ఒక్క మర్డర్ దాచడం కోసం 9 హత్యలు చేశాడు

వీడిన వరంగల్ హత్యల కేసుల మిస్టరీ

వరంగల్ జిల్లా : ఒక హత్యను కప్పిపుచ్చుకునేందుకు 9హత్యలు చేశాడు బీహార్ కు చెందిన సంజయ్. వరంగల్ లో జరిగిన 9హత్యల మిస్టరీని చేధించారు పోలీసులు. ప్రధాన నిందితుడు సంజయ్ కుమార్ ను వరంగల్ సీపీ రవీందర్ మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. “బెంగాల్ నుంచి వలసవచ్చిన మక్కూద్ ఫ్యామిలీ స్థానిక శాంతినగర్ లోని గోనె సంచిల ఫ్యాక్టరీలో పనిచేసేవాళ్లు. ఇక్కడే వాళ్లకు సంజయ్ పరిచయం అయ్యాడు. ఇదే టైంలో మక్సూద్ భార్య అక్క కూతరు..రఫికా తన ముగ్గరు సంతానంతో మక్సూద్ దగ్గరకు వచ్చింది. తను కూడా గోనె సంచిల ఫ్యాక్టరీలోనే పనిచేసేది. రోజూ సంజయ్ కు అన్నం వండిపెట్టేది రఫికా. అలా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి.. అది సహజీవనం వరకు వెళ్లింది. అయితే రఫిక కూతరుపై సంజయ్ కన్నేయడంతో.. రఫికా సంజయ్ ను నిలదీసింది.

దీంతో పెళ్లిచేసుకుంటానంటూ రఫికకు నచ్చజెప్పి.. కుటుంబ సభ్యులతో మాట్లాడదామని చెప్పి బెంగాల్ వెళ్దామంటూ మార్చి 7న  ట్రైన్ లో రఫికను తీసుకెళ్లాడు సంజయ్. మార్చి-8న ఉదయం  ట్రైన్ లోనే మజ్జిగలో నిద్రమాత్రలు కలిపి రఫికను చున్నీతో బిగించి చంపేశాడు. తర్వాత ప.గో నిడదవోలు దగ్గర.. ట్రైన్ నుంచి నెట్టేసి వరంగల్ చేరుకున్నాడు సంజయ్. కొద్దిరోజుల తర్వాత రఫిక విషయమై సంజయ్ ను నిలదీయడం మొదలుపెట్టారు మక్సూద్ కుటుంబసభ్యులు. దీంతో రఫికా మర్డర్ విషయం ఎక్కడ బయటపడుతోందనని.. మక్సుద్ ఫ్యామిలీని కూడా చంపాలని నిర్ణయించుకున్నాడు సంజయ్.

మక్సుద్ ఫ్యామిలీ మొత్తం ఆరుగురు సభ్యులు. మక్సుద్ అతని భార్య, ఇద్దరు కుమారులు, కూతురు, మనవడు ఉన్నారు. అలాగే మక్సుద్ ఉంటున్న పై రూంలో శ్రీరాం,శ్యాంఅనే ఇద్దరు బిహారీలు కూడా ఉంటున్నారు. మక్సుద్ ఫ్యామిలీని చంపాలనుకున్న సంజయ్ హన్మకొండ చౌరస్తాలోని ఓ మెడికల్ షాపు నుంచి స్లీపింగ్ పిల్స్ కొన్నాడు. ఈనెల 16 నుంచి 20వరకు మక్సుద్ ఉండే ప్రాంతం చుట్టుపక్కల రెక్కీ చేశాడు. మక్సుద్ కొడుకు బర్త్ డే రోజున అందరినీ చంపాలని డిసైడ్ అయ్యాడు. అదే రోజు స్లీపింగ్ పిల్స్ ను మక్సుద్ వాళ్లు చేసుకున్న వంటలో కలిపాడు. అలాగే పై రూంలో ఉంటున్న బిహారీల వంటలో కూడా మత్తు మాత్రలు కలిపాడు. అందరూ స్పృహ తప్పి పడిపోయాక.. ఒక్కోక్కరిని తీసుకెళ్లి బావిలో పడేశాడు. ఆ తర్వాత ఏమీ తెలీనట్టే తన ఇంటికి చేరుకున్నాడు.

కేసును చేధించేందుకు సీసీ టీవీ ఫుటేజీ బాగా ఉపయోగపడింది. ఆ ఫుటేజీ ద్వారానే సంజయ్ కదలికలను గుర్తించారు పోలీసులు. తర్వాత సంజయ్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తే.. విషయం మొత్తం బయటపడింది” అని తెలిపారు సీపీ రవీందర్.

Latest Updates