‘చీరాల స్పెష‌ల్ స‌మోసా’ మునీర్ మృతి.. క‌రోనాతో కాదంటూ టెస్ట్ రిపోర్ట్ ఫ్లెక్సీ

ప్ర‌పంచం మొత్తాన్ని క‌రోనా వైర‌స్ వ‌ణికిస్తోంది. ఈ స‌మ‌యంలో ఎవ‌రైనా మామూలు జ‌లుబుతో తుమ్మినా.. ద‌గ్గినా భ‌యంతో చూసే ప‌రిస్థితి నెల‌కొంది. ఆఖ‌రికి ఇత‌ర అనారోగ్య సమ‌స్య‌ల‌తో ఎక్క‌డైనా మ‌ర‌ణాలు సంభ‌వించినా క‌రోనా వ‌ల్లేనేమో అన్న అనుమానంతో చూస్తున్నారు జ‌నాలు. పోలీసులు సైతం జ‌నాల‌ను భారీగా ద‌హ‌న సంస్కారాల‌కు హాజ‌రు కాకుండా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఏ మాత్రం జ‌లుబు, ద‌గ్గు లాంటివి ఉండి మ‌ర‌ణించి ఉన్నా.. డెడ్ బాడీని కూడా ఆస్ప‌త్రికి త‌ర‌లించి క‌రోనా టెస్టులు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో చీరాల‌లో శుక్ర‌వారం ఓ వ్య‌క్తి మ‌ర‌ణించ‌గా.. అత‌డి కుటుంబ స‌భ్యులు క‌రోనాతో కాదంటూ టెస్టు రిపోర్టును పెట్టి ఫ్లెక్సీ వెయించారు.

కిడ్నీ ఫెయిల్యూర్.. క‌రోనా టెస్టు

చీరాల‌కు చెందిన మునీర్ భాయ్ కిడ్నీ స‌మ‌స్య‌తో కొద్ది రోజుల నుంచి ఒంగోలు రిమ్స్ లో చికిత్స పొందుతున్నాడు. ఆరోగ్యం విష‌మించి.. కిడ్నీ ఫెయిల్ కావ‌డంతో శుక్ర‌వారం మ‌ర‌ణించాడు. అయిన‌ప్ప‌టికీ వైద్యులు క‌రోనా టెస్టు కూడా చేశారు. అందులో నెగ‌టివ్ వ‌చ్చింది. అయితే ఓ వైపు క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌బ‌ల‌డం, మ‌రో వైపు ఢిల్లీ మ‌ర్క‌జ్ ఘ‌ట‌న నేప‌థ్యంలో ఎవ‌రు మ‌ర‌ణించినా జ‌నం అనుమానంగా చూస్తుండ‌డంతో ఆ మునీర్ మ‌ర‌ణం క‌రోనాతో కాదంటూ టెస్టు రిపోర్టును పెట్టి ఫ్లెక్సీ వేయించారు కుటుంబ‌స‌భ్యులు.

స్వీట్ స‌మోసాతో ఫేమ‌స్..

స‌మోసా అన‌గానే అంద‌రికీ ఆనియ‌న్ స‌మోసానో లేదా.. ఆలూ స‌మోసానో గుర్తోస్తుంది. కానీ స్వీట్ స‌మోసాతో ఫేమ‌స్ అయ్యాడు మునీర్ భాయ్. ప్ర‌కాశం జిల్లా క‌నిగిరికి చెందిన అత‌డు దాదాపు 30 ఏళ్ల క్రితం బ‌తుకుదెరువు కోసం చీరాల‌కు చేరాడు. అక్క‌డ స‌మోసా వ్యాపారం మొద‌లు పెట్టిన మునీర్.. మంచి లాభాల‌ను చూశాడు. కానీ కొద్ది రోజుల‌కే అత‌డిని చూసి కొంత‌మంది అదే వ్యాపారం మొద‌లుపెట్టారు. దీంతో మునీర్ కు గిరాకీ త‌గ్గింది. కొత్త‌గా ఏదైనా చేయాల‌ని ఆలోచించి.. జీడిప‌ప్పుతో స్వీట్ సమోసా త‌యారు చేయ‌డం స్టార్ట్ చేసి జ‌నాల‌కు వెరైటీ రుచిని ప‌రిచ‌యం చేశాడు మునీర్. దీన్ని అత‌డు త‌యారీ మొద‌లు పెట్టిన కొత్త‌లో జీడిపప్పు కిలో 60 రూపాయ‌లు ఉండేది. అప్పుడు ఒక్కో స‌మోసా నాలుగు రూపాయ‌లకు అమ్మేవాడు. దీని స్పెష‌ల్ టేస్టుతో జ‌నాలు బాగా అట్రాక్ట్ అయ్యారు. త‌ర్వాత కొద్ది రోజుల‌కు చీరాల స్వీట్ స‌మోసాగా ఫేమ‌స్ అయింది. చీరాల‌లోనే కాదు ఇక్క‌డి వారి ఫ్రెండ్స్, బంధువులు ఇత‌ర ప్రాంతాల్లో ఉన్నా కూడా స్వీట్ స‌మోసాస్పెష‌ల్ గా తెప్పించుకునేవాళ్లు. కొన్నాళ్ల‌కు ఈ చీరాల స్వీట్ స‌మోసా అనేది మునీర్ ఇంటి పేరుగా మారిపోయింది.

Chirala sweet samosa Muneer Bhai died of kidney failure: Family set up flexi with corona test report

Latest Updates