చైనా వంకర బుద్ధి : పాంగోంగ్ సరస్సు భారత్ సరిహద్దు ప్రాంతాల్ని ఆక్రమించుకుంటున్న డ్రాగన్ కంట్రీ

భారత్‌ – చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు తారాస్థాయికి చేరుకున్నాయి. గల్వాన్‌ లోయ ఘర్షణ అనంతరం పొరుగు దేశం చైనా తన వంకర బుద్ధిని మార్చుకోవడం లేదు. ఓ వైపు చర్చల పేరుతో శాంతియుతంగా ఉద్రిక్తలను తగ్గించుకుందాం అని చెబుతూనే మరోవైపు కయ్యానికి కాలు దువ్వుతోంది.

పాంగోంగ్ సరస్సు భారత భూభాగాన్ని ఆక్రమించుకున్న చైనా 

ఎన్డీటీవీ కథనం ప్రకారం.. భారత్ భూభాగంలో ఉన్న లడఖ్ పాంగోంగ్  (పాంగోంగ్‌ త్సో) సరస్సు ప్రాంతాన్ని  చైనా సైన్యం ఆక్రమించుకున్నట్లు కొన్ని ఆధారాలు వెలుగులోకి వచ్చాయి.

చైనా ను వ్యతిరేకిస్తూ భారత్ కు మద్దతు పలికే టిబిట్ కొన్ని శాటిలైట్ ఫోటోల్ని విడుదల చేసింది. లడక్ పాంగోంగ్‌  సరస్సు ప్రాంతంలో ఉన్న సరిహద్దుల్ని ఫింగర్స్ అని పిలుస్తారు. ఆ ఫోటోల్లో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కమాండర్ వాంగ్ హాజియాంగ్ నేతృత్వంలో లడఖ్ పాంగోంగ్‌ సరస్సు లోని భారత భూభాగమైన  ఫింగర్ -4, ఫింగర్ -5 సరిహద్దుల్లో 81మీటర్ల పొడవు, 25మీటర్ల వెడల్పు ప్రాంతాన్ని ఆక్రమించుకొని భారత్ – చైనా బోర్డర్ లో డ్రాగన్ కంట్రీ తన బుద్ధిని మరో సారి బయట పెట్టింది.

లడక్ పాంగోంగ్‌  సరస్సు సరిహద్దుల్లో ఉన్న ‘ఫింగర్ 1’ నుండి ‘ఫింగర్ 8’ వరకు తమ ఆదీనంలో ఉందని  భారత్ చెబుతుండగా… ‘ఫింగర్ 8’ నుంచి ‘ఫింగర్ 4’ వరకు తమకు హక్కు ఉందని చైనా అభిప్రాయపడింది. ప్రస్తుతానికి, ‘ఫింగర్ 4’ ను ఆక్రమించుకునేందుకు చైనా కొద్దిరోజుల క్రితం డజన్ల కొద్ది సైనికుల్ని మోహరించింది. భారత్ సైతం తన సైనికుల్ని మోహరించింది. ఆ సమయంలో సరిహద్దులో ఏర్పాటు చేసిన ఇనుప కంచెల తో చైనా సైనికులు భారత సైనికుల పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన వీడియోలు వెలుగులోకి వచ్చాయి.  ‘ఫింగర్ 4’ వద్ద భారీగా మోహరించిన చైనా సైనికులు  ఫింగర్ 8లో  భారత సైనికులు స్థావరాల్ని ఏర్పాటు చేసుకునేందుకు ఒప్పుకోలేదు.

ఇరు దేశాల సైనికులు పహార కాసే రిడ్జ్ లైన్ లో ఉన్న భారత భూభాగాన్ని ఆక్రమించుకున్న చైనా  

ప్లానెట్ ల్యాబ్స్ నుండి వెలుగులోకి వచ్చిన ఫోటోల ఆధారంగా ఫింగర్ – 4 ప్రాంతంలో భారత్ – చైనా సైనికుల మధ్య హింసాత్మాక ఘర్షణ తరువాత .. ఫింగర్ – 4 నుంచి ఫింగర్ – 6 వరకు ఉన్న ఆ ప్రాంతంలోకి భారత సైనికులు పెట్రోలింగ్ నిర్వహించేందుకు వీలు లేకుండా చైనా సైనికులు 186 స్థావరాల్ని ఏర్పాటు చేసుకున్నారు.  చైనా ఆక్రమించిన పాంగోంగ్ సరిహద్దు ప్రాంతాల్నే కాకుండా 8 కిలోమీటర్ల దూరంలో ఒక రిడ్జ్-లైన్ వెంట భూభాగం వరకు చైనా సైనికులు విస్తరించారు. ఫింగర్ – 5 దగ్గర రెండు చైనీస్ ఫాస్ట్ ఇంటర్‌ సెప్టర్ క్రాఫ్ట్‌ (బోట్లు) లను ఏర్పాటు చేసింది. భారత సైనికులు పహార కాస్తున్న  ఫింగర్ – 1 మరియు  ఫింగర్ – 3  చైనా ఆక్రమించుకునేందుకు స్పష్టమైన ఆధారాలు లేనప్పటికి   ఫింగర్ – 4 వద్ద చైనా తన స్థావారాల్ని ఏర్పాటు చేసుకుంటున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.

లడక్ ఆక్రమించే వారికి బుద్ధి చెప్పి తీరుతాం – ప్రధాని మోడీ

ఇదే విషయంపై ప్రధాని మోడీ స్పందించారు. చైనా ఆక్రమిస్తున్న ప్రాంతం పేరు ప్రస్తావించకుండా  లడక్ లోని భారత భూభాగాన్ని ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నవారికి తగిన రీతిలో బుద్ధి చెబుతాం . కానీ భారత్ స్నేహాన్ని కోరుకుంటుంది అని బోర్డర్ లో చైనా చేస్తున్న కుట్రలపై పరోక్షంగా వ్యాఖ్యానించారు. జూన్ 27న చైనాలోని భారత రాయబారి విక్రమ్ మిస్త్రీ మాట్లాడుతూ ఏ విరోధికై నా బుద్ధి చెప్పగల సామర్ధ్యం భారత్ కు ఉంది అంటూ హెచ్చరించారు. పెట్రోలింగ్ చేస్తున్న భారత దళాల్ని అడ్డుకుంటున్న చైనా తన వైఖరిని మార్చుకోవాలని సూచించారు.

భారత్ శాంతి మంత్రం..కవ్వింపులకు పాల్పడుతున్న చైనా 

కాగా శాంతియుత వాతావరణానికి కట్టుబడి ఉన్నామంటూ పదేపదే చెబుతోన్న భారత్..ఆ దిశగా మరోసారి ముందడుగు వేసింది. వాస్తవాధీన రేఖకు ఇవతల భారత భూభాగంపై గల ఛుసుల్ ప్రాంతంలోని బోర్డర్ ఆఫీసర్స్ మీటింగ్ పాయింట్ (బీఓఎంపీ)లో భారత ఆర్మీ, చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన లెప్టినెంట్ కమాండర్ స్థాయి అధికారులు సారధ్యంలో ఈ రోజు ఉదయం 10.30నుంచి ప్రారంభమైన సమావేశం ఇంకా కొనసాగుతోంది.  ఇదివరకు ఈ నెల 6, 22వ తేదీల్లోనూ ఈ రెండు దేశాల మధ్య చర్చలు కొనసాగినప్పటికీ.. ఎలాంటి ఫలితాలూ రాలేదు. మూడోసారి భారత భూభాగంపై చర్చలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది.

 

Latest Updates