ఏపీ కావాలనే కయ్యం పెట్టుకుంటుంది

అపెక్స్ కౌన్సిల్ భేటీపై అధికారులతో సీఎం చర్చ

వచ్చే నెల అక్టోబర్ 6న జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం కేసీఆర్ గురువారం అధికారులతో చర్చించనున్నారు. దానికి సంబంధించి గురువారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో నీటిపారుదల శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. తెలంగాణ నీటిపారుదల శాఖకు సంబంధించిన సమగ్ర వివరాలను, కేంద్రానికి చెప్పాల్సిన అన్ని విషయాలకు సంబంధించిన వివరాలను తీసుకొని సమావేశానికి రావాల్సిందిగా అధికారులను సీఎం ఆదేశించారు.

‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నదీ జలాల విషయంలో కావాలనే కెలికి కయ్యం పెట్టుకుంటున్నది. అపెక్స్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేస్తున్న వాదనలకు ధీటైన సమాధానం చెప్పాలి. మళ్లీ తెలంగాణ జోలికి రాకుండా వాస్తవాలను కుండబద్ధలు కొట్టినట్లు స్పష్టం చేయాలి. అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వ నిష్క్రియాపరత్వాన్ని, ఏడు సంవత్సరాల అలసత్వాన్ని ఈ సమావేశంలో తీవ్రంగా ఎండగట్టాలి. తెలంగాణ ప్రజల హక్కులను హరించడానికి జరుగుతున్న ప్రయత్నాన్ని ప్రతిఘటించాలి. నిజానిజాలను ఈ సమావేశం సందర్భంగా యావత్ దేశానికి తేటతెల్లం చేయాలి’ అని ముఖ్యమంత్రి అన్నారు.

‘రాష్ట్రాల పునర్విభజన చట్టాల ప్రకారం దేశంలో ఎప్పుడైనా కొత్త రాష్ట్రం ఏర్పడితే వెంటనే ఆ రాష్ట్రానికి రావాల్సిన నీటిని కూడా కేటాయించాలి. తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2న ఏర్పడితే జూన్ 14న ప్రధాన మంత్రికి లేఖ రాశాం. తెలంగాణ రాష్ట్రానికి నీటి కేటాంయిపులు జరపాలని కోరాం. ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్పూట్ యాక్ట్ 1956 సెక్షన్3 ప్రకారం ప్రత్యేక ట్రిబ్యూనల్ వేశైనా, లేదంటే ఇప్పుడున్న ట్రిబ్యూనల్ ద్వారా అయినా తెలంగాణకి నీటి కేటాయింపులు జరపాలని కోరాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్యనైనా.. లేదంటే నదీపరివాహాల ప్రాంతాల్లోని మొత్తం రాష్ట్రాల మధ్యనైనా నీటి పంపిణీ జరపాలని కోరాం. ప్రధాన మంత్రికి లేఖ రాసి ఏడేళ్ల సమయం పూర్తికావొస్తున్నా ఈ నాటికి స్పందన లేదు. కేంద్ర ప్రభుత్వం నుండి ఉలుకు లేదు పలుకు లేదు. పైగా అపెక్స్ సమావేశాల పేరిట ఏదో చేస్తున్నట్టు అనిపిస్తున్నారు. కానీ కేంద్రం ఏమీ చేయడం లేదు. వచ్చేనెల 6న జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని కూడా గట్టిగా ఎండగట్టాలి. తెలంగాణకు నీటి కేటాయింపుల విషయంలో స్పష్టత ఇవ్వాలని పట్టుపట్టాలి’ అని ముఖ్యమంత్రి అధికారులకు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం కోరుతున్న న్యాయమైన డిమాండ్ల విషయంలో అవసరమైన అన్ని వాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను కోరారు.

For More News..

ఐక్యరాజ్యసమితి నుంచి అవార్డు అందుకున్న సోనూసూద్

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరికి కరోనా పాజిటివ్

అమెరికా ఆర్థిక వ్యవస్థను ట్రంప్ భ్రష్టుపట్టించారు: జో బైడెన్

ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురికి గాయాలు

Latest Updates