జూన్ 8 నుంచి హైదరాబాద్‌లో సిటీ బస్సు సర్వీసులు

దాదాపు రెండున్నర నెలలుగా డిపోలకే పరిమితమైన హైదరాబాద్ సిటీ బస్సులు రోడ్డెక్కనున్నాయి. లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా సిటీ, అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు కేంద్రం అనుమతినిచ్చిన క్రమంలో సిటీ బస్సులను ఈ నెల 8నుంచి నడపాలని టీఎస్ ఆర్టీసీ యోచిస్తోంది.

రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  ఇవాళ(బుధవారం,జూన్-3) ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ సడలింపుల్లో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు తెరుచుకున్నాయి. పారిశ్రామిక కార్యకలాపాలు మొదలయ్యాయి. అయితే, ప్రజా రవాణా సంస్థ అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  నగరంలో రోజుకు దాదాపు 33 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తారు.

అన్ని కార్యకలాపాలు ప్రారంభం కావటంతో.. బస్సుల్లో ప్రయాణించాల్సిన వారు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాల్సి వస్తోంది. ఇక షేర్‌ ఆటోల్లో ప్రయాణం ప్రస్తుత పరిస్థితిలో అనుకూలం కాదన్న భయంతో అటువైపు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఎక్కువ మంది సొంత వాహనాలను రోడ్డెక్కించారు.దీంతో రోడ్లపై ట్రాఫిక్‌ విపరీతంగా పెరిగిపోయింది.
వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ఈ నెల 8 నుంచి సిటీ బస్సులు నడిపేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

Latest Updates