చైనా స్పాన్సర్​షిప్​తో మనకే లాభం.. కటీఫ్ కుదరదు

  • స్పష్టం చేసిన బీసీసీఐ

న్యూఢిల్లీ: లడఖ్ వ్యాలీలో మన సైనికులను దొంగ దెబ్బ తీసిన చైనా దుశ్చర్యకు దేశమంతా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆ దేశ వస్తువులను బ్యాన్ చేయాలని, కంపెనీలతో ఒప్పందాలు రద్దు చేయాలంటూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో చైనీస్ ప్రొడక్టులను బ్యాన్ చేస్తామని, స్పాన్సర్​షిప్​లను క్యాన్సిల్ చేసేందుకు రెడీ గా ఉన్నామని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రకటించింది. బీసీసీఐ మాత్రం భావోద్వేగాలను బట్టి నిర్ణయం తీసుకోలేమని, ఆ దేశ స్పాన్సర్​షిప్​ల వల్ల మనకే లాభమవుతుంది కాబట్టి వదులుకోలేమని స్పష్టం చేసింది.

సెప్టెంబర్ నెలలో ఐపీఎల్ నిర్వహించాలని సూచనప్రాయంగా నిర్ణయించిన బీసీసీఐ.. ఇలాంటి సమయంలో ఐపీఎల్​కు చైనా స్పాన్సర్​షిప్​ను మార్చడం అంతమంచిది కాదని చెప్తోంది. బీసీసీఐతో ఐదేళ్లకు రూ. 2,199 కోట్లతో ఒప్పందం కుదుర్చుకున్న చైనా కంపెనీ అయిన వివో స్పాన్సర్​షిప్​ను రద్దు చేసుకునే ఆలోచన మాత్రం లేదని బీసీసీఐ మెంబర్ అరుణ్​ ధుమాల్ మీడియాకు స్పష్టం చేశారు. వివో కంపెనీ స్పాన్సర్ షిప్ వల్ల మనదేశానికే లాభం తప్ప చైనాకు కాదని ఆయన పేర్కొన్నారు. స్పాన్సర్​షిప్ పేరిట వివో కంపెనీ ఏటా రూ. 440 కోట్లు ఇండియాకు చెల్లిస్తోంది. ఇందులోంచి దాదాపు 42 శాతం పన్ను రూపంలో బీసీసీఐ ప్రభుత్వానికి చెల్లిస్తోంది. దీంతో ఇండియా ఎకానమీకి లాభం అవుతోందని, 2022 వరకు ఉన్న ఈ డీల్​ ముగిసిన తర్వాత రద్దు గురించి ఆలోచిస్తామని చెప్పారు. బార్డర్  ఇష్యూ ప్రజల్లో ఆవేదన కలిగిస్తున్నప్పటికీ బీసీసీఐ బోర్డు మాత్రం భావోద్వేగాలతో నిర్ణయాలు తీసుకోదని, వాస్తవాలు చూడాలని ఆయన అన్నారు. భావోద్వేగాలతో కాకుండా వాస్తవాలు గమనిస్తే ఆదాయం విషయంలో చైనాకు మనం లాభం చేస్తున్నామా.. లేక చైనా వల్లనే మనకు లాభం చేకూరుతోందా అనేది స్పష్టమవుతుందన్నారు.

Latest Updates