కజకిస్థాన్‌ను భయపెడుతున్న న్యుమోనియా.. కరోనాను మించి మరణాల రేటు!

బీజింగ్: కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచం మొత్తం బెంబేలెత్తుతున్న సంగతి తెలిసిందే. తాజాగా కరోనాను మించిన ఓ న్యుమోనియా వచ్చిందని తెలుస్తోంది. కజకిస్థాన్‌లోని చైనీస్‌ ఎంబసీ తమ దేశ పౌరులను గుర్తు తెలియని న్యుమోనియాతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. సెంట్రల్ ఏషియన్ కంట్రీ అయిన కజకిస్థాన్‌లో ఒక్క జూన్‌లోనే ఈ న్యుమోనియా బారిన పడి 600 మందికి పైగా చనిపోయారనే వార్త ప్రకంపనలు సృష్టిస్తోంది. కరోనా కంటే ఈ న్యుమోనియా వల్ల చనిపోయే వారి సంఖ్య ఎక్కువగా ఉందని, అందుకే కజకిస్థాన్‌లో ఉంటున్న తమ పౌరులను జాగ్రత్తగా ఉండాలని చైనా ఎంబసీ చెప్పింది.

గత ఆరు నెలల్లో ఈ న్యుమోనియా వల్ల కజకిస్థాన్‌లో 1,772 మంది మృత్యువాత పడ్డారని, జూన్‌లో 628 మంది చనిపోయారని, వీళ్లలో చైనీయులు కూడా ఉన్నారని డ్రాగన్ ఎంబసీ పేర్కొంది. చైనా మీడియా ప్రకారం.. కరోనా సోకిన వారి కంటే న్యుమోనియా బారిన పడిన మృతి చెందిన వారి సంఖ్య రెండు నుంచి మూడు రెట్లు ఎక్కువగా ఉందని కజకిస్థాన్ హెల్త్ కేర్ మినిస్టర్ బుధవారం చెప్పారని సమాచారం. కరోనా వ్యాప్తిని నివారించడానికి మార్చి 16న కజకిస్థాన్ లాక్‌డౌన్ అమలు చేసింది. మేలో అన్‌లాక్ చేసింది. అయితే లాక్‌డౌన్ తీసివేసిన తర్వాత తమ దేశంలో ఇన్ఫెక్షన్స్ సంఖ్య చాలా పెరిగిందని, వీటిలో న్యుమోనియా కేసులు భారీగా ఉన్నాయని కజకిస్థాన్ ప్రెసిడెంట్ కసిం జొమ్రాత్ తొకయేవ్ చెప్పారు.

Latest Updates