కరోనా ఎఫెక్ట్:​ చైనా పంపిన స్టాక్​ మొత్తం అయిపోతోంది..

చైనా ఫ్యాక్టరీల బంద్​తో ఇండియన్ ఆటో,

కన్జూమర్ డ్యూరబుల్స్, ఎలక్ట్రానిక్స్, మొబైల్స్​, ఫార్మా విలవిల

కరోనా వైరస్ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. చైనాతో పాటు.. ప్రపంచ దేశాలన్నింటినీ వణికిస్తోంది. ఇటు ప్రజలను, అటు కార్పొరేట్ వర్గాలను కలవరపరుస్తోంది. కరోనా ఎఫెక్ట్‌‌తో చైనాలో మరో కొన్ని రోజుల పాటు జనాలు బయటికి రాకుండా.. సెలవులను పొడిగించాలని చూస్తోంది ఆ ప్రభుత్వం. ఈ ఎఫెక్ట్‌‌ ప్రపంచ దేశాలపై మామూలుగా ఉండేలా కనిపించట్లేదు. ఇప్పటికే సప్లయి కొరతతో ఫుడ్ నుంచి ఫ్యాషన్, ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్, టెక్నాలజీ, ఫార్మా, ఆటో వంటి చైనా దిగుమతులపై ఆధారపడ్డ అన్నిరంగాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. ఉన్న  స్టాక్​తో వ్యాపారాలను అంతోఇంతో లాక్కొస్తున్నాయి కొన్ని కంపెనీలు. కానీ ఇప్పుడు మరికొన్ని రోజుల పాటు ప్రొడక్షన్ క్లోజ్ అయితే.. ప్రపంచ దేశాల పరిస్థితేమిటన్నది ప్రశ్నార్థకంగా ఉంది. చైనాలోని ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు.. లూనార్ న్యూఇయర్ హాలిడేను అక్కడి అథారిటీలు  ఈ నెల 17 వరకు పొడిగిస్తారని తెలుస్తోంది. గ్రేటర్ చైనాతో పాటు పలు కీలక ప్రావినెన్స్‌‌లో ఈ హాలిడే పొడిగింపు ఉంటుందని సమాచారం. ఇప్పటికే న్యూఇయర్ హాలిడేస్ సోమవారంతో ముగిశాయి. ఈ హాలిడేస్‌‌ను పొడిగిస్తే.. ఆయా ప్రాంతాల్లోని కంపెనీలు, ఫ్యాక్టరీలు తెరవడానికి వీలుండదు. దీంతో ఇండియాతో సహా గ్లోబల్‌‌గా చైనాతో ముడిపడి ఉన్న కంపెనీలన్నీ ప్రభావితమవుతాయి. కరోనా విజృంభించిన ప్రాంతాల నుంచి ప్రజలను వేరే ప్రాంతాలకు రానీయడం లేదు. అయితే టెక్ కంపెనీ ఆపిల్ సప్లయిర్ ఫాక్స్‌‌కాన్‌‌ చైనాలో సోమవారం నుంచి ప్రొడక్షన్ ప్రారంభించాలని చూసినా.. అక్కడి అథారిటీలు అనుమతించలేదు. దీంతో ఫాక్స్‌‌కాన్ కూడా ప్రొడక్షన్ ప్రారంభించాలన్న తన ప్లాన్‌‌ను విరమించుకుంది.  చైనాలోని కొన్ని గ్లోబల్ కారు తయారీ కంపెనీలు వచ్చే రెండు వారాల తర్వాతే ప్రొడక్షన్ ప్రారంభిస్తాయని తెలుస్తోంది. కొన్ని కంపెనీలైతే.. ప్రొడక్షన్ ఎప్పుడు ప్రారంభించాలన్నది కూడా డిసైడ్ కాలేదు.

ఈ నెల 17 డెడ్‌‌లైన్ కూడా మళ్లీ పొడిగించరనే గ్యారెంటీ లేదని చైనాకు చెందిన ఇండస్ట్రీ వర్గాలంటున్నాయి. ఎక్కువ కాలం డెడ్‌‌లైన్‌‌ పొడిగిస్తే.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీల్లో ఆందోళనకర పరిస్థితులే ఎదురవుతాయి. ఎందుకంటే.. ప్రపంచంలో ఉన్న చాలా కంపెనీలకు ముడి సరుకులు, ఆటో పార్ట్స్‌‌, బల్క్ డ్రగ్స్, ఎలక్ట్రానిక్ ఉపకరణాలను చైనానే సప్లయి చేస్తోంది.  ఆటో, కన్జూమర్ డ్యూరబుల్స్, ఎలక్ట్రానిక్స్ వంటి మేజర్ ఇండస్ట్రీస్‌‌కు ఇప్పటికే చైనా నుంచి సప్లయి తగ్గిపోయింది. ఆటో మొబైల్ కంపెనీలు, కన్జూమర్ డ్యూరబుల్ మాన్యుఫాక్చరర్స్ కు చైనా నుంచి వచ్చే షీటు మెటల్, ఎలక్ట్రానిక్ పార్ట్స్‌‌ సప్లయి తగ్గిపోతుందని ఇండస్ట్రీ నిపుణులు చెప్పారు. అదేవిధంగా ఇండియన్ బల్క్ డ్రగ్ మార్కెట్‌‌కు వచ్చే బల్క్ డ్రగ్స్ సప్లయిలో కూడా అంతరాలు చోటు చేసుకుంటాయని ఫార్మా వర్గాలంటున్నాయి. ఇప్పటికే ఇండియాలో బల్క్ డ్రగ్ రేట్లు కూడా పెరిగిపోయాయి.

ఇండియాలోని మనందరికీ ఇది చాలా క్లిష్ట పరిస్థితని కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ప్రెసిడెంట్ విక్రమ్ కిర్లోస్కర్ అన్నారు. ఇప్పుడు రియల్ ఛాలెంజ్‌‌ను ఎదుర్కొంటున్నామని మహింద్రా అండ్ మహింద్రా చీఫ్ పర్చేజ్ ఆఫీసర్ హేమంత్ సిక్కా అన్నారు. మొత్తం గ్లోబల్ సప్లయి చైన్‌‌కు అంతరాయం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఇబ్బంది కేవలం ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీకి మాత్రమే కాదని, చైనీస్ పార్ట్స్‌‌పై ఆధారపడ్డ.. అన్ని ఇండస్ట్రీస్‌‌కు ఇదే పరిస్థితి ఎదురవుతుందన్నారు. పెద్ద మొత్తంలో కంపెనీలు చైనీస్ సప్లయిలపై ఆధారపడి ఉన్నాయి. అక్కడి ఫ్యాక్టరీలు మరికొంత కాలం క్లోజ్ అయితే.. ఇండియన్ కంపెనీలు వేరే మార్గాలను వెతుక్కోవాల్సి ఉంది. ఇది అంత తేలిక కాదని సిక్కా అభిప్రాయం. ప్రస్తుతం 90 శాతం మొబైల్ ఫోన్లు ఇండియాలో అసెంబుల్ అవుతున్నా.. కొన్ని కీలకమైన పార్ట్స్‌‌ను చైనా నుంచే తెప్పిస్తున్నారు. చైనాలో ఫ్యాక్టరీలు క్లోజ్ కావడం ఇక్కడి మొబైల్ ఫోన్లకు భారీగా దెబ్బకొడుతోంది. కరోనా వైరస్‌‌ వల్ల ధరలు పెంచాలని చూస్తున్నామని, సప్లయి పడిపోయిందని, కానీ డిమాండ్ తగ్గలేదని ఓ టీవీ తయారీదారి చెప్పారు.

మార్కెట్లకు కరోనా భయం

కరోనా భయంతో స్టాక్ మార్కెట్ పడిపోయింది. 162 పాయింట్లు పడిన సెక్సెక్స్ 40,980 వద్ద ముగిసింది. నిఫ్టీ 67 పాయింట్ల నష్టంతో 12,032 వద్ద క్లోజైంది. కరోనా వైరస్ గ్లోబల్ ఎకానమీపై తీవ్ర ప్రభావం చూపుతుందన్న కారణంతో అటు ఆసియన్ మార్కెట్లు కుప్పకూలాయి. టోక్యో, హాంకాంగ్, సియోల్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి.

టెక్ కంపెనీలపై దెబ్బ..

ప్రొడక్ట్‌‌ల తయారీలో యాపిల్‌‌కు చైనా అతిపెద్ద హబ్‌‌గా ఉంది. కరోనా వైరస్ వల్ల ఎయిర్‌‌‌‌పాడ్స్ షిప్‌‌మెంట్లు తగ్గే అవకాశం ఉంది. తర్వాతి ఐఫోన్ సప్లయి కూడా ఆలస్యం కానుంది. చైనాలోని ఆపిల్ స్టోర్లు, ఆఫీసులు క్లోజయ్యాయి. ప్రొడక్షన్ తగ్గడంతో, టీవీల ధర పెరిగింది. ముఖ్యంగా ఎల్‌‌సీడీ టీవీ ప్యానల్స్ ఖరీదైనవిగా మారాయి. ఓక్యులస్ వీఆర్ హెడ్‌‌సెట్‌‌ ప్రొడక్షన్‌‌ను ఫేస్‌‌బుక్‌‌ పోస్ట్ పోన్ చేసింది. అమెజాన్ ఏకంగా మొబైల్ వరల్డ్  కాంగ్రెస్‌‌లో పాల్గొనకూడదని నిర్ణయించుకుంది. ఎల్‌‌జీ ఎలక్ట్రానిక్స్, ఎరిక్సన్, ఎన్‌‌విడియా తర్వాత అమెజాన్ కూడా ఈ సదస్సు నుంచి వైదొలిగింది.

చైనాలోని కరోనా వైరస్, తీవ్ర ప్రభావం చూపుతోంది.  కరోనా ఎఫెక్ట్ ఎంత అనేది ఫ్యాక్టరీలు మళ్లీ ప్రారంభమయితే కానీ తెలియదు. ఇండియాకు అయితే సౌత్‌‌ఈస్ట్ ఏసియా, తైవాన్, యూరప్,యూఎస్, జపాన్ నుంచి  సప్లయి చైన్లు ఉన్నాయి. అయితే ఇది చాలా సీరియస్ విషయం.  వ్యాపారాల కంటే కూడా మాకు చైనాలో ఉన్న మా టీమ్ సభ్యులు, పార్టనర్ల సేఫ్టీనే ముఖ్యం..

– మను కుమార్ జైన్, ఎండీ, షియోమి ఇండియా

మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి

Latest Updates