రూ. 25 వేల కోట్ల లోన్ ఇవ్వండి : NDBని కోరిన జగన్

అమరావతి, వెలుగు: ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కోసం రూ.25 వేల  కోట్ల లోన్ ఇవ్వాలని న్యూ డెవలప్ మెంట్ బ్యాంకు (ఎన్డీబీ) ప్రతినిధులను ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. గురువారం ఎన్డీబీ వైస్ ప్రెసిడెంట్ ఎన్ జాంగ్, ప్రాజెక్టు హెడ్ రాజ్ పుర్కర్  అమరావతిలోని క్యాంపు కార్యాలంలో జగన్ తో భేటీ అయ్యారు. గతేడాది ఏపీ సర్కారు కోరిన రుణసాయంపై చర్చించారు. త్వరలో జరగబోయే బ్యాంకు బోర్డు మీటింగ్ లో దీనిపై చర్చిస్తామన్నారు. ఏపీ సర్కారు వినతిని ఎన్డీబీ బోర్డు మీటింగ్ అంగీకరిస్తే రెండు నెలల్లో  రూ. 6 వేల కోట్ల అప్పు అందనుంది.

రోడ్లు, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కోసం చేసే ఖర్చులో 70 శాతాన్ని బ్యాంకు రుణం ద్వారా సమీకరించి మిగిలిన 30 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది. నాలుగు దశల్లో విడుదలయ్యే ఈ మొత్తాన్ని 32 ఏళ్లలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. స్కూళ్లు, ఆస్పత్రులను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేయడానికి మరింత రుణం ఇవ్వాలని ఎన్డీబీ ప్రతినిధులను జగన్ కోరారు. బ్రిక్స్ దేశాలైన బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా న్యూడెవలప్ మెంట్ బ్యాంకును 2015లో ఏర్పాటు చేశాయి. షాంఘై వేదికగా పనిచేస్తున్న ఈ బ్యాంకు వివిధ ప్రాజెక్టులకు రూ.75 వేల కోట్ల రుణాలు అందించింది. నాలుగేళ్లలో ఇండియాలోని ప్రాజెక్టులకు రూ.25 వేల కోట్లు రుణ సాయం  చేసింది.

Latest Updates