నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మళ్లీ కరోనా ముప్పు

బీజింగ్: చైనాలో దాదాపుగా కంట్రోల్ లోకి వచ్చిన కరోనా వైరస్ నవంబర్ లో మళ్లీ తీవ్రంగా వ్యాపించే ప్రమాదం ఉందని చైనీస్ మెడికల్ ఎక్స్ పర్ట్ ఒకరు హెచ్చరించారు. చైనాతో పాటు పలు దేశాల్లో చలికాలం వచ్చాక కరోనా సెకండ్ వేవ్ రావచ్చని ఆయన చెప్పారు. షాంఘై  కరోనా  క్లినికల్ ఎక్స్ పర్ట్ టీం చీఫ్  ఝాంగ్ వెన్ హాంగ్ ఈ మేరకు కరోనా సెకండ్ వేవ్ గురించి తన అభిప్రాయాలను వెల్లడించారు. చైనాలో ప్రస్తుతం విదేశాల నుంచి వస్తున్న పౌరుల వల్ల మాత్రమే వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయన్నారు. చైనాలో కరోనా మళ్లీ వ్యాపించినా, ఇప్పటిలాగా పూర్తిస్థాయి లాక్ డౌన్ చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చని తెలిపారు. అమెరికాలో కరోనా వైరస్ మే నెల చివరినాటికి కంట్రోల్ కావచ్చని వెన్ హాంగ్ అన్నారు. ఈ విపత్తును ఎదుర్కోవడంలో చైనా, అమెరికా రెండూ కలిసి పనిచేయాలని సూచించారు.

‘వుహాన్’ మార్కెట్లు డల్..

చైనాలోని వుహాన్ లో అడవి జంతువులను అమ్మే మార్కెట్లు డల్ అయిపోయాయి. గుడ్లగూబలు, పాములు, ఇతర అడవి జంతువులు, సముద్ర జీవులను లైవ్ గా అమ్మే ఈ మార్కెట్లకు గతంలో జనం విపరీతంగా వచ్చేవారు. కానీ ఇక్కడి  నుంచే కరోనా వైరస్ వ్యాపించిందని చెప్తున్నందువల్ల  వైరస్ భయంతో జనం ఇప్పుడు చాలావరకూ తగ్గిపోయారట. దీంతో లాక్ డౌన్ ఎత్తేశాక ఈ మార్కెట్లను మళ్లీ తెరిచినా, ఏమాత్రం వ్యాపారం సాగడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. మొత్తంగా కరోనా కారణంగా ఈ ఏడాదంతా తమకు గడ్డు పరిస్థితే ఉండొచ్చని అంటున్నారు.

2.5 రోజుల వీకెండ్..

లాక్ డౌన్ వల్ల కంపెనీలు, షాపులు దెబ్బతిన్నందున, ప్రజలు పెద్ద ఎత్తున షాపింగ్ చేస్తే ఆర్థిక వ్యవస్థ మెరుగవుతుందని చైనా సర్కారు భావిస్తోంది. ఇందుకోసం ప్రజలకు 2.5 రోజుల వీకెండ్ ను ప్రకటించాలని భావిస్తోంది. దీనివల్ల వస్తువుల కొనుగోళ్లు పెరిగితే, కుదేలైన కంపెనీలు, పరిశ్రమలు కోలుకుంటాయని యోచిస్తోంది.

Latest Updates