హాంకాంగ్​కు చైనా ఆర్మీ?

  •   షెంజెన్ సాకర్ స్టేడియంలో చైనా యుద్ధ వాహనాల మోహరింపు
  •   500లకు పైగా వెహికిల్స్ ఉన్నట్లు చూపుతున్న శాటిలైట్ ఇమేజెస్
  •  హాంకాంగ్ బోర్డర్‌లోకి  వస్తున్న దళాలు
  •  చైనా సైనిక చర్యకు దిగొచ్చు: అమెరికా అధ్యక్షుడు ట్రంప్

హాంకాంగ్‌‌ అల్లర్లను  ఉక్కుపాదంతో అణిచేయడానికి చైనా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఆందోళనకారుల్ని అణిచేయడానికి  హాంకాంగ్‌‌ బోర్డర్‌‌లో ఉన్న  షెంజన్‌‌ సిటీ స్టేడియంలోకి పీపుల్స్‌‌ ఆర్మీని పంపింది. శాటిలైట్‌‌ ఫొటోల్లో  కూడా వార్‌‌ వెహికల్స్‌‌ కనిపిస్తున్నాయి. మరోవైపు,  ఆందోళనకారులతో కలిసిపోయి..హింసను ప్రేరేపించడం ద్వారా నిరసనలంటేనే సాధారణ జనానికి విసుగుపుట్టేలా ప్లాన్‌‌ చేసిందన్న వార్తలూ వస్తున్నాయి..

హాంకాంగ్: 

నేరస్తుల అప్పగింత బిల్లుకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలతో అట్టుడుకుతున్న హాంకాంగ్​పై ఉక్కుపాదం మోపేందుకు చైనా సిద్ధమవుతోందా?  దీనికోసం చైనా–హాంకాంగ్ సరిహద్దుల్లోకి సైనికులను పంపుతోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. చైనా పీపుల్స్ ఆర్మ్​డ్​ఫోర్స్‌‌‌‌‌‌‌‌కు చెందిన యుద్ధ వాహనాలు హాంకాంగ్​షెంజెన్ సిటీలోని సాకర్ స్టేడియంలో పార్క్ చేసినట్లుగా శాటిలైట్ ఫొటోల్లో కనిపించింది. 500లకు పైగా వెహికిల్స్ ను  పార్క్‌‌‌‌‌‌‌‌ చేసినట్టు ‘మాక్సర్ వరల్డ్ వ్యూ’  రిలీజ్‌‌‌‌‌‌‌‌ చేసిన పిక్చర్స్​లో కనిపించింది. అంతకుముందు బీజింగ్ నుంచి సెక్యూరిటీ ఫోర్స్‌‌‌‌‌‌‌‌ను చైనా పంపించింది. ఈ బలగాలు హాంకాంగ్ లో అడుగుపెడుతున్న వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో ప్రొ–డెమోక్రసీ  ఆందోళనలను అణచివేసేందుకు చైనా తన ప్రయత్నాలను మరింతగా పెంచిందని ఎక్స్​పర్టులు అంటున్నారు. హాంకాంగ్​లో టెర్రరిజం ఆనవాళ్లు కనిపిస్తున్నాయని, అందుకే చైనా ప్రభుత్వం సోల్జర్లను అక్కడికి పంపిందని చైనా స్టేట్ మీడియా చెప్పింది.

పక్కా వ్యూహంతోనే

హాంకాంగ్​లో ఇంత జరుగుతున్నా అక్కడికి చైనా ప్రధాన భూభాగం నుంచి పోలీసులను కానీ, ఆర్మీని కానీ అధికారికంగా పంపలేదు. అక్కడ నెలకొన్న పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కూడా మోహరించడం లేదు.హాంకాంగ్ పోలీసుల్లో ధైర్యం నింపేందుకు తమ ఆఫీసర్లను పంపింది.  నిరసనలను తప్పుదోవ పట్టించేందుకు కొందర్ని  ప్రొటెస్టర్లలో కలిసిపోయేలా చేసింది. మరింత హింసను ప్రేరేపించేలా, తద్వారా నిరసనలపై సాధారణ ప్రజల్లో వ్యతిరేకత వచ్చేలా చేయాలని భావిస్తోంది. అయితే ఇప్పటికైతే మార్పు కనిపించకున్నా… ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్నాయి. ఎయిర్​పోర్టును ముట్టడించడం, పోలీసులు వారిపై  దాడి చేయడం చైనా వ్యూహంలో భాగంగానే జరుగుతున్నాయని చెబుతున్నారు.  చైనా మిలటరీ యాక్షన్​కు దిగితే 30 ఏళ్ల కిందట జరిగిన ‘తియానన్మెన్ స్క్వేర్’ మారణహోమం మరోసారి రిపీట్ అవుతుందేమోనని స్థానికులు భయాందోళన చెందుతున్నారు.

ఎయిర్​పోర్టు కార్యకలాపాలు ప్రారంభం

బుధవారం ఉదయం హాంకాంగ్ ఎయిర్​పోర్టు నుంచి విమానాలు బయలుదేరి వెళ్లాయి. మంగళవారం వందల సంఖ్యలో విమానాలు రద్దయ్యాయి. ఈ క్రమంలో అర్ధరాత్రి దాటాక చాలామంది నిరసనకారులు ఎయిర్​పోర్టును వదిలివెళ్లారు. దీంతో తెల్లవారుజాము నుంచే సర్వీసులు మొదలయ్యాయి. బుధవారమంతా వందలాది విమానాలు  తిరిగాయి. అందులో చాలా వరకు ఆలస్యమయ్యాయి. ‘‘ఎయిర్​పోర్టుల్లోని చెక్​ఇన్ డెస్క్​లు మామూలుగానే పని చేస్తున్నాయి. అక్కడక్కడ కొందరు ప్రొటెస్టర్లు మాత్రమే ఉన్నారు. అందులో చాలా మంది నిద్రపోతున్నారు” అని ఓ రిపోర్టర్ చెప్పాడు.

యువకులు, చదువుకున్నోళ్లే ఎక్కువ

ఆందోళనలు చేస్తున్న వారిలో యువకులు, యూనివర్సిటీల్లో చదువుకున్న వాళ్లే ఎక్కువగా ఉన్నారని ఓ అకడమిక్ సర్వే వెల్లడించింది. అందులో సగం మంది వయసు 20 ఏళ్ల లోపువాళ్లేనని , వీరంతా పోలీసులను చూస్తేనే అసహించుకుంటున్నారని చెప్పింది. పలు యూనివర్సిటీలకు చెందిన రీసెర్చర్లు జూన్ 9 నుంచి ఆగస్టు 4 మధ్య జరిగిన 12 మాస్ ప్రొటెస్టులపై సర్వే చేశారు. నిరసనల్లో పాల్గొన్న వారిలో 54 శాతం మంది మగాళ్లు, 46 శాతం మంది ఆడాళ్లు ఉన్నట్లు గుర్తించారు. సర్వేలో పాల్గొన్న వారిలో 77 శాతం మంది హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుకున్నట్లు చెప్పారు. ప్రొటెస్టర్లలో 20 నుంచి 29 ఏళ్ల వయసు ఉన్న వారు 50 శాతం మంది ఉన్నారు. 50 శాతం మంది మిడిల్ క్లాస్ ప్రజలు ఉన్నారు. నేరస్తుల అప్పగింత బిల్లును వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్​తో తాము నిరసన చేస్తున్నట్లు87 శాతం మంది చెప్పారు.

టెర్రరిస్టుల్లా దాడి చేస్తారా?

నిరసనకారులు హాంకాంగ్ ఎయిర్​పోర్టును ముట్టడించడం, అది కాస్తా హింసాత్మకంగా మారడంపై చైనా తీవ్రంగా స్పందించింది. చైనా పౌరులపై టెర్రరిస్టుల్లా దాడి చేస్తారా అంటూ మండిపడింది. ‘‘టెర్రరిస్టుల్లా ప్రవర్తించడాన్ని మేం ఖండిస్తున్నాం. ప్రొటెస్టర్లు దాడి చేసిన ఇద్దరు వ్యక్తులు చైనాకు చెందిన వారు” అని స్టేట్ కౌన్సిల్​లో హాంకాంగ్, మకావ్ వ్యవహారాల అధికార ప్రతినిధి జు లూయింగ్ అన్నారు.

ఎయిర్​ ఇండియా సర్వీసులు రద్దు

హాంకాంగ్‌‌లో నెలకొన్న పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని అక్కడికి వెళ్లే, వచ్చే  అన్ని విమానాలను ఎయిర్‌‌ ఇండియా బుధవారం రద్దుచేసింది. ఈనెల 12 నుంచి 16 వరకు రీ ఇష్యూ, రీ బుకింగ్‌‌, తేదీ మార్పు, క్యాన్సిలేషన్‌‌, రిఫండ్‌‌పై వసూలు చేసే అన్ని చార్జీలను రద్దు చేసినట్టు ఒక ప్రకటనలో తెలిపింది.

హాంకాంగ్ సరిహద్దుల వైపుగా చైనా ప్రభుత్వం బలగాలను పంపుతున్నట్లు అమెరికా ఇంటెలిజెన్స్ నిర్ధారించింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు చైనా మిలటరీ యాక్షన్​కు దిగొచ్చు. అయితే ఇది శాంతియుతంగా జరగాలని కోరుకుంటున్నా. ఎవరూ గాయపడకూడదు, ఎవరూ చనిపోకూడదు. అందరూ ప్రశాంతంగా, సురక్షితంగా ఉండాలి’’

డొనాల్డ్ ట్రంప్‌‌, అమెరికా ప్రెసిడెంట్

‘‘చాలా రోజులుగా ఆందోళనలు చేస్తున్నాం. మేం భయపడ్డాం, అలసిపోయాం, కోపగించుకున్నాం. మాలో కొందరు ఓవర్​గా రియాక్ట్ అయ్యారు. ఆందోళనలు హింసాత్మకంగా మారినందుకు మేం క్షమాపణ కోరుతున్నాం’’

– కొందరు ప్రొటెస్టర్లు

Latest Updates