విజయ బాపినీడుకు చిరంజీవి, ప్రముఖుల నివాళులు

హైదరాబాద్ : సీనియర్ దర్శకుడు విజయ బాపినీడుకు టాలీవుడ్ అగ్రనటుడు చిరంజీవి నివాళి అర్పించారు. ఆయన మరణం తనను ఎంతగానో కలచివేసిందని చెప్పారు. ‘పట్నం వచ్చిన పతివ్రతలు’ నుంచి ఆరు సినిమాలు చేశానని… ఆయనతో సినిమాలు చేసిన అనుభవం, ఆయన స్నేహం మరిచిపోలేనని చెప్పారు. నా అభిమానులంటే బాపినీడు ఇష్టపడేవారని చెప్పారు. అభిమానులు ఏం కోరుకుంటారో అదే తనతో చేయించేవారని అన్నారు. తనను సొంత తమ్ముడిలా ఆదరించారని అన్నారు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

విజయ బాపినీడు మరణంపై సంతాపం తెలిపారు డాక్టర్ మంచు మోహన్ బాబు. 1990 నుంచి విజయ బాపినీడు తనకు బాగా తెలుసనీ.. అత్యంత సన్నిహితమైన వ్యక్తుల్లో విజయ బాపినీడు కూడా ఒకరని అన్నారు. రామోజీరావు మయూరి సంస్థలో పని చేస్తున్న రోజుల నుంచి తనకు సాన్నిహిత్యం ఉండేదన్నారు. విజయ బాపినీడు మంచి దర్శకుడు మాత్రమే కాదు.. అంతకు మించి మంచి రచయిత.. ఎడిటర్.. అభిరుచి గల నిర్మాత అని అన్నారు. గొప్ప వ్యక్తిని కోల్పోవడం తెలుగు సినిమా పరిశ్రమకు తీరని లోటు అన్నారు మోహన్ బాబు.

Latest Updates