మేమూ బాధితులమే…నేరస్తులం కాదు

  • యూఎస్ దర్యాప్తుకు అంగీకరించేది లేదు
  • అమెరికాలో పుట్టిన హెచ్ఐవీ, ఆర్థిక సంక్షోభం గురించి మాట్లాడరేం
  • విమర్శలపై ఎదురుదాడికి దిగిన చైనా

బీజింగ్ : కరోనా వైరస్ కు మేమూ బాధితులమేనని చైనా తెలిపింది. ప్రపంచాన్ని పట్టి పీడిస్తోన్న కరోనా మహమ్మారికి చైనాయే కారణమంటూ విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆ దేశం స్పందించింది. కరోనా సృష్టించింది చైనా కాదని దానికి మేమూ బాధితులమేనని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి గెంగ్‌ షువాంగ్‌ తెలిపారు. ” కరోనా వైరస్ మానన జాతి మొత్తానికి శత్రువు. అది ఎప్పుడైనా ఏ దేశం పైనైనా విరుచుకుపడవచ్చు. మేమూ బాధితులమే నేరస్తులం కాదు. ఈ వైరస్ ను తయారు చేసింది మేము కాదు ” అని అన్నారు. కరోనా వైరస్ ఎలా పుట్టిందన్న దానిపై విచారణకు తమను అనుమతించాలన్న అమెరికా డిమాండ్ ను చైనా కొట్టిపారేసింది. వుహాన్ లో వైరస్ ను గుర్తించిన నాటి నుంచి ఇప్పటివరకు అన్ని విషయాల్లో బాధ్యతగా, పారదర్శకంగా వ్యవహారించామని చైనా తెలిపింది. ఇప్పటికే వుహాన్ ల్యాబ్ నుంచి వైరస్ లీక్ అయ్యిందా అన్న దానిపై అమెరికా విచారణ స్టార్ట్ చేసింది. చైనా మాత్రం అమెరికాను తమ దేశంలో దర్యాప్తుకు అనుమతించమని స్పష్టం చేసింది.
అమెరికాను ఎందుకు ప్రశ్నించలేదు
ప్రపంచం మొత్తం కరోనా వ్యాప్తి చెందేందుకు చైనా నిర్లక్ష్యమే కారణమంటూ ఆ దేశంపై దావా వేయాలని పలు దేశాలు డిమాండ్ చేస్తుండటంపై డ్రాగన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. 2009 లో స్వైన్ ప్లూ అమెరికాలోనే బయటపడిందని, హెచ్ఐవీ, 2008 నాటి ఆర్థిక సంక్షోభం అమెరికాలోనే మొదలయ్యాయని గెంగ్ షువాంగ్ చెప్పారు. ఇవన్నీ ప్రపంచదేశాలను కుదిపేసినప్పుడు అమెరికాను ఎందుకు ప్రశ్నించలేదని అడిగారు. చైనాలో ఇంటర్నేషనల్ టీమ్ విచారణ జరపాలన్న ఆస్ట్రేలియా డిమాండ్ ను కూడా చైనా ఖండించింది.

Latest Updates