దిశఫోన్ లో ఏముంది..? భూమిలో పాతిపెట్టిన ఫోన్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు

సంచలనం రేపిన దిశ రేప్ అండ్ మర్డర్ కేసులో నిందితుల తొలిరోజు కస్టడీ ముగింపునకు చేరుకుంది. భద్రతా కారణాలతో.. దర్యాప్తులో జరుగుతున్న తీరును పోలీసులు బయటకు చెప్పడం లేదు. చర్లపల్లి జైలులోనే నిందితుల కస్టడీ ఇంటరాగేషన్ కొనసాగుతోంది. ఈ ఉదయం నిందితులను పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఇంటరాగేషన్ ఇవాళ ఇంకా కొనసాగుతూనే ఉంది.

బాధితురాలు దిశ సెల్ ఫోన్ లో ఉన్న డేటాపై పోలీసులు దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఫోన్ ను భూమిలో పాతిపెట్టినట్టుగా నిందితులు చెప్పినట్టు సమాచారం. ఆ ఫోన్ ను రికవరీ చేసే పనిలో పోలీసులు ఉన్నట్టు సమాచారం. వారంరోజుల పాటు ఇంటరాగేషన్ కు అవకాశం ఉండటంతో.. ఏ రోజైనా సీన్ రీకన్ స్ట్రక్షన్ చేయొచ్చని సమాచారం. కిడ్నాప్ చేసిన విధానం.. హత్యచేసిన తీరును పోలీసులు తెల్సుకుని.. ఆధారాలను ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారని తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో నిందితులు ఉపయోగించిన లారీని క్లూస్ టీం, పోలీసులు మరోసారి పరిశీలించారు. ప్రత్యేక కోర్టు  ఏర్పాటు చేయడంతో….నిందితులకు కఠిన శిక్ష  పడేలా ఆధారాలు సేకరిస్తున్నారు.

దిశ హత్య కేసులో వీలైనంత వేగంగా చార్జిషీట్ దాఖలు చేయాలని శంషాబాద్ పోలీసులకు సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఆదేశాలు జారీచేశారు. శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ ఆధ్వర్యంలో మొత్తం ఏడు బృందాలు దిశ కేసును దర్యాప్తు చేస్తున్నాయి. ఒక్కో బృందంలో ఏడుగురు పోలీసులున్నారు. దిశ కేసు దర్యాప్తులో మొత్తం 50 మంది అధికారులు, పోలీసులు పాల్గొంటున్నారు. సీపీ స్థాయి నుంచి కానిస్టేబుళ్ల వరకు ఇన్వెస్టిగేషన్ లో పాల్గొంటున్నారు.

చార్జిషీట్ దాఖలు చేసేవరకు ఈ ఏడు బృందాలు పనిచేస్తాయి. సాక్ష్యాల సేకరణకు ఓ టీమ్.. ఫోరెన్సిక్, DNAల పరిశీలనకు ఓ టీమ్, లీగల్ ప్రొసీడింగ్స్ చూసేందుకు ఓ టీమ్ ఏర్పాటయ్యాయి. కేసులో కీలకమైన ప్రత్యక్ష సాక్షుల విచారణ గుర్తింపుకోసం ఓ టీమ్ పనిచేస్తోంది. సీసీ కెమెరాల వీడియో ఎనాలసిస్, టెక్నికల్ ఎవిడెన్స్ విశ్లేషణను మరో టీమ్ చేస్తోంది. సీన్ టు సీన్ ఎనాలసిస్, క్రైమ్ సీన్ రీ కన్ స్ట్రక్షన్ కోసం మరో బృందం ఏర్పాటైంది. ముప్పై రోజుల్లో చార్జిషీట్ దాఖలుచేసి.. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో నిందితులకు శిక్షలు వేయించే లక్ష్యంతో ఈ ప్రత్యేక బృందం పనిచేయబోతోంది.

Latest Updates