ఫ్లయింగ్ సాసర్ కాదు.. హెలికాప్టర్

ఫ్లయింగ్​ సాసర్​ భూమ్మీద దిగిందేంది? కొంపదీసి వేరే గ్రహపోళ్లు వచ్చిండ్రా ఏంది? అనుకుంటున్నరా! కానే కాదు.. ఇది ఫ్లయింగ్​ సాసరూ కాదు.. వేరే గ్రహపోళ్లు రానే లేదు. ఇది హెలికాప్టర్​. అత్యంత ఆధునిక ఆయుధాలను తయారు చేస్తున్న చైనా, అందులో భాగంగానే ఈ యూఎఫ్​వో హెలికాప్టర్​ను తయారు చేసింది. ఈ మధ్య టియాంజిన్​లో జరిగిన చైనా హెలికాప్టర్​ ఎగ్జిబిషన్​లో దాని ప్రొటోటైప్​ను చైనా విడుదల చేసింది. ‘సూపర్​ గ్రేట్​ వైట్​ షార్క్​’ అని చైనా మీడియా పిలుస్తోంది. అమెరికన్​ ఏహెచ్​64 అపాచీ, సీహెచ్​53 సీ స్టాలియన్​, రష్యా కేఏ 52, ఎంఐ 26 హెలికాప్టర్ల కన్నా అత్యంత శక్తిమంతమైందట ఈ యూఎఫ్​వో హెలికాప్టర్​.

25 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పున్న ఈ హెలికాప్టర్​లో ఇద్దరు మాత్రమే ప్రయాణించడానికి వీలుందట. రాడార్ల కంటికి చిక్కకుండా ఉండేందుకే ఈ సరికొత్త డిజైన్​ను చైనా తయారు చేసిందట. ఇంజన్లు, రోటార్లు అన్నీ బయటి చిప్పలోనే ఉంటాయట. అయితే, ఫ్లయింగ్​ సాసర్​ స్ఫూర్తిగా తయారు చేసిన తొలి హెలికాప్టర్​ మాత్రం ఇది కాదండోయ్​. ఎందుకంటే 1950లోనే కెనడా అలాంటి ఒక హెలికాప్టర్​ను తయారు చేసింది. దాని పేరు వీజెడ్​ 9 అవ్రోకార్​. ఏవీ రో అనే కంపెనీ తయారు చేసింది. అమెరికా టెస్ట్​ చేసింది. అయితే, మూడడుగులకు మించి అది ఎగరలేకపోయింది. గంటకు 56 కిలోమీటర్ల వేగానికి మించి పోలేకపోయింది. 1961 తర్వాత ఆ ప్రాజెక్టును ఆపేశారనుకోండి.

Latest Updates