సుప్రీం చీఫ్ జస్టిస్ తో ఎవరైనా సెల్ఫీ దిగేలానా సెక్యూరిటీ?

ఢిల్లీ పోలీసులు కల్పిస్తున్న భద్రతపై సెక్యూరిటీ ఏజెన్సీల వ్యాఖ్య!

ఎవరైనా ఆయన్ని చేరుకోవచ్చు.. పూర్తి డొల్లగా మారిందని అభిప్రాయం

న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ సెక్యూరిటీపై భద్రతా సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల ఆయన చుట్టూ జనాలు చేరడం, సెల్ఫీలు తీసుకోవడం లాంటి ఘటనలు జరగడంతో దీనిపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించింది కేంద్ర హోం శాఖ. ఢిల్లీలో కేంద్ర హోం శాఖ, విదేశాంగ మంత్రిత్వ శాఖ, ఇంటెలిజెన్స్ బ్యూరో, ఇతర సెక్యూరిటీ ఏజెన్సీలు సమావేశం నిర్వహించాయి. ఈ భేటీలో చర్చించిన అంశాలకు సంబంధించిన ఓ లేఖను ఏఎన్ఐ న్యూస్ ఏజెన్సీ బయటపెట్టింది.

ఆ లేఖ ప్రకారం..  ‘సీజేఐకు ఢిల్లీ పోలీసులు కల్పిస్తున్న భద్రత పూర్తి డొల్లగా మారింది. ఎవరైనా సులభంగా ఆయన్ని చేరుకునేంతగా బలహీనంగా సెక్యూరిటీ కల్పిస్తున్నారు. ఎవరైనా సరే వచ్చేసి ఆయనకు పూలదండలు వేయడం, సెల్ఫీలు తీసుకోవడం వంటివి చేసే స్థాయిలో సీజేఐ భద్రత ఉంది.  ఈ పరిస్థితి తక్షణం మారాలి’ అని సెక్యూరిటీ వింగ్ ఢిల్లీ పోలీస్ జాయింట్ సీపీ శుక్లా అభిప్రాయపడ్డారని ఏఎన్ఐ పేర్కొంది.

ఈ ఉన్నత స్థాయి సమావేశం ముగిశాక సీజేఐకి భద్రత కల్పించే విభాగాలకు కొన్ని సూచనలు జారీ చేసింది కేంద్ర హోం శాఖ. సీజే కాన్వాయ్ పార్కింగ్ కు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, ఆయనకు క్లోజ్ రింగ్ టీమ్ భద్రత కల్పించాలని ఆదేశాలిచ్చింది.

Latest Updates