కయ్యానికి కాలుదువ్వడమే చైనా లక్ష్యం

బీఆర్ఐని కాపాడుకోవడానికే కుట్రలు
పాక్, నేపాల్తో కలిసి బార్డర్లలో ఘర్షణలు
చైనాను ఎదుర్కొనే సత్తా ఇండియాకు ఉంది
చైనా కచ్చితంగా గుణపాఠం నేర్చుకుంటుంది

లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్(ఎల్ఏసీ) దగ్గర 20 మంది మన జవాన్లను చైనా ఆర్మీ హతమార్చడం దారుణమైన చర్య. అది అప్పటికప్పుడు ఏర్పడిన హింసాత్మక ఘర్ష‌ణ కాదు. మనదేశానికి వ్యతిరేకంగా చైనా పక్కా ఆలోచనతో అమలు చేసిన అజెండా అది. ఎల్ఏసీపై ఎంతోకాలంగా సాగుతున్న సైనిక ఘర్ష‌ణలోకి ఇండియాను లాగాలనే చైనా ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది. కయ్యానికి కాలుదువ్వే వారి నైజం వల్ల సమీప భవిష్యత్ లో బార్డ‌ర్ దగ్గర ఇలాంటి హింసాత్మక ఘటనలు మరిన్ని చోటుచేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

బీఆర్ఐ లక్ష్యాలకు అనుగుణంగానే

2011లో అమెరికా ఫారిన్ మినిస్టర్ గా హిల్లరీ క్లింటన్ ఉన్నప్పుడు చెన్నైలో జరిగిన సదస్సులో ఈస్ట్ వెస్ట్ ను కలిపే “కొత్త సిల్క్ రోడ్” అనే స్ట్రాటజిక్ విజన్ గురించి ప్రస్తావించారు. ఈస్ట్ వెస్ట్ మ‌ధ్య ట్రేడ్ ను మరింత పెరగాలన్నది తమ ఆకాంక్ష అని చెప్పారు. కాని, అమెరికా తలపెట్టిన ఈ గొప్ప ఆలోచన మాటలకే పరిమితమైంది. చైనా ప్రెసిడెంట్ గా జిన్పింగ్ బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్త‌యిన సమయంలో 2013లో ఇండోనేషియా, కజకిస్థాన్ టూర్ సందర్భంగా ఈస్ట్ వెస్ట్ ను కలిపే “బెల్ట్, రోడ్ ఇనిషియేటివ్” (బీఆర్ఐ) గురించి తన లక్ష్యాలను ప్రకటించారు. అమెరికాలా కాకుండా ఈ ప్రకటన చేసిన వెంటనే కార్యాచరణను చైనా ప్రారంభించింది. మౌలిక సదుపాయాలు, పెట్టుబడులపరంగా 130 దేశాలు, ప్రపంచ సంస్థలతో ముడిపడిన బీఆర్ఐ ద్వారా ప్రపంచ నాయకత్వం కోసం చైనా పావులు కదుపుతోంది. 2014 నుంచి బీఆర్ఐ అనేది జిన్ పింగ్ రాజకీయ అస్తిత్వానికి కేంద్రంగా నిలిచింది. బీఆ ర్ఐ అన్నది మిగతా ప్రపంచ దేశాలతో ట్రేడ్ ను పెంచుకునేందుకు చైనా చేపడుతున్న రీజినల్
కనెక్టివినెక్టిటీ కాదు. వరల్డ్ ప‌వ‌ర్ గా ఉన్న అమెరికాను దెబ్బకొట్టడానికి చైనా వేస్తున్న ఎత్తుగడ అది. తమ లక్ష్య సాధనకు 138 దేశాలు, 30 అంతర్జాతీయ సంస్థలకు ఇప్పుడు చైనా స్థానం కల్పిస్తోంది. ఇంత వరకూ ఏ దేశం చేపట్టనటువంటి భారీ ప్రాజెక్టు ఇది. 2013 నుంచి ఇప్పటివరకు చైనా దీనిపై 2000 బిలియన్ డాలర్లు ఖర్చుచేసింది. ఇది పూర్తయితే రోడ్డు, రైలు, సముద్ర మార్గం, సముద్ర లోపల రవాణా ద్వారా యూరోప్, అమెరికా, ఆఫ్రికా, మిడిల్ఈస్ట్ దేశాలతో ఆసియా కనెక్ట‌వుతుంది. దీనిపై చైనా చేస్తున్న భారీ పెట్టుబడులు చాలా దేశాలను దీర్ఘ‌కాలంగా అప్పుల ఊబిలోకి నెట్టేయబోతున్నాయి.

బీఆర్ఐని వ్యతిరేకిస్తున్న ఇండియా

బీఆర్ఐని ఇండియా బహిరంగంగానే వ్యతిరేకిస్తోంది. బీఆర్ఐలో భాగంగా చైనా, పాకిస్థాన్ ఎకనమిక్ కారిడర్ ప్రాజెక్టు(డీపీఈఆర్) ఇంటర్నేషనల్ బార్డ‌ర్ చట్టాలు, ఇండియా, -పాకిస్తాన్ మధ్యన ఉన్న లైన్ ఆఫ్ కంట్రోల్కు సంబంధించి యునైటెడ్ నేషన్స్ తీర్మానాలను ఉల్లంఘిస్తోంది. చైనాలోని కష్గర్ నుంచి పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని గిల్గిత్, బాల్టిస్తాన్ మీదుగా కరాచీలోని గ్వదర్ రేవుకు నేరుగా ఈ బీఆర్ఐ రూట్ వెళ్తోంది. ఈ ప్రాజెక్టు కోసం ఇండియా ప్రభుత్వ అనుమతి కోరడంగాని లేదా మన ప్రభుత్వాన్ని విశ్వాసంలోకి తీసుకోవడంగాని చైనా చేయలేదు. ఇండియా బార్డ‌ర్ సమగ్రతను ఉల్లంఘించేలా పాక్ తో చేతులు కలిపి చైనాఈ పనులు చేపడుతోంది. బీఆర్ఐని సాకుగా చూపి భారీ పెట్టుబడులు పెడుతూ పాకిస్తాన్ ప్రభుత్వాన్ని చైనా తన అధీనంలోకి తెచ్చుకుంది. ఒక రకంగా పాకిస్తాన్ ను చైనా కాలనీగా మనం చెప్పుకోవచ్చు. ఎకనమిక్ కారిడర్ కోసం మౌలిక సదుపాయల సాకుతో పాక్ ను ఉపయోగించుకుంటూ భౌగోళికంగా ఇండియాను ఇరుకున పెట్టాలనే వ్యూహంలో చైనా ఉన్నట్టు తేట తెల్లమవుతోంది. పాకిస్తాన్ లో చైనా పెడుతున్న పెట్టుబడులు ఆ విషయాన్ని బలపరుస్తున్నాయి.

చైనాకు గుణపాఠం తప్పదు

ఇప్పుడు 20 మంది ఇండియా జవాన్లను హతమార్చడం కయ్యానికి కాలు దువ్వే చైనా అజెండాకు ఆరంభంగా చెప్పవచ్చు. దీని ద్వారా సుదీర్ఘ కాలంగా సాగుతున్న సరిహద్దు ఘర్ష‌ణలోకి ఇండియాను లాగాలన్నది చైనా అభిమతంగా కనిపిస్తోంది. తన వాణిజ్య, సైనిక శక్తితో ప్రపంచంపై పెత్తనం సాగించాలనే తలంపు కలిగిన చైనా.. తన పక్కన శాంతిని కోరే ఇండియా ఉండటం ప్రమాదకరమని భావిస్తోంది. పాక్ అక్రమణలో ఉన్న పీవోకేను తిరిగి స్వాధీనం చేసుకోవడం ఇండియా తదుపరి వ్యూహాత్మక అడుగనే విషయాన్ని చైనా గుర్తించింది. తమ సరిహద్దులను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు పాక్ పై ఇండియా సైనిక దాడి జరిపినా ఆ విషయంలో తాను నోరెత్తలేనని చైనాకు అర్ధ‌మవుతోంది. ఒకవేళ నిజంగానే సైనిక చర్య చేపట్టాల్సి వస్తే అందులో ఇండియా గెలుస్తుందని చైనాకు ముందే తెలుసు. పీవోకేను ఇండియా తిరిగి తన అధీనంలోకి తెచ్చుకుంటే అది బీఆర్ఐ ప్రస్తుత రూపానికి విఘాతమనే విషయం చైనాకు అర్ధ‌మవుతుంది.

ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా ఇండియా శక్తియుక్తులను నిలువరించేందుకేప్రాంతీయ, భౌగోళిక, రాజకీయ పట్టు పెంచుకునేందుకు చైనా ప్రయత్నిస్తోందన్నది కాదనలేని నిజం. “బీఆర్ఐని రక్షించండి” అనే నినాదంతో చైనా ఇప్పుడు ఇండియాను సరిహద్దు వివాదాల్లోకి లాగుతోంది. ఇది అనేక సరిహద్దు ప్రాంతాల్లో దీర్ఘకాలం సాగుతుంది, రక్త పాతాన్నీ సృష్టిస్తుంది. బీఆర్ ఐ పేరుతో పెట్టుబడులు పెట్టిన ఇతర స్లీపర్ సెల్స్ ను ఇది యాక్టివేట్ చేస్తుంది. చైనా అడుగులకు మడుగు లొత్తుతూ ఇప్పటికే ఇండియాతో నేపాల్, పాకిస్థాన్ సరిహద్దు ఘర్ష‌ణలు ప్రారంభించాయి. తమ దేశాన్ని, సరిహద్దులను ఎలా కాపాడు కోవాలో స్పష్టంగా తెలిసిన సమర్థులు, సుశిక్షితులు, స్ఫూర్తిమంతమైన సాయుధ బలగాలు ఇండియాకు ఉన్నాయి. యుద్ధం తప్పనిసరైతే వివిధ ప్రదేశాల్లో, వివిధ వేదికల్లో ఎలా పోరాటం చేయాలో ఇండియాకు తెలుసు. చైనా కచ్చితంగా గుణపాఠం నేర్చుకుంటుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం

Latest Updates