బెంగాల్ లో ప్రచారం క్లోజ్:అల్లర్లతో CEC కీలక నిర్ణయం

పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల హింస నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. లోక్ సభ ఎన్నికల్లో చివరిదైన ఏడో విడత ప్రచారాన్ని రాష్ట్రంలో ఇవాళే ముగించాలని పార్టీలను ఆదేశించింది. మొత్తంగా ప్రచారంలో 20గంటలు కట్ చేసింది. రేపు సాయంత్రం 5గంటల వరకు గడువు ఉన్నా… ఈ రాత్రి 10గంటల వరకే పరిమితం చేస్తూ నిర్ణయం తీసుకుంది కమిషన్.  రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం తన విశేషాధికారాలను ఉపయోగించింది ఎలక్షన్ కమిషన్. ఈ ఆర్టికల్ ను ఉపయోగించడం ఇదే మొదటిసారి.

బెంగాల్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్, ఇతర అధికారులతో ముగ్గురు సభ్యుల ఎన్నికల కమిషన్ బృందం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించింది. ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంది. ఈశ్వర చంద్ర విద్యాసాగర్ విగ్రహం కూల్చివేత బాధకరమన్న ఎలక్షన్ కమిషన్… బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర యంత్రాంగాన్ని ఆదేశించామని తెలిపింది. అలాగే బెంగాల్ CID-ADG రాజీవ్ కుమార్ ను బాధ్యతల నుంచి తప్పించింది. అతడిని కేంద్ర హోంశాఖకు అటాచ్ చేసింది. హోం, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని కూడా రిలీవ్ చేస్తూ ఆదేశాలిచ్చింది.

ఎలక్షన్ కమిషన్ నిర్ణయంపై మండిపడ్డారు మమతా బెనర్జీ. ఈసీ ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధం, అప్రజాస్వామికం అని ఆరోపించారు. పక్షపాత ధోరణితోనే ఈ నిర్ణయం తీసుకున్నారని… బీజేపీకి కమిషన్ గిఫ్ట్ ఇచ్చిందన్నారు మమత.

ఎలక్షన్ కమిషన్ నిర్ణయాన్ని కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ స్వాగతించారు. స్వేచ్ఛగా ప్రచారం చేయలేని పరిస్థితుల్లో ప్రచార గడువు కుదించడమే మంచిదన్నారు. 19న బెంగాల్ లోని 9 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. డమ్ డమ్, బరాసత్, బసిర్హత్ , జయనగర్, మథురాపూర్, జాదవ్పూర్, డైమండ్ హార్బర్, సౌత్ కోల్కతా, నార్త్ కోల్ కతా లోక్సభ నియోజకవర్గాల్లో 19న పోలింగ్ జరగనుండగా… ఈ రాత్రి 10 గంటలకు ప్రచారం ముగియనుంది. ఇవాళ మోడీ బెంగాల్ లో రెండు సభల్లో పాల్గొంటారు.