ఆటే మరిచినట్టు..రంజీ ట్రోఫీలో హైదరాబాద్ ఘోర విఫలం

పరుగులు చేయాలన్న తపన లేని బ్యాట్స్‌‌మెన్‌‌..! వికెట్లు తీయాలన్న కసి లేని బౌలర్లు..! గెలవాలన్న ఆకాంక్షలేని ఆటగాళ్లు..! ప్లేయర్లలో కాన్ఫిడెన్స్​ నింపాలన్న ఆలోచన లేని కోచింగ్‌‌ సిబ్బంది..! ఎన్ని విమర్శలు చుట్టుముట్టినా చలనమే లేని సెలెక్టర్లు..! జట్టు ఎలా ఆడితే మాకేంటి.. మాకు కావాల్సిన ప్లేయర్లను ఆడించామా, జేబులు నింపేసుకున్నామా అన్నట్టు పాలకులు..! వెరసి రంజీ ట్రోఫీలో ఎంతో ఘన చరిత్ర ఉన్న హైదరాబాద్‌‌ జట్టు ఈ సీజన్‌‌లో అత్యంత దారుణమైన ఆటతో పరువు పోగొట్టుకుంది..! ఒక్క రంజీ జట్టే కాదు మహ్మద్‌‌ అజరుద్దీన్‌‌ హెచ్‌‌సీఏ ప్రెసిడెంట్‌‌ అయిన నెలల వ్యవధిలో అన్ని ఏజ్‌‌ గ్రూప్‌‌ల జట్లు చెత్తగా ఆడుతూ హైదరాబాద్‌‌కు బ్యాడ్‌‌ నేమ్‌‌ తెస్తున్నాయి..!

హైదరాబాద్‌‌‌‌, వెలుగు:

ఒకరా ఇద్దరా.. గులామ్‌‌‌‌ అహ్మద్‌‌‌‌, ఎమ్‌‌‌‌.ఎల్‌‌‌‌. జైసింహా నుంచి అంబటి రాయుడు, మహ్మద్‌‌‌‌ సిరాజ్‌‌‌‌ వరకూ పదుల సంఖ్యలో ప్రతిభావంతులైన ప్లేయర్లను దేశానికి అందించిన ఘన చరిత్ర ఉన్న హైదారాబాద్‌‌‌‌ క్రికెట్‌‌‌‌ ఇప్పుడు పతనావస్థలో ఉన్నది. రంజీ ట్రోఫీలో సీనియర్‌‌‌‌ క్రికెటర్ల పేలవ ఆటతో హైదరాబాద్‌‌‌‌ ఖ్యాతి మసకబారింది. మెగా టోర్నీలో రెండు సార్లు విజేతగా, రెండుసార్లు రన్నరప్‌‌‌‌గా నిలిచిన రికార్డు ఉన్న మన జట్టు ఈ సీజన్‌‌‌‌లో ఎనిమిది మ్యాచ్‌‌‌‌ల్లో ఆరింటిలో ఓడి.. ఓ విజయం, ఓ డ్రాతో ఎలైట్‌‌‌‌ ఎ,బి నుంచి గ్రూప్‌‌‌‌-–సికి పడిపోవడాన్ని సగటు అభిమాని జీర్ణించుకోలేకపోతున్నాడు. ఆటే మరిచిపోయినట్టు బ్యాట్స్‌‌‌‌మెన్‌‌‌‌, బౌలర్ల మూకుమ్మడి వైఫల్యం జట్టును దెబ్బతీసింది. గతంలో వీవీఎస్‌‌‌‌ లక్ష్మణ్‌‌‌‌ ఒక్కడే ఓ సీజన్‌‌‌‌లో(1999-–2000) తొమ్మిది సెంచరీలు చేస్తే.. ఈసారి జట్టు నుంచి రెండే సెంచరీలు వచ్చాయి. సుమంత్‌‌‌‌, కెప్టెన్‌‌‌‌ తన్మయ్‌‌‌‌ అగర్వాల్‌‌‌‌ చెరో వంద కొట్టారు. ఇక, ఈసారి జట్టులో ఒక్క బౌలర్‌‌‌‌ కూడా5 వికెట్ల (ఇన్నింగ్స్​లో) పెర్ఫామెన్స్‌‌‌‌ చేయలేదు. సీజన్‌‌‌‌ మొత్తంలో ఒకే ఒక్క సెంచరీ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌షిప్‌‌‌‌ మాత్రమే నమోదైంది. టీమ్‌‌‌‌లో టాప్‌‌‌‌ స్కోరర్‌‌‌‌ సుమంత్‌‌‌‌ (448 రన్స్‌‌‌‌) ఒక్కడే ఫర్వాలేదనిపించాడు. అయినా లీగ్‌‌‌‌ దశ ఓవరాల్‌‌‌‌ టాప్‌‌‌‌ స్కోరర్లలో లిస్ట్‌‌‌‌లో అతనిది 72వ ప్లేస్‌‌‌‌. మన జట్టు నుంచి మరే బ్యాట్స్‌‌‌‌మెన్‌‌‌‌ టాప్‌‌‌‌–100లో లేడు. పేసర్‌‌‌‌ రవికిరణ్‌‌‌‌ జట్టులో అందరికంటే కంటే ఎక్కువగా 26 వికెట్లు తీయగా, ఐదు మ్యాచ్‌‌‌‌లాడిన సిరాజ్‌‌‌‌ 19 వికెట్లు రాబట్టాడు. ఓవరాల్‌‌‌‌గా రవి 51వ ప్లేస్‌‌‌‌లో ఉంటే, సిరాజ్‌‌‌‌ది 88వ స్థానం అంటే ఆశ్చర్యం కలుగక మానదు. బ్యాటింగ్‌‌‌‌లో కెప్టెన్‌‌‌‌ తన్మయ్‌‌‌‌ అగర్వాల్‌‌‌‌ (374), అక్షత్‌‌‌‌ రెడ్డి (268), బి. సందీప్‌‌‌‌ (183), హిమాలయ్‌‌‌‌ అగర్వాల్‌‌‌‌ (174) , బౌలింగ్​లో రవికిరణ్‌‌‌‌, సిరాజ్‌‌‌‌ తప్ప మిగతా వాళ్లు చేతులెత్తేశారు. క్రికెటర్లలో సాధించాలన్న తపన, పట్టుదలతో పాటు క్రమశిక్షణ కూడా కొరవడింది. అందుకే 18 జట్లున్న గ్రూప్‌‌‌‌లో హైదరాబాద్‌‌‌‌ అట్టడుగున నిలిచిపోయింది. మన జట్టు ఇంతగా దిగజారిపోవడానికి కోచింగ్‌‌‌‌ సిబ్బంది కూడా బాధ్యులే. జట్టు అన్ని మ్యాచ్‌‌‌‌ల్లో ఓడుతున్నా అర్జున్‌‌‌‌ యాదవ్‌‌‌‌, శశాంక్‌‌‌‌ నాగ్‌‌‌‌, ఎన్‌‌‌‌.పి. సింగ్‌‌‌‌, ఎన్‌‌‌‌.ఎస్‌‌‌‌ గణేశ్‌‌‌‌ ఏం చేసినట్టు?. ఇక, సీనియర్‌‌‌‌ క్రికెటర్లు జట్టుకు ఎంతమాత్రం ఉపయోగపడకపోయినా సెలెక్టర్లు వారికే అవకాశం ఇచ్చారు. రాహుల్‌‌‌‌ బుద్ది, ప్రతీక్‌‌‌‌ రెడ్డి, అనికేత్‌‌‌‌ రెడ్డి వంటి యంగ్‌‌‌‌స్టర్లు తమకు లభించిన ఒకటి రెండు అవకాశాల్లోనే నిరూపించుకున్నారు. తమ అరంగేట్ర మ్యాచ్‌‌‌‌లో ప్రతీక్‌‌‌‌ 83 రన్స్‌‌‌‌ చేస్తే.. అనికేత్‌‌‌‌ నాలుగు వికెట్లు తీశాడు. మరి,ఇలాంటి వారిని కాదని జట్టుకు భారంగా మారిన వాళ్లనే పట్టుకొని వేలాడాల్సిన అవసరం ఏముందో సెలెక్టర్లు చెప్పాలి. అసలు కోచింగ్‌‌‌‌ స్టాఫ్‌‌‌‌, సెలెక్టర్లలో జవాబుదారీతనమే లేకపోవడం విచారకరం. హెచ్‌‌‌‌సీఏలో అంబుడ్స్‌‌‌‌మన్‌‌‌‌, ఎథిక్స్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌, క్రికెట్‌‌‌‌ అడ్వైజరీ కమిటీ లేకపోవడంతో ఆఫీస్‌‌‌‌ బేరర్లు ఆడిందే ఆటగా మారింది.

అజర్‌‌‌‌ ఏం చేస్తున్నట్టు..

రంజీ ట్రోఫీతో పాటు కల్నల్‌‌‌‌ సీకే నాయుడు (అండర్‌‌‌‌-23), కూచ్‌‌‌‌ బెహార్‌‌‌‌ (అండర్‌‌‌‌-19), మహిళల అండర్‌‌‌‌–23 వన్డే ట్రోఫీలోనూ హైదరాబాద్‌‌‌‌ జట్లు పేలవ ఆటతో లీగ్‌‌‌‌ దశలోనే ఇంటిదారి పట్టాయి. ఈ నాలుగు టోర్నీల్లో కలిపి హైదరాబాద్‌‌‌‌ జట్లు 32 మ్యాచ్‌‌‌‌లు ఆడితే కేవలం నాలుగింటిలో మాత్రమే విజయం సాధించి.. ఏకంగా 22 మ్యాచ్‌‌‌‌ల్లో ఓడిపోయాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మిథాలీ రాజ్‌‌‌‌ వంటి లెజెండరీ క్రికెటర్‌‌‌‌ను అందించిన మన మహిళా క్రికెట్‌‌‌‌ను పట్టించుకునే వారే కరువయ్యారు. మహిళల వన్డే ట్రోఫీలో 8 మ్యాచ్‌‌‌‌ల్లో హైదరాబాద్‌‌‌‌  ఏడింటిలో ఓడటం శోచనీయం. ఇక, గత రెండు సీజన్లలో కూచ్‌‌‌‌ బెహార్‌‌‌‌ ట్రోఫీలో సత్తా చాటిన ఠాకూర్‌‌‌‌ తిలక్‌‌‌‌ వర్మ అండర్‌‌‌‌–19 వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌లో పాల్గొన్నాడు. ఈ సారి ప్రతీక్‌‌‌‌ రెడ్డి 711 రన్స్‌‌‌‌తో ఆకట్టుకున్నా.. జట్టు మాత్రం ఒకే విజయంతో సరిపెట్టింది. ఈ లెక్కన మొత్తం హైదరాబాద్‌‌‌‌ క్రికెట్‌‌‌‌ వ్యవస్థే తిరోగమనంలో పడ్డట్టు అనిపిస్తోంది. ముంబై మాదిరిగా మన దగ్గర ఎంతో పటిష్టమైన క్లబ్‌‌‌‌ క్రికెట్‌‌‌‌, లీగ్‌‌‌‌ సిస్టమ్‌‌‌‌ ఉన్నప్పటికీ దాని నిర్వహణ పూర్తిగా అవినీతిమయంగా మారింది. ఎలక్షన్స్‌‌‌‌లో ఇచ్చిన హామీల్లో భాగంగా క్లబ్‌‌‌‌ సెక్రటరీలు, పైసలు ఇచ్చిన వాళ్ల పిల్లలతో లీగ్‌‌‌‌ సహా అన్ని జట్లను నింపేయడంతో హైదరాబాద్‌‌‌‌ ఆట దిగజారిందన్న విమర్శలు ఉన్నాయి. ఇంత జరుగుతున్నా హెచ్‌‌‌‌సీఏ అధ్యక్షుడు అజరుద్దీన్‌‌‌‌ చలించడం లేదు. వెస్టిండీస్‌‌‌‌ క్రికెట్‌‌‌‌ లెజెండ్‌‌‌‌ కర్ట్‌‌‌‌లీ అంబ్రోస్‌‌‌‌ను కన్సల్టెంట్‌‌‌‌గా నియమించుకుంటామని కొన్ని నెలల కిందట చెప్పిన అజర్‌‌‌‌ ఇప్పుడా విషయం మరిచిపోయాడు. సెలెక్షన్స్‌‌‌‌లో అవినీతితో పాటు కోచింగ్‌‌‌‌ స్టాఫ్‌‌‌‌ సామర్థ్యంపై ఎన్ని విమర్శలు వస్తున్నా పట్టించుకోవడం లేదు. కేరళతో రంజీ మ్యాచ్‌‌‌‌కు ముందు నెట్‌‌‌‌ ప్రాక్టీస్‌‌‌‌ సెషన్‌‌‌‌కు వచ్చిన అజర్‌‌‌‌ కొద్దిసేపు కోచ్‌‌‌‌ అవతారం ఎత్తి హడావిడి చేశాడు. కొంతమంది బ్యాట్స్‌‌‌‌మెన్‌‌‌‌ స్టాన్స్‌‌‌‌ను సరిచేశాడు. అలాగే, బౌలర్లు ఎక్కువగా నోబాల్స్‌‌‌‌ వేస్తుండడాన్ని గుర్తించి.. నెట్స్‌‌‌‌లో కూడా అంపైర్లను నిలబెట్టాడు. అంటే  ఇలాంటి బేసిక్‌‌‌‌ మిస్టేక్స్‌‌‌‌ను కూడా ప్రస్తుత కోచించ్‌‌‌‌ స్టాఫ్‌‌‌‌ సరిచేయడం లేదని అజర్‌‌‌‌ ఒప్పుకునట్టే కదా?.  మరి అలాంటి కోచింగ్‌‌‌‌ స్టాఫ్‌‌‌‌ను ఎందుకు కొనసాగిస్తున్నారో చెప్పాలని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. పొరుగు రాష్ట్రాలు ఆంధ్ర, కర్నాటక పక్కా ప్లానింగ్‌‌‌‌తో అన్ని కేటగిరీల్లోనూ మంచి ఫలితాలు సాధిస్తున్నాయి. వాటిని చూసైనా మనోళ్లు బుద్ధి తెచ్చుకోవాలని ఫ్యాన్స్​ ఆశిస్తున్నారు.

Latest Updates