30 రోజుల యాక్షన్​ ప్లాన్ : దసరానాటికి ఊళ్లన్నీ క్లీన్

పల్లె ప్రగతి కోసమే
30 రోజుల యాక్షన్​ ప్లాన్
అందరూ కలసి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలి
ప్రతి నెల రూ.339 కోట్ల నిధులు విడుదల చేస్తామని వెల్లడి

హైదరాబాద్ , వెలుగు:‘‘పల్లె ప్రగతికి మార్గం వేసే 30 రోజుల స్పెషల్​ యాక్షన్​ ప్లాన్​ను సక్సెస్​చేసే బాధ్యత ప్రజల మీదే ఉంది. ఏ ఊరి ప్రజలు.. ఆ ఊరి హీరోలై తమ గ్రామాల రూపురేఖలను మార్చాలి. అవసరమైన చోట ప్రజలే శ్రమదానం చేయాలి. జనం స్వచ్ఛందంగా భాగస్వాములైతే గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత వెల్లివిరుస్తుంది. ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు నిబద్ధతతో పని చేసి పంచాయతీలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుతారని నేను నమ్ముతున్నాను’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. మన గ్రామ పంచాయతీలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశంతో 30 రోజుల యాక్షన్ ప్లాన్ రూపొందించామన్నారు.

ప్రజల భాగస్వామ్యంతో దానిని అమలు చేసి సక్సెస్​ చేయాలని భావిస్తున్నామని, యాక్షన్ ప్లాన్ తర్వాత గ్రామాల ముఖచిత్రం మారి తీరాలని, దసరా పండుగను పరిశుభ్రమైన వాతావరణంలో ప్రజలు జరుపుకోవాలని సూచించారు. మంగళవారం హైదరాబాద్​ రాజేంద్రనగర్ లోని తెలంగాణ స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్​మెంట్ లో 30 రోజుల స్పెషల్​ యాక్షన్​ ప్లాన్ పై​జరిగిన రాష్ట్ర సదస్సులో సీఎం ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. యాక్షన్​ ప్లాన్​కు సంబంధించి వారి డౌట్లను క్లియర్​ చేశారు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇతర మంత్రులు, సీఎస్​ ఎస్.కె.జోషి, రాష్ట్ర ప్లానింగ్​ కమిషన్​ వైస్​ చైర్మన్​ వినోద్ కుమార్, టీఆర్ఎస్​ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా కలెక్టర్లు, డీపీఓలు, డీఎఫ్ఓలు, సీఈవోలు, డీఎల్పీవోలు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, డిస్కమ్ ల సీఎండీలు రఘుమారెడ్డి, గోపాలరావుతోపాటు ఎస్ఈలు సదస్సులో పాల్గొన్నారు.

‘‘అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం, పచ్చదనం, పరిశుభ్రతను కాపాడడం, వార్షిక, పంచవర్ష ప్రణాళికలు రూపొందించడం, వాటికి అనుగుణంగా బడ్జెట్ రూపొందించడం, సక్రమంగా నిధుల వినియోగం, క్రమం తప్పకుండా పన్నులు వసూలు చేయడం లాంటి పనులను గ్రామ పంచాయతీలు నిర్వహించాలి”అని కేసీఆర్​ నిర్దేశించారు.

మార్పు తీసుకొచ్చే ప్రయత్నం

గ్రామాల్లో మార్పు తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా పంచాయతీలకు అధికారాలు, విధులు, నిధులను అందించామని సీఎం చెప్పారు. పంచాయతీల మాదిరిగానే మండల పరిషత్​లు, జిల్లా పరిషత్​లకు అధికారాలు, విధులు, నిధులు అప్పగించాలని నిర్ణయించామన్నారు. పచ్చదనం, పరిశుభ్రత వెల్లివిరిసేలా చేయడం, నిధుల సద్వినియోగం, ప్రజా భాగస్వామ్యంతో అభివృద్ధి పనులు చేయడమనేది నిరంతరం సాగాలని, 30 రోజుల ప్రణాళికతో మంచి ఒరవడి ప్రారంభం కావాలని ప్రభుత్వం కోరుకుంటోందని సీఎం అన్నారు. కలెక్టర్లు దానికి నాయకత్వం వహించాలని, పంచాయతీ రాజ్ శాఖ అధికారులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చేతులెత్తి ప్రార్థిస్తున్నానని చెప్పారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ బాధ్యతలు పంచుకునేందుకు ముఖ్య శాఖలకు ప్రత్యేక అధికారులను నియమిస్తామని, డిప్యూటీ కలెక్టర్ లేదా మరో హాదా కల్పిస్తామని, వారిలో ఒకరిని పంచాయతీ రాజ్ శాఖకు కేటాయిస్తామని సీఎం తెలిపారు.

ప్రజాసేవకులం అనుకోవాలి

రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి ముఖ్య సేవకుడు అనే భావనతోనే తానుంటానని, అధికారులు కూడా తామంతా ప్రజాసేవకులం అనుకున్నప్పుడే మంచి ఫలితాలు వస్తాయని సీఎం అన్నారు. యాక్షన్​ ప్లాన్​ అమలు చేయడానికి ముందే ప్రభుత్వం తన బాధ్యతలను నెరవేర్చిందన్నారు. ‘‘కొత్త పంచాయతీ రాజ్ చట్టం వచ్చింది. పీఆర్​ శాఖలోని ఖాళీలను వేగంగా భర్తీ చేస్తున్నాం. ఫైనాన్స్​ కమిషన్​ సిఫార్సుల మేరకు వచ్చిన నిధులకు, రాష్ట్ర ప్రభుత్వ ఫండ్స్​ కూడా కలిపి పంచాయతీలకు నెలకు రూ.339 కోట్ల చొప్పున విడుదల చేస్తున్నాం. ఖర్చు చేయగా మిగిలిన నిధుల ను వచ్చే ఏడాదికి బదిలీ చేసేలా చట్టంలో నిబంధన పెట్టాం. 36 వేల మంది సఫాయి కార్మికుల వేతనాలను నెలకు రూ.8,500 చేయాలని నిర్ణయించాం. చెత్త సేకరణ, చెట్లకు నీళ్లుపోయడానికి ట్రాక్టర్లు కొనే వెసులుబాటు కల్పించాం”అని కేసీఆర్​ వివరించారు.

ఒకనాడు ఉద్యమంగా కొనసాగిన పంచాయతీరాజ్ వ్యవస్థకు పునర్వైభవం తేవడం, గ్రామ వికాసంలో ప్రజా భాగస్వామ్యం కల్పించడం, గ్రామాల్లో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి బాటలు వేయడం, పచ్చని, పరిశుభ్రమైన పల్లె సీమల నిర్మాణం, ప్రణాళికాబద్ధంగా నిధుల వినియోగం, అజాగ్రత్త, అలసత్వానికి ఆస్కారం లేని పాలన అందించడం, ప్రజాప్రతినిథులు, అధికారుల్లో జవాబుదారీతనం పెంచడానికి ప్రభుత్వం ఈ చట్టం తెచ్చింది”అని సీఎం కేసీఆర్ వివరించారు.

Latest Updates