బీజేపీతో జాగ్రత్త : కేసీఆర్

  • విమర్శలకు దీటుగా బదులివ్వండి
  • కేబినెట్ మీటింగ్​లో కేసీఆర్
  • బడ్జెట్​కు  కేబినెట్ ఆమోదం

హైదరాబాద్ , వెలుగు: రాష్ట్రంలో బీజేపీతో జాగ్రత్తగా ఉండాలని, విమర్శలకు దీటుగా బదులివ్వాలని కేబినెట్ సమావేశంలో మంత్రులకు సీఎం కేసీఆర్ సూచించారు. ఆదివారం సాయంత్రం సమావేశమైన కేబినెట్ పూర్తి స్థాయి బడ్జెట్ కు ఆమోద ముద్ర వేసింది. సోమవారం ఉదయం 11.30 గంటలకు అసెంబ్లీలో సీఎం కేసీఆర్, మండలిలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు బడ్జెట్  ప్రవేశపెట్టనున్నారు. మూడున్నర గంటలపాటు జరిగిన కేబినెట్ భేటీలో రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, కొత్త గవర్నర్ నియామకం వంటి అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కొత్త మంత్రులను సహచర మంత్రులకు పరిచయం చేసి.. వారికి కేటాయించిన శాఖలపై వివరించినట్లు  సమాచారం. కొత్త మంత్రులు పనిచేయాల్సిన విషయమై పలు సూచనలు చేశారని తెలుస్తోంది. సమావేశ వివరాలను బయటకు వెల్లడించకూడదని, మీడియాతో జాగ్రత్తగా ఉండాలని సీఎం చెప్పినట్లు సమాచారం. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులకు పదవుల పంపిణీపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ, మండలిలో ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలపై సమాధానాలకు సిద్ధంగా ఉండాలని మంత్రులకు సీఎం సూచించినట్లు సమాచారం. మున్సిపల్ చట్టం, సెక్రటేరియెట్ పై  కేబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్,  చార్మినార్ జోన్ లోకి వికారాబాద్ జిల్లాను కలిపే బిల్లులను కేబినెట్ ఆమోదించింది. ఇంకా విచారణలో ఉన్న మున్సిపల్ కేసు త్వరలో క్లియర్ అవుతుందని మంత్రులకు సీఎం చెప్పినట్లు తెలిసింది.

సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన చీఫ్ విప్ లు

కొత్తగా చీఫ్ విప్ లుగా నియమితులైన దాస్యం వినయ్ భాస్కర్ , బోడకుంటి వెంకటేశ్వర్లు , ఇతర విప్ లు ఆదివారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలిశారు. అసెంబ్లీ, మండలిలో విప్ లు నిర్వహించాల్సిన బాధ్యతలను సీఎం వారికి వివరించారు.

Latest Updates