సిటీలు,టౌన్ల అభివృద్ధికి రూ.65,845 కోట్లు కావాలి

  • వచ్చే ఐదేళ్లకు అవసరమయ్యే నిధులపై ఆస్కి అంచనా
  • జీహెచ్​ఎంసీ, 73 పాత మున్సిపాలిటీలపై నివేదిక
  • 68 కొత్త మున్సిపాలిటీలను కలిపితే రూ.లక్ష కోట్లు దాటే అవకాశం
  • నల్లా నీటి సరఫరా అస్సలు బాలేదని రిపోర్ట్​లో వెల్లడి

హైదరాబాద్, వెలుగురాష్ట్రంలోని సిటీలు, టౌన్లకు వచ్చే ఐదేళ్లలో రూ.65,845 కోట్ల నిధులు అవసరమవుతాయని అడ్మినిస్ట్రేటివ్​ స్టాఫ్​ కాలేజీ ఆఫ్​ ఇండియా (ఆస్కి) అంచనా వేసింది.  గ్రేటర్​ హైదరాబాద్​ సహా 73 మున్సిపాలిటీల్లోని జనాలకు మంచి వసతులు కల్పించాలంటే అంత మొత్తంలో బడ్జెట్​ కావాల్సిందేనని చెప్పింది. మెరుగైన సేవలు అందించేందుకు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఆర్థిక వనరులు పెంచుకోవాలని సూచించింది. నిజానికి ఆరు నెలల క్రితమే రాష్ట్ర ప్రభుత్వానికి ఆస్కి మున్సిపాలిటీలకు అవసరమయ్యే నిధులపై సిఫార్సులు చేసింది. అయితే, ఐదేళ్లుగా పట్టణాభివృద్ధి శాఖకు సర్కారు చాలీచాలని నిధులనే కేటాయిస్తోంది. ఈ ఏడాది బడ్జెట్​లో కేవలం రూ.3,284 కోట్లే కేటాయించింది. దీంతో, పన్నులు, ఇతర ఆదాయ వనరులపైనే మున్సిపాలిటీ పాలకవర్గాలు ఆధారపడాల్సిన పరిస్థితులున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.

రోడ్లకే రూ.39 వేల కోట్లు కావాలె

రాష్ట్ర ఫైనాన్స్​ కమిషన్​ సూచనల మేరకు గ్రేటర్​ హైదరాబాద్​ కార్పొరేషన్​ సహా 73 పాత మున్సిపాలిటీల అవసరాలపై ఆస్కి టీమ్​ స్టడీ చేసింది. ఆ నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. వాటిలో ఆరు మున్సిపల్​ కార్పొరేషన్లు, 44 మున్సిపాలిటీలు, 23 థర్డ్​ గ్రేడ్​ మున్సిపాలిటీలున్నాయి. కొత్తగా ఏర్పాటైన 68 మున్సిపాలిటీలను ఈ స్టడీలో చేర్చలేదు. స్టడీ చేసిన మున్సిపాలిటీల్లో తాగునీటి సరఫరా, డ్రైనేజీ, వ్యర్థాల శుద్ధి, వర్షపు నీటి డ్రైన్ల నిర్వహణకు వచ్చే ఐదేళ్లలో రూ.65,845 కోట్లు (2018–19 ధరల ప్రకారం) కావాలని ఆస్కి టీం అంచనా వేసింది. ప్రస్తుతం మున్సిపాలిటీలకు పన్నులు, పన్నేతర ఆదాయం 62 శాతం కాగా, రాష్ట్ర గ్రాంట్ల ద్వారా 20 శాతం, అసైన్డ్​ రెవెన్యూ ద్వారా 11 శాతం, కేంద్రం ద్వారా 7 శాతం నిధులు సమకూరుతున్నాయని, పన్నుల్లో 94 శాతం ఆదాయం ఆస్తిపన్ను రూపంలోనే వస్తోందని చెప్పింది. ఆయా ఆదాయాల ద్వారా మున్సిపాలిటీలకు రూ.25,125 కోట్లు వచ్చే అవకాశముందని, మరో రూ.40,720 కోట్లను సమకూర్చుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. ఇందులో రోడ్ల నిర్వహణ, నిర్మాణానికే రూ.39 వేల కోట్లకుపైగా ఖర్చవుతుందని అంచనా వేసింది. ఆ తర్వాత తాగునీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ, వీధి లైట్ల ఏర్పాటుకు ఎక్కువగా ఖర్చు చేయాల్సి ఉంటుందని చెప్పింది. అయితే, పాత మున్సిపాలిటీలకు తోడు కొత్తగా ఏర్పాటైన 68 మున్సిపాలిటీలనూ కలిపితే రూ.లక్ష కోట్లకుపైనే కావాల్సి ఉంటుందని తెలుస్తోంది.

నల్లా నీటి సరఫరా అస్సలు బాలె

మున్సిపాలిటీలు అందిస్తున్న 8 సర్వీసుల్లో ముఖ్యమైన తాగునీటి సరఫరా చాలా అధ్వాన్నంగా ఉందని ఆస్కి తన స్టడీలో తేల్చింది. రోజూ 2.8 శాతం మాత్రమే తాగునీటి సరఫరా జరుగుతోందని, సగటున 42 నిమిషాలు నీళ్లు సప్లై అవుతున్నాయని పేర్కొంది. ఇక, ఆరు మున్సిపాలిటీల్లో మాత్రమే డ్రైనేజీ వ్యవస్థ పూర్తి స్థాయిలో ఉందని, మిగతా అన్ని మున్సిపాలిటీల్లోనూ మామూలుగానే ఉందని నివేదికలో పేర్కొంది. కార్పొరేషన్లలో జీహెచ్​ఎంసీలో ఎక్కువగా 87 శాతం వరకు మురుగు నీటి వ్యవస్థ ఉండగా, కరీంనగర్​లో అతి తక్కువగా 3 శాతం మాత్రమే ఉందని పేర్కొంది. మున్సిపాలిటీల్లో మీర్​పేట పరిధిలో ఎక్కువగా 96 శాతం ఉన్నట్టు తెలిపింది. 2011లో మునిసిపాలిటీల్లో మురుగునీటి కాల్వల పరిధి 25 శాతం ఉండగా 2017 నాటికి 57 శాతానికి పెరిగినట్టు తేల్చింది. వర్షం నీళ్లు సాఫీగా వెళ్లే కాల్వల వ్యవస్థ పట్టణాల్లో కేవలం 38 శాతమే ఉన్నట్టు తేల్చింది. చెత్త విషయానికి వస్తే 90 శాతం ఇళ్ల నుంచి 89 శాతం చెత్తను మున్సిపాలిటీలు సేకరిస్తున్నాయని ఆస్కి చెప్పింది. అయితే, తడి, పొడి చెత్తను వేర్వేరు చేయడం కేవలం10 శాతమే జరుగుతున్నట్టు నివేదికలో పేర్కొంది. హైదరాబాద్​ మినహా మిగతా మున్సిపాలిటీల్లో చెత్తను సిబ్బంది ఇష్టమొచ్చినట్టు పారబోస్తున్నారని, సాలిడ్​ వేస్ట్​ మేనేజ్​మెంట్​, సీవరేజ్​ ట్రీట్​మెంట్​ ప్లాంట్లు లేనేలేవని రిపోర్ట్​లో వెల్లడించింది.

see more news తెలుగు ఓటర్లు మెచ్చితేనే సుల్తాన్​పురి బాద్​షా

మున్సిపాలిటీలకు బడ్జెట్

ఏడాది                   బడ్జెట్​
(రూ.కోట్లలో)

2015–16                  4,024

2016–17                  4,815

2017–18                  5,599

2018–19                  7,251

2019–20                  3,284

Latest Updates