భాష మారాలె,తీరు మారాలె.. మొత్తంగా కోర్టులే మారాలె

భాష మారాలె,తీరు మారాలె.. మొత్తంగా కోర్టులే మారాలె

న్యూఢిల్లీ:మన న్యాయవ్యవస్థ సామాన్యుడికి లేనిపోని సమస్యలు సృష్టించేదిగా మారుతోందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. న్యాయవ్యవస్థను దేశ ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా మార్చుకోవాల్సిన అవసరం చాలా ఉందని అభిప్రాయపడ్డారు. భారత న్యాయవ్యవస్థ తీరుతెన్నులు, ప్రస్తుత పరిస్థితులపై ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘మన న్యాయవ్యవస్థ చాలాసార్లు సామాన్యుడికి సమస్యలు సృష్టించేదిగా ఉంటోంది. న్యాయప్రక్రియలోని రూల్స్‌‌ అడ్డంకులుగా మారి చివరికి అతనికి న్యాయం అందకుండా చేస్తున్నాయి” అని ఆవేదన వెలిబుచ్చారు. మన కోర్టుల పనితీరు, వాటి తీరుతెన్నులు దేశ అవసరాలకు తగ్గట్టుగా, ఈనాటి సొసైటి ఎదుర్కుంటున్న సవాళ్లకు సరిపోయేవిగా లేవని కుండబద్దలు కొట్టారు. దేశంలో ప్రస్తుతమున్న అన్ని వ్యవస్థలు, ఇప్పటి దేశ పరిస్థితులకు తగ్గట్టుగా లేవు. ఈ రూల్సూ అవీ ఎప్పటివో! ఇంగ్లీష్‌‌ దొరల పాలన నాటివి. అందుకే మన ప్రస్తుత అవసరాలకు అవి సరిపోవన్నారు. న్యాయవ్యవస్థపై పూర్తిగా భారత దేశముద్రపడాలని, ఇది చాలా త్వరగా జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. ‘మన ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా మన న్యాయవ్యవస్థను, సామాన్యుడికి న్యాయమందించే ప్రక్రియను మార్చుకోవాల్సి ఉంది. సూటిగా చెప్పాలంటే, న్యాయమందించే ప్రక్రియను వీలైనంత సింపుల్‌‌గా మార్చడం వెంటనే జరగాలె. అప్పుడే అది మరింత తేటతెల్లంగా, పవర్‌‌ఫుల్‌‌గా రూపొందుతుంది. కోర్టు మెట్లెక్కేవాళ్లకు మరింతగా అందుబాటులోకి వస్తుంది’’ అని సీజేఐ అన్నారు. న్యాయప్రక్రియలో చివరకు లాభపడేది క్లయింట్లే కనుక కోర్టులు మరింతగా ‘లిటిగెంట్ సెంట్రిక్’గా మారాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. శనివారం బెంగళూరులో జరిగిన దివంగత సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ మోహన్ ఎం శంతనగౌడర్ నివాళి కార్యక్రమంలో జస్టిస్ రమణ మాట్లాడారు. మధ్యవర్తిత్వం వంటి వేరే పద్ధతుల వాడకం వీలైనంతగా పెరగాలన్నారు. ‘‘దీని వల్ల రెండు పక్షాల మధ్య ఘర్షణను వీలైనంత తగ్గించినవాళ్లం అవుతాం. అంతేగాక రోజులకొద్దీ వాదనలు, తీర్పులకు పట్టే సమయం, దాంతోపాటు విలువైన వనరులు ఆదా అవుతాయి. న్యాయవ్యవస్థపై పెండింగ్ కేసుల భారమూ తగ్గుతుంది” అన్నారు.

  • ఇద్దరు పల్లెటూరోళ్లు గనక ఇంటి గొడవలతో ఒకవేళ కోర్టుకెక్కితే అక్కడ అడుగడుగునా వాళ్లకు ఏమాత్రం మింగుడుపడని వాతావరణమే స్వాగతం పలుకుతుంది. వాదనలన్నీ వాళ్లకు అసలే రాని ఇంగ్లిష్ లో జరుగుతాయి. దాంతో ఒక్క ముక్కా అర్థం కాక, తామేదో పరాయి ప్రాంతానికి వచ్చిన భావనకు లోనవుతారు’’
  • న్యాయం కోసం కోర్టు మెట్లెక్కాలనుకునే సామాన్యుడు కోర్టును చూసో, జడ్జిలను చూసో భయపడే వాతావరణం ఉండకూడదు. నిజాన్ని ఉన్నది ఉన్నట్టుగా, స్వేచ్ఛగా చెప్పగలగాలి. అలా జరగాలంటే కోర్టులో అతను పూర్తిగా కంఫర్టబుల్ గా ఫీల్ అవగలగాలి. అలాంటి వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత పూర్తిగా జడ్జిలది, లాయర్లదే’’
  • సుదీర్ఘమైన తీర్పులు కూడా కక్షిదారులకు మరో సమస్యగా మారుతున్నాయి. అందులో ఏం చెప్పారో అర్థం చేసుకోవడానికి వాళ్లు జేబుకు మరింత చిల్లి పెట్టుకోవాల్సి వస్తోంది’’
  • ఏ న్యాయవ్యవస్థకైనా కేంద్రబిందువు ఎవరంటే, న్యాయం కోరి వచ్చే కక్షిదారే. ఈ వాస్తవాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకూడదు’’