హైదరాబాదులో మితిమీరుతున్న ఆటోవాలాల ఆగడాలు

Citizens facing troubles with Auto Drivers in Borabanda

బోరబండ, వెలుగు:సిటీలో శరవేగంగా విస్తరిస్తోన్న ప్రాంతమైన బోరబండలో ఆటోవాలాల హల్ చల్ ప్రతిరోజూ కొనసాగుతోంది. ఉదయం నుంచి అర్ధరాత్రివరకు బోరబండ బస్టాం డ్ వద్ద ఆటోవాలాలు తిష్ట వేస్తా రు. ఎర్రగడ్డ, హైటెక్ సిటీ, మాదాపూర్,యూసుఫ్ గూడ, అల్లాపూర్ తదితర ప్రాంతాలకు ఆటోలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఆటో డ్రైవర్లు ఆర్టీసీ బస్సుల ముందు నిలిపి కేకలు వేస్తూ ప్రయాణికులను ఎక్కించుకుంటారు. ఆటోనిండే వరకూ బయల్దేరకుండా అక్కడే ఉండి ,కిక్కిరిసే వరకు వేచి చూస్తారు. ఆర్టీసీ బస్సుల్లో ఎక్కే వారిని ఆకర్షించేందుకు బిగ్గరగా అరుస్తూ ఆటోలను ముందుకు, వెనక్కి తిప్పుతుంటారు.వెనక భాగంలో నలుగురైదుగురిని  డ్రైవర్ కు ఇరువైపులా ఇద్దరు చొప్పున ప్రయాణికులను ఎక్కించుకున్నాకే బయల్దేరతారు. వీరి ఆగడాలను రోజురోజుకూ భరించలేకపోతున్నామని స్థానికులు, ప్రయాణికులు వాపోతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆటోలను ఆశ్రయించాల్సి వస్తుందంటున్నారు. పది, పదిహేను ఆటోలను ఒకేచోట నిలిపి ఆర్టీసీ బస్సులు, సెట్విన్లు ముందుకు కదలకుండా ఇబ్బందులు సృష్టిస్తుంటారు. ప్రయాణికులు బస్సుల్లో వెళ్లేం దుకు ప్రయత్నిస్తే ఆటోలను అడ్డం గా నిలుపుతూ ఇబ్బందులకు గురి చేస్తుంటారు. ఏళ్ల తరబడిగా ఇదే తంతు కొనసాగుతోంది. వీరి ఆగడాలను ఎవరూ భరించలేకపోతున్నారు. ఎర్రగడ్డ బస్టాండ్ వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. ఆటో డ్రైవర్లుగా ఎక్కు వగా యువకులే ఉంటారు. కాబట్టి  ఆటోలను కూడా వేగంగా ర్యాష్ గా నడిపిస్తూ ప్రయాణికులను భయభ్రాంలకు గురి చేస్తుంటారు. ఎక్కడ పడితే అక్కడ సడన్ బ్రేక్ లు వేయడమే కాకుండా, సౌండ్ సిస్టం లో హోరెత్తే పాటలను పెడుతూ ప్రయాణికుల సహనానికి పరీక్ష పెడుతుంటారు. ఈప్రాంతంలో వందలాది మంది ఆటో డ్రైవర్లుగా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. ఆర్టీసీ ప్రతినిధులు, హోం గార్డులు ఇక్కడ ఉన్నా ఆటో డ్రైవర్ల విషయంలో ఏమీ చేయలేకపోతున్నారు. వారితో ఎందుకు గొడవ అని మిన్నకుండి పోతున్నారు.ఇష్టారీతిగా వ్యవహరిస్తోన్న ఆటో డ్రైవర్లకు కళ్లెంవేయాల్సి న అవసరముందని  స్థానికులు, ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు.

తీవ్ర ఇబ్బందులు

ఆర్టీసీ బస్సుల్లో ఎక్కేందుకు వెళ్లే వారిని ఆటోల్లో ఎక్కమని పిలుస్తుంటారు. బస్సు డోర్ల దగ్గరే ఆటోలను నిలిపి కేకలు వేస్తుంటారు. వద్దని చెప్పినా పట్టిం చుకోరు. వీరి వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా రు. – చంద్రయ్య, బోరబండ

Latest Updates