ప్రియురాలిని కిరాతకంగా చంపిన ఢిల్లీబాబు ఆత్మహత్య

chittoor-murder-case-delhi-babu-committed-suicide

చిత్తూరు జిల్లాలోని పనుమూరు మండలం ఎంపర్ల కొత్తూరు చెందిన గాయత్రి అనే యువతిని కిరాతకంగా పొడిచి చంపిన  ప్రేమోన్మాది ఢిల్లీ బాబు ఆత్మహత్య చేసుకున్నాడు. తూర్పుపల్లి అడవుల్లోకి పారిపోయిన ఢిల్లీబాబు.. మంగళవారం రాత్రే చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపారు పోలీసులు. పనుమూరు మండలం ఎంపర్ల కొత్తూరుకు చెందిన ఢిల్లీ బాబు, గాయత్రి అనే ప్రేమజంట రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలోనే రెండు నెలల క్రితం రహస్యంగా పెళ్లి చేసుకున్నారు.

అయితే అప్పటికి గాయత్రి మైనర్‌ కావడంతో ఆమెకు పోలీసులు కౌన్సిలింగ్‌ ఇచ్చి ఇంటికి పంపించేశారు. అప్పటినుంచి గాయత్రి.. ప్రియుడు ఢిల్లీబాబును దూరం పెడుతూ వచ్చింది. ఇది జీర్జించుకోలేని యువకుడు ప్రియురాలు గాయత్రిపై ద్వేషం పెంచుకొని, ఆమెపై 15 సార్లు కత్తితో దాడిచేసి పరారయ్యాడు.  తీవ్ర రక్తస్రావంతో ఆసుపత్రిలో చేరిన గాయత్రి చికిత్స పొందుతూ మృతి చెందింది. యువతిని హత్య చేసిన తర్వాత పరారైన ఢిల్లీబాబు.. గురువారం  తూర్పుపల్లి అటవీ ప్రాంతంలో శవమై కనిపించాడని చెప్పారు పోలీసులు.

Latest Updates