కామెంట్లతో రాహుల్ ఫాలోవర్స్‌‌ను బాధపెట్టారు.. ఒబామా పుస్తకంపై కోర్టులో దావా

లక్నో: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా రాసిన ‘ది ప్రామిస్డ్ ల్యాండ్’ పుస్తకంపై దావా నమోదైంది. సదరు పుస్తకంలో కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీతోపాటు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురించి ఒబామా పలు వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్లపై పలువురు కాంగ్రెస్ సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఉత్తర్ ప్రదేశ్‌‌లోని ప్రతాప్‌‌గఢ్‌‌లో దావా నమోదైంది. రాహుల్, మన్మోహన్‌‌తోపాటు వారిని అనుసరించే వారిని సదరు పుస్తకం అవమానానికి గురి చేసిందంటూ లాల్‌‌గంజ్‌‌లోని సివిల్ కోర్టులో దావా వేసిన జ్ఞాన్ ప్రకాశ్ శుక్లా చెప్పారు.

ప్రకాశ్ శుక్లా ఆలిండియా రూరల్ బార్ అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్ కావడం గమనార్హం. డిసెంబర్ 1న ఈ కేసుకు సంబంధించిన వాదనలు కోర్టు విననుంది. ఒబామా వ్యాఖ్యలు లక్షలాదిగా ఉన్న రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్ ఫాలోవర్లను తీవ్ర బాధకు గురి చేశాయని.. ఈ బుక్‌ను నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు నిరసనలకు దిగాలని ప్రకాశ్ శుక్లా పిలుపునిచ్చారు. ‘రాహుల్ గాంధీ కొంచెం నిరుత్సాహంగా కనిపిస్తారు. తన నైపుణ్యంపై ఆయన కొంత నెర్వస్‌గా ఉంటారు. పని పూర్తి చేసి టీచర్ మెప్పు పొందాలని ఒక విద్యార్థి ఎలా ఆరాటపడతారో రాహుల్ అలా కనిపిస్తారు. అయితే ప్రావీణ్యం సంపాదించాలనే తపన మాత్రం రాహుల్‌‌లో లేదు. ఆయనలో స్పష్టత, ధైర్యం కొరవడ్డాయి’ అని ది ప్రామిస్డ్ ల్యాండ్ అనే పుస్తకంలో ఒబామా రాసుకొచ్చారు.

Latest Updates