమానితులపై ఈ యాప్ ల ద్వారా మరింత ఎక్కువగా అధికారులు కంట కనిపెడుతూనే ఉన్నారని చెప్తున్నారు. అనుమానం వచ్చినోళ్లెవరినీ ప్రయాణాలకు అస్సలు అనుమతించలేదు. ప్రతి ఒక్కరి మొబైల్ ఫోన్లలోనూ గ్రీన్, ఎల్లో, రెడ్ కలర్ లతో ఉండే కోడ్ లు కనిపించేలా చేశారు. గ్రీన్ కలర్ ఉంటే హెల్త్ బాగుందని, రెడ్ కలర్‌లో ఉంటే డేంజర్ అని అధికారులకు చూడగానే తెలిసిపోయేలా చర్యలు తీసుకున్నారు.

వేరే దేశాల్లో అయితే కష్టమే..

చైనాలో మాదిరిగా వేరే దేశాల్లో ఇలాంటి చర్యలు తీసుకుంటే రచ్చ రచ్చ అయిపోయేదట. కానీ చైనాలో కఠిన నిర్ణయాలు తీసుకున్నా జనం మద్దతు ఇస్తారని, ఈ విషయంలో చైనా అంతా ఒక్కతాటిపై నిలుస్తుందని చెప్తున్నారు. ఎంత పెద్ద ప్రాజెక్టులనైనా వేగంగా పూర్తి చేయడం వంటివి ప్రపంచంలో మరే దేశమూ చైనాకు సాటి రాదని సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్ మెంట్ సీనియర్ పాలసీ ఫెలో జెరెమీ కొనిడిక్ అభిప్రాయపడ్డారు.

జనాన్ని గుమిగూడనియ్యలే..

వైరస్ తీవ్రంగా వ్యాపిస్తోందని అర్థమైన వెంటనే.. చైనా దేశమంతా ‘సోషల్ డిస్టాన్సింగ్’ కు చర్యలు ప్రారంభించింది. దేశమంతటా ఆటల పోటీలన్నీ బంద్ చేసింది. థియేటర్లు మూసేయించింది. స్కూళ్లు, కాలేజీలు బంద్ అయ్యాయి. న్యూఇయర్ వేడుకలనూ రద్దు చేసింది. అత్యవసరం కాని చాలా రకాల దుకాణాలన్నీ మూసేయాలని ఆర్డర్ వేసింది. బయట అడుగుపెట్టే ప్రతి ఒక్కరూ మాస్క్ పెట్టుకుని రావాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో జనం గుంపులు గుంపులుగా తిరగడం తగ్గిపోయింది. అవసరమై బయటికి వచ్చినా, జాగ్రత్తలు తీసుకున్నారు. అందువల్లే కోట్లాది మందికి వైరస్ ముప్పు తప్పిందని భావిస్తున్నారు.

జనం ఇబ్బందులు పడినా..

చైనా సర్కారు తీసుకున్న చర్యల వల్ల దాదాపుగా జనానికి వ్యక్తిగత జీవితం, స్వేచ్ఛ అనేదే లేకుండా పోయింది. కానీ ఈ చర్యల వల్లే వైరస్ కంట్రోల్ అయిందని నిపుణులు చెప్తున్నారు. లేకపోతే కోట్ల మందికి కొవిడ్ రోగం అంటుకునేదని అంటున్నారు. సోషల్ డిస్టాన్సింగ్, క్వారంటైన్ చర్యల కారణంగా జనం ఇబ్బందులు పడినప్పటికీ మేలే జరిగిందని అభిప్రాయపడుతున్నారు. చైనాలో మానవ హక్కుల ఉల్లంఘన పెద్ద ఎత్తున జరిగినప్పటికీ, అధికారుల అంకితభావం మాత్రం ప్రశంసనీయమని పేర్కొంటున్నారు. ఇక ఎప్పటికప్పుడు డేటాను విశ్లేషించుకునేందుకు అధికారులు దేశమంతటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీని కూడా బాగా వాడుకున్నారని చెప్తున్నారు.

ఒక్కకొత్త కేసూ లేదు!

ప్రపంచానికి మహమ్మారిలా తయారైన కరోనా వైరస్ చైనాలో దాదాపుగా కంట్రోల్ అయిపోయింది. వైరస్ మొదలైన వుహాన్ లో కూడా బుధవారం దేశంలో కొత్తగా ఒక్క ‘కొవిడ్–19’ కేసు కూడా కన్ఫమ్ కాలేదని నేషనల్ హెల్త్ కమిషన్ గురువారం ప్రకటించింది. కొత్తగా 23 మంది అనుమానితులను మాత్రం గుర్తించినట్లు తెలిపింది. వాస్తవానికి దేశంలో బుధవారం34 కొత్త కేసులు నమోదు అయినప్పటికీ, వాళ్లందరూ విదేశాలలో ఇన్ఫెక్షన్ కు గురై వచ్చినవారేనని వెల్లడించింది. దీంతో విదేశాల నుంచి చైనా వచ్చిన కొవిడ్ పేషెంట్ల సంఖ్య 189కి చేరిందని తెలిపింది. దేశంలో మరో 8 మంది పేషెంట్లు చనిపోయారని, కొవిడ్ మృతుల సంఖ్య 3,245కు చేరిందని పేర్కొంది. ఓవరాల్ గా బుధవారం నాటికి చైనాలో కొవిడ్–19 కన్ఫమ్ కేసుల సంఖ్య 80,928కి చేరింది. వీరిలో 3,245 మంది చనిపోగా 70,420 మంది డిశ్చార్జ్ అయ్యారు.

లక్ష్యం వైపు సైనికుల్లా..

డబ్ల్యూహెచ్ఓ బృందం రెండు జట్లుగా విడిపోయింది. రెండు టీంలు వేర్వేరుగా షెంఝెన్, గ్వాంగ్జౌ, చెంగ్డూ, వుహాన్ సిటీలకు వెళ్లాయి. హాస్పిటళ్లు, ల్యాబ్ లు, కంపెనీలు, జంతువులను అమ్మే మార్కెట్లు, రైల్వే స్టేషన్లు, లోకల్ గవర్నమెంట్ ఆఫీసులు.. ఇలా ప్రతి చోటికీ బృందం ప్రతినిధులు వెళ్లారు. ఎక్కడ చూసినా.. అధికారులు, సిబ్బంది యుద్ధం చేస్తున్నట్లుగా పని చేస్తున్నారు. ఎవరిని కదిలించినా.. మహమ్మారిని ప్రపంచం నుంచి తరిమేయాలన్న బాధ్యత, పట్టుదలే కన్పించాయి. ఈ విషయాలన్నీ ఆ బృందం ప్రతినిధులు తమ రిపోర్ట్ లో వెల్లడించారు.

భారీగా పెరిగిన నిత్యావసర వస్తువుల కొనుగోళ్లు

కరోనా ఎఫెక్ట్‌‌తో సెబీ రూల్స్‌‌ మార్చింది

Latest Updates