రెండు రాష్ట్రాల మధ్య ఫ్రెండ్లీగా పంపకాలు

  • ఎల్లుండి ప్రగతిభవన్​లో కేసీఆర్, జగన్​ భేటీ
  • నీటి వాటాలు, విభజన సమస్యలపై ప్రధాన చర్చ
  • గోదావరి నీటిని కృష్ణాకు తరలించే ప్రతిపాదన
  • విద్యుత్​ బకాయిలు, ఉద్యోగుల పంపకం తేలే అవకాశం
  • తొమ్మిది, పదో షెడ్యూళ్లలోని సంస్థల విభజన ఓ కొలిక్కి
  • 3న గవర్నర్​తో సీఎస్​ల మీటింగ్..
  • సీఎంల భేటీ నిర్ణయాలపై నివేదిక
  •  ఆమోదం కోసం కేంద్ర హోం శాఖకు
  • ఇచ్చి పుచ్చుకునే ప్రయత్నంలో తెలంగాణ, ఏపీ సీఎంలు

ఢిల్లీలో ఏపీ భవన్​ మాదే.. కృష్ణా జలాల్లో మా వాటా మాకు దక్కాలి.. తొమ్మిది, పదో షెడ్యూళ్లలోని సంస్థల ఆస్తులు అప్పుల పంపిణీకి షీలాభిడే కమిటీ సిఫారసులను పట్టించుకోం.. ఇంతకాలం ఇలా వాదనలు చేసిన రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు పంతం వీడాయి. తెలంగాణ, ఏపీ మధ్య పెండింగ్​లో ఉన్న వివాదాలను ఇచ్చిపుచ్చుకునే ధోరణితో సెటిల్​ చేసుకోవాలని నిర్ణయించాయి.

హైదరాబాద్​, వెలుగు: తెలంగాణ, ఏపీ మధ్య పెండింగ్​లో ఉన్న వివాదాలన్నింటినీ ఇచ్చిపుచ్చుకునే ధోరణితో సెటిల్​ చేసుకోవాలని ఇరు రాష్ట్రాలు భావిస్తున్నాయి. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం జగన్​ ఈ నెల 28న ప్రగతిభవన్​లో భేటీ కానున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య నదీ జలాలు, నీటి వాటాల పంపిణీ, తొమ్మిది పదో షెడ్యూళ్లలోని సంస్థల ఆస్తులు, అప్పల పంపిణీ, విద్యుత్​ సంస్థలకు సంబంధించిన బకాయిలు, ఉద్యోగుల విభజన అంశాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఆయా విభాగాలకు చెందిన ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు చర్చలకు సంబంధించిన ఎజెండాను రూపొందిస్తున్నారు. ప్రధానంగా గోదావరి నీటిని కృష్ణాకు తరలించే సాధ్యాసాధ్యాల అధ్యయనంతోపాటు అవసరమైన ప్రాజెక్టుల రూపకల్పనపై ప్రధానంగా చర్చించే అవకాశముంది. సాగునీటి రంగ నిపుణులతో పాటు రెండు రాష్ట్రాల అధికారులు దాదాపు అరవై మంది ఈ చర్చల్లో పాల్గొననున్నట్టు తెలిసింది. సీఎంల చర్చల్లో భాగంగా వెలువడ్డ నిర్ణయాలు, మీటింగ్​ తీర్మానాలను వేగవంతంగా అమలు చేసేలా తదుపరి కార్యాచరణ కూడా సిద్ధమైంది. ఇక జులై 3న రెండు రాష్ట్రాల సీఎస్​లు గవర్నర్​ సమక్షంలో సమావేశం కానున్నారు. ఇరు రాష్ట్రాలు ఏకాభిప్రాయంతో సెటిల్ చేసుకున్న అంశాలపై నివేదికను గవర్నర్​కు నివేదిస్తారు. తర్వాత దానిని కేంద్ర హోంశాఖకు పంపించేలా టైం టేబుల్​ సిద్ధం చేసుకున్నట్టు తెలిసింది.

ఏపీకి హెర్మిటేజ్​ బిల్డింగ్

హైదరాబాద్​ సచివాలయంలోని తమ భవనాలను ఏపీ ప్రభుత్వం తెలంగాణకు అప్పగించింది. వాటి విద్యుత్‌‌, నీటి బిల్లుల బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఆదర్శనగర్​లోని హెర్మిటేజ్​ భవనాన్ని ఏపీకి అప్పగించింది. ఏపీపీఎస్సీ విభజన, టీఎస్​పీఎస్సీ భవనాల పంపిణీ జరగలేదు. ఢిల్లీలోని ఏపీ భవన్‌‌ ను విభజించాలని ఏపీ కోరుతుండగా.. వారసత్వంగా హైదరాబాద్​ స్టేట్ కు చెందిన ఆ బిల్డింగ్  తమకే చెందుతుందని తెలంగాణ వాదిస్తోంది.

డోంట్​ కేర్​ ‘షీలాభిడే’!

విభజన చట్టంలో తొమ్మిది, పదో షెడ్యూళ్లలో పొందుపరిచిన కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులు, అప్పుల పంపిణీ ఇప్పటికీ పూర్తి కాలేదు. షీలాభిడే కమిటీ సిఫార్సులపై ఇరు రాష్ట్రాలు తలో వాదన లేవనెత్తాయి. తొమ్మిదో షెడ్యూల్లోని 91 సంస్థల్లో 72 సంస్థలపై కమిటీ మార్గదర్శకాలు ఇచ్చింది. ప్రభుత్వ రంగ సంస్థల హెడ్‌‌ క్వార్టర్స్‌‌ను 58:42 నిష్పత్తిలో పంచాలని తెలంగాణ కోరింది. వర్క్‌‌ షాపులు, గెస్ట్ హౌజ్ లు, ట్రైనింగ్​ సెంటర్లు, ఆసుపత్రుల వంటివి ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రానికే చెందుతాయని కేంద్రం సూచించింది. రెండు ప్రభుత్వాలు ఎవరికివారుగా తమకు అనువుగా అన్వయించుకోవటంతో ఆర్టీసీ, డెయిరీతో పాటు ఆర్థిక లావాదేవీలుండే సంస్థల విభజన నిలిచిపోయింది. ఇప్పుడా కమిటీ మార్గదర్శకాలను పక్కనపెట్టి.. ఇరు రాష్ట్రాలు సామరస్యంగా ఆ సంస్థలను పంచుకోవడంపై దృష్టి పెడుతున్నాయి.

కోట్లల్లో లెక్కలు తేలాలి..

విద్యుత్​ కొనుగోలు, సరఫరాకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తమకు రూ.3,378 కోట్లు బకాయి ఉందని ఏపీ వాదిస్తోంది. మరోవైపు డిస్కంలు, ట్రాన్స్ కో, ఏపీ జెన్​కో నుంచి టీఎస్​ జెన్​కోకు రూ.5,783 కోట్లు రావాల్సి ఉందని తెలంగాణ లెక్కలు వేస్తోంది. ఇంకా తెలంగాణకే రూ.2,405 కోట్లు రావాలంటూ నివేదికలు తయారు చేసింది. ఇక సివిల్​ సప్లయీస్​ విభాగంలో కేంద్రం నుంచి రావాల్సిన లెవీలో రూ.1,775 కోట్లు తమకు రావాలని ఏపీ అంటుండగా.. రూ.650 కోట్లే ఏపీకి వస్తాయని తెలంగాణ వాదిస్తోంది. వీటికి తోడు వివిధ పథకాల కింద ఇచ్చిన రూ. 1,621 కోట్లలోని రూ.478 కోట్ల విదేశీ రుణాల్లో రెండు రాష్ట్రాల వాటాలు తేలలేదు. గోదావరి టు శ్రీశైలం

గోదావరి నీటిని కృష్ణా బేసిన్​కు తరలించి వరద నీటిని గరిష్టంగా వాడుకోవాలని రెండు రాష్ట్రాలు కొత్త ప్లాన్​ సిద్ధం చేస్తున్నాయి. గోదావరి జలాలను శ్రీశైలం జలాశయానికి తరలించడం ద్వారా అటు రాయలసీమతో పాటు, తెలంగాణలోని మహబూబ్‌‌నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలు సస్యశ్యామలం అవుతాయని ఇద్దరు సీఎంలు భావిస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో ప్రతి అంగుళానికి నీరందిస్తామని ఇటీవలే సీఎం కేసీఆర్​ ప్రకటించడం గమనార్హం. దుమ్ముగూడెం టెయిల్​ పాండ్, ఇంద్రావతి దిగువన ఉన్న తుపాకుల గూడెం నుంచి నాగార్జునసాగర్​కు, అవసరమైతే శ్రీశైలం వరకు నీటిని మళ్లించే అంశాలపై ఇంజనీరింగ్​ నిపుణులతో అధ్యయనం చేయిస్తున్నారు.

ట్రిబ్యునల్​కు దూరం

కృష్ణా జల వినియోగంపై ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలను తామే పరిష్కరించుకోవాలని తెలంగాణ, ఏపీ మాట మాత్రంగా నిర్ణయించుకున్నాయి. బ్రిజేష్​ ట్రిబ్యునల్​తో సంబంధం లేకుండానే అవసరాల మేరకు నీటి వాటాలను ఇచ్చి పుచ్చుకోవాలని భావిస్తున్నాయి. గవర్నర్‌‌ నేతృత్వంలో రెండు రాష్ట్రాల సీఎస్​లు, జలవనరుల శాఖ కార్యదర్శులు ఈ మేరకు అవగాహన కుదుర్చుకునే అవకాశాలున్నాయి.

Latest Updates