కృష్ణా నీళ్లన్నీ ఏపీకే : పోతిరెడ్డిపాడుపై జగన్​ కొత్త స్కెచ్

పోతిరెడ్డిపాడుపై జగన్​ కొత్త స్కెచ్
శ్రీశైలం నిండక ముందే ఖాళీ చేసే ప్లాన్​
తెలంగాణ ప్రాజెక్టులకు పొంచి ఉన్న ముప్పు
గ్రేటర్​ హైదరాబాద్​కు తాగునీటి గండం
ఎత్తిపోనున్న పాలమూరు, కల్వకుర్తి లిఫ్ట్‌‌లు
సాగర్​ ఆయకట్టుకు భారీ ముప్పు
3 జిల్లాల్లో 20 లక్షల ఎకరాలపై ప్రభావం

కృష్ణా జలాలపై ఏపీ ప్రభుత్వం కన్నేసింది. అధికారికంగానే కృష్ణా నీటిని దోచుకెళ్లేందుకు రెడీ అవుతోంది. పోతిరెడ్డిపాడు హెడ్​ రెగ్యులేటర్​  కెపాసిటీని రెండింతలకు పెంచుతామని స్వయంగా ఏపీ సీఎం జగన్​ అసెంబ్లీలో ప్రకటించారు. ఇప్పుడున్న 44 వేల క్యూసెక్కుల కెపాసిటీని 80 వేల క్యూసెక్కులకు పెంచుతామని వెల్లడించారు.  శ్రీశైలం నిండకముందే… భారీ మొత్తంలో  కృష్ణా నీటిని రాయలసీమకు తీసుకెళ్లేందుకు ఏపీ స్కెచ్​ వేసిందని అర్ధమవుతోంది. దీంతో రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బ తినే ప్రమాదముందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

స్పందించని సర్కారు.. నోరెత్తని ప్రతిపక్షాలు

ఇంత జరుగుతున్నా మన రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవటం, ఉద్యమ సమయంలో పోతిరెడ్డిపాడు ద్వారా నీటి దోపిడీని వేలెత్తి చూపిన ప్రతిపక్షాలు ఇప్పుడు నోరెత్తకపోవటం చర్చనీయాంశంగా మారాయి. నిరుడు ఎన్నికల ప్రచారం సందర్భంగా  మహబూబ్​నగర్ పర్యటనలో సీఎం కేసీఆర్​ పోతిరెడ్డిపాడు గురించి మాట్లాడుతూ..‘‘వైఎస్​ అనే దుర్మార్గుడు పోతిరెడ్డిపాడుకు ​పొక్క కొట్టి.. ఇక్కడి మన కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమాలను పెండింగ్​ పెట్టి పాలమూరును ఎండబెట్టి 64 వేల క్యూసెక్కుల కాల్వ తవ్వుకపోయిండు. దు:ఖం వస్తది..  బాధ అయితది..’’ అని అన్నారు. కానీ పోతిరెడ్డిపాడు కెపాసిటీని 80 వేల క్యూసెక్కులకు పెంచుతామని ఇటీవల రెండుసార్లు ఏపీ సీఎం జగన్​ ప్రకటించినా.. తెలంగాణ ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవటం చర్చనీయాంశంగా మారింది. గతంలో పోతిరెడ్డిపాడుపై ప్రతి అంశాన్ని ఫోకస్​ చేసిన ప్రతిపక్షాలు ఇప్పుడు సైలెంట్​గా ఉండటం..  ఉద్యమ సమయంలో యాక్టివ్​గా పని చేసిన ఇంజనీర్లను షాక్​కు గురి చేస్తోంది. సీఎం కేసీఆర్​, ఏపీ సీఎం జగన్​ వరుసగా చర్చలు జరపటం, ఏకంగా గోదావరి జలాలను కృష్ణాకు అనుసంధానం చేసే ప్రతిపాదనలపై భేటీ కావటంతో పోతిరెడ్డిపాడుపై మాట్లాడేందుకు ఇరిగేషన్ అధికారులు వెనుకాముందాడుతున్నారు.

హైదరాబాద్​, వెలుగు: పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంచితే  భవిష్యత్తులో తెలంగాణకు కృష్ణా నీరందటం గగనంగా మారుతుందని ఇంజినీర్లు హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా. కృష్ణా నదిపై నిర్మాణంలో ఉన్న తెలంగాణ ప్రాజెక్టులన్నీ ఎండిపోనున్నాయి. ప్రధానంగా నాగార్జునసాగర్​కు నీటి ముప్పు ముంచుకు రానుంది. సాగర్​పై ఆధారపడ్డ లక్షలాది ఎకరాల ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారనుంది. నిర్మాణంలో ఉన్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, కల్వకుర్తి, ఎస్ఎల్​బీసీ ప్రాజెక్టు ఎత్తిపోయే ప్రమాదముంది. ఏఎమ్మార్ ప్రాజెక్టుకు నీరందే పరిస్థితి ఉండదు. ​ దీంతో మహబూబ్​నగర్​, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో దాదాపు ఇరవై లక్షల ఎకరాల ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారనుంది. హైదరాబాద్​కు తాగునీటి గండం తలెత్తనుంది. వీటితో పాటు శ్రీశైలం, సాగర్​లో విద్యుదుత్పత్తి నిలిచిపోతుంది.

గండిపై గండి..కొట్టేద్దాం

శ్రీశైలం నుంచి కృష్ణా జలాలకు గండి కొట్టి రాయలసీమకు నీటిని తీసుకెళ్లేందుకు ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్​ సీఎంగా ఉన్న హయాంలో పోతిరెడ్డిపాడు హెడ్​ రెగ్యులేటర్​ నిర్మించారు. ఇక్కడున్న ఎనిమిది గేట్ల  షట్టర్లు ఎత్తితే రోజుకు 44 వేల క్యూసెక్కుల నీరు తీసుకెళ్లే వీలుంది. అంటే సాగర్​ ఎడమకాల్వతో పోలిస్తే ఇంచుమించు నాలుగింతలు పెద్ద ప్రవాహమని చెప్పుకోవచ్చు. శ్రీశైలంలో గరిష్ఠ నీటి నిల్వ మట్టం 885 అడుగులు. ఇందులో నీటి మట్టం 854 అడుగులకు చేరితే… బ్యాక్​ వాటర్​ను సునాయసంగా తరలించేందుకు వీలుగా పోతిరెడ్డిపాడు హెడ్​ రెగ్యులేటర్​ నిర్మించారు. ఇప్పుడు పోతిరెడ్డిపాడు కెపాసిటీని డబుల్​ చేయాలని ఏపీ సీఎం జగన్​ తీసుకున్న నిర్ణయంతో.. ఏకంగా రోజుకు తొమ్మిది టీఎంసీల నీటిని తీసుకెళ్లే వీలుంటుంది. అదే జరిగితే శ్రీశైలం నిండకముందే కృష్ణా నది సీమవైపు మళ్లించినట్లవుతుందని ఇంజనీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  కృష్ణా నదికి భారీగా వరద వచ్చినప్పుడు ఇబ్బంది లేకున్నా… నికర జలాలను సైతం ఖాళీ చేసేలా ఏపీ దీన్ని డిజైన్​ చేసుకున్న తీరుపైనే వివాదం కొనసాగుతోంది. దీనికి తోడు నీటి నియంత్రణపై కట్టడి లేకపోవటం,  ఎంత నీటిని తరలిస్తున్నారో కేఆర్​ఎంబీకి లెక్కలు చెప్పకుండా ఏపీ దాచి పెట్టడం నీటి దోపిడీకి అద్దం పడుతోంది.

విచ్చలవిడిగా నీళ్ల వాడకం

ఇప్పటికే కృష్ణా నీటి వాటాలు, నీటి వినియోగంపై రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా రివర్​ మేనేజ్​మెంట్​ బోర్డు వద్ద పంచాయతీ కొనసాగుతోంది. ఈ సీజన్​లో నవంబర్‌‌ నెలాఖరు వరకు బోర్డు కేటాయించిన నీటి వాటాలను సైతం ఏపీ పట్టించుకోలేదు.  ఏపీకి 302 టీఎంసీలు, తెలంగాణకు 126 టీఎంసీలను బోర్డు కేటాయించింది. కానీ డిసెంబర్‌‌ రెండో తేదీ నాటికి ఏపీ 407.147 టీఎంసీలను తరలించుకుపోయింది. పోతిరెడ్డిపాడు హెడ్‌‌ రెగ్యులేటర్‌‌ ద్వారా 116 టీఎంసీలకు బోర్డు అంగీకరిస్తే ఇప్పటికే 166.55 టీఎంసీలు తీసుకెళ్లింది. హంద్రీనీవా, ముచ్చుమర్రి స్కీములకు 20 టీఎంసీలిస్తే 20.69 టీఎంసీలు తరలించింది. కృష్ణా నీటిని ఏపీ విచ్చలవిడిగా వాడుకునేందుకు  తెలంగాణ ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు.  ఏకంగా ఇవేవీ పట్టించుకోకుండా పోతిరెడ్డిపాడును విస్తరించేందుకు ఏపీ తీసుకున్న నిర్ణయం  అధికారులను సైతం విస్మయానికి గురి చేసింది.

Latest Updates