ఫ్రూట్‌‌ మార్కెట్‌‌లో బీజేపీ నేతపై సీఐ దాడి

హైదరాబాద్, వెలుగు: మామిడి రైతులకు మద్దతుగా నిలిచిన బీజేపీ నాగర్‌‌కర్నూలు జిల్లా అధ్యక్షుడు సుధాకర్‌‌‌‌రావు పట్ల చైతన్యపురి ఇన్‌‌స్పెక్టర్ జానకిరెడ్డి దురుసుగా ప్రవర్తించడం వివాదాస్పదంగా మారింది. గడ్డిఅన్నారం ఫ్రూట్ మార్కెట్ వద్ద సుధాకర్‌‌‌‌రావుపై జరిగిన దాడి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌‌గా మారింది. సీఐ వ్యవహారశైలి రాజకీయ దుమారం లేపుతోంది. దీంతో ఫ్రూట్ మార్కెట్ వద్ద జరిగిన ఘటనపై రాచకొండ సీపీ మహేశ్ భగవత్ సమగ్ర విచారణకు ఆదేశించారు.

మంగళవారం రాత్రి నాగర్‌‌‌‌కర్నూల్, కొల్లాపూర్ ప్రాంతాల మామిడి రైతులు పండ్ల లోడ్లతో గడ్డి అన్నారం ఫ్రూట్‌‌ మార్కెట్‌‌కు వచ్చారు. బుధవారం నుంచి మార్కెట్ క్లోజ్ అనే సమాచారం తెలియడంతో మార్కెట్ కమిటీని ఆశ్రయించారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం డైరెక్ట్‌‌గా ఏజెంట్లకు పండ్లను అమ్మి వెళ్దామని రైతులు అక్కడే ఉన్నారు. మార్కెట్‌‌ మూసేశారని తెలియడంతో చైతన్యపురి పోలీసులు పరిసర ప్రాంతాల్లో పార్క్ చేసిన మామిడిలోడ్‌‌తో ఉన్న లారీలు, మహీంద్రా ట్రాలీలను అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. మార్కెట్ మూసేస్తున్న విషయం తమకు తెలియదని రైతులు చెప్పినా పోలీసులు పట్టించుకోలేదు. లారీలను తీసుకొని వెళ్లాలని ఒత్తిడి చేశారు. ఈ క్రమంలో రైతులు నాగర్‌‌కర్నూల్‌‌ బీజేపీ అధ్యక్షుడు సుధాకర్‌‌‌‌రావుకి కాల్ చేశారు. రాత్రి 10.30 గంటలకు సుధాకర్‌‌‌‌రావు మార్కెట్‌‌ వద్దకు వచ్చారు.

అప్పటికే చైతన్యపురి ఇన్‌‌స్పెక్టర్ జానకిరెడ్డి, పోలీసులు రైతులు, మామిడిపండ్ల వెహికల్స్‌‌ను మార్కెట్‌‌ వద్ద నుంచి తరలించే ఏర్పాట్లు చేశారు. అక్కడికి వచ్చిన సుధాకర్‌‌‌‌రావు మార్కెట్ మూసివేసిన సంగతి రైతులకు తెలియదని పోలీసులకు చెప్పారు. ఇన్‌‌స్పెక్టర్ జానకిరెడ్డి అతన్ని అడ్డుకొని అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. కమిటీ చైర్మన్‌‌తో మాట్లాడి బుధవారం ఉదయం పండ్లను అన్‌‌లోడ్ చేసి వెళ్తామన్నారు. సుధాకర్‌‌రావును తీవ్రమైన బూతులు తిడుతూ.. అక్కడి నుంచి నెట్టేశాడు ఇన్‌‌స్పెక్టర్‌‌. తను బీజేపీ నాగర్‌‌‌‌కర్నూల్ జిల్లా అధ్యక్షుడినని చెప్పినా వినిపించుకోకుండా దాడికి పాల్పడ్డారు. ఇదంతా అక్కడే ఉన్న పండ్లవ్యాపారులు తమ మొబైల్ ఫోన్స్‌‌లో రికార్డ్ చేశారు. బీజేపీ నేతపై ఇన్‌‌స్పెక్టర్ దాడి చేసిన వీడియోలు బుధవారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై రాచకొండ సీపీ మహేశ్ భగవత్ విచారణకు ఆదేశించారు.

రాష్ట్రానికి చేరిన వలస కూలీలు.. సొంతూళ్లకు కరోనా ముప్పు!

Latest Updates