8వ తరగతి విద్యార్థిపై యాసిడ్ దాడి

ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బాలుడిపై తోటి స్టూడెంట్ యాసిడ్ దాడి చేశారు. ఈ ఘటనలో ఆ చిన్నారి ముఖం, శరీర భాగాలపై తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడికి రూ.1000 ఇచ్చి రాజీ కుదిర్చేందుకు టీచర్లు, అధికారుల ప్రయత్నించడంతో ఆ గ్రామస్థులు నిరసనకు దిగారు. హర్యానాలోని గురుగ్రామ్ సమీపంలో ధన్‌కోట్ గ్రామంలో ఈ ఘోరం జరిగింది.

టీచర్ల ఆదేశాలతో ఆ స్కూల్‌లోని టాయిలెట్లను పిల్లలే క్లీన్ చేస్తుంటారు. ఇలా శుక్రవారం నాడు 8వ తరగతి పిల్లలు ఆ పనిలో ఉండగా.. తోటి విద్యార్థి ఒకడు మరో పిల్లాడిపై యాసిడ్ పోశాడు. తాను టాయిలెట్ క్లీన్ చేస్తుండగా.. కిటికీ శుభ్రం చేస్తున్న క్లాస్‌మేట్ తనను పిలిచి పైన యాసిడ్ పోశాడని బాధిత విద్యార్థి చెప్పాడు. అయితే ఈ ఘటనలో గాయపడిన తమ బిడ్డ వైద్యం ఖర్చులకు, ఫ్రూట్స్‌కు అని చెప్పి రూ.1000 చేతిలో పెట్టి రాజీ కుదిర్చేందుకు టీచర్లు, స్కూల్ అధికారులు ప్రయత్నం చేస్తున్నారని బాధితుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన ఏ దురుద్దేశంతోనో జరిగింది కాదని తమ ఎంక్వైరీలో తేలిందని, బాధిత విద్యార్థి కూడా సురక్షితంగానే ఉన్నాడని జిల్లా డిప్యూటీ కమిషనర్ అమిత్ ఖాత్రి తెలిపారు. అయితే అధికారులు ఈ విషయాన్ని తొక్కి పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, దీనిపై ఆ చిన్నారికి న్యాయం చేయాలంటూ గ్రామస్థులంతా స్కూల్ ఎదుట నిరసనకు దిగారు.