వారమైనంక మేల్కొన్న సర్కార్.. వరదలపై లేట్​గా స్పందన

  • హైదరాబాద్​ వరదలపై లేట్​గా స్పందన
  • సాయం అందిస్తామని సీఎం కేసీఆర్​ ప్రకటన
  • కేటీఆర్ రివ్యూ.. మీడియా ముందుకు మంత్రులు
  • నీటిలోనే 500 కాలనీలు.. డేంజర్​ జోన్​లో మరో 80
  • వందలోపే సర్కారు షెల్టర్లు.. లక్షల మంది బాధితులు
  • ఇంకో మూడు రోజులు పెద్ద వానలు

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ సిటీని వారం రోజులుగా వానలు, వరదలు ముంచెత్తుతుంటే రాష్ట్ర సర్కారు ఇప్పుడు కదిలింది. వరద ముంపునకు గురైన ప్రతి ఇంటికి మంగళవారం నుంచి ఆర్థిక సాయం అందిస్తామని సీఎం కేసీఆర్​ సోమవారం ప్రకటించారు.మున్సిపల్​ మంత్రి కేటీఆర్  రివ్యూ చేపట్టారు. డల్లాస్​, న్యూయార్క్​లో కూడా వానలు వస్తే ఇలాంటి పరిస్థితే ఉంటుందుందన్నారు. నీట మునిగిన ఇండ్లల్లో ఎవరూ ఉండొద్దని, షెల్టర్లకు వెళ్లాలని సూచించారు. అయితే వరద బాధితులు లక్షలాది మంది ఉంటే.. వారి కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన షెల్టర్లు కేవలం వందలోపే ఉన్నాయి. మరోవైపు లోతట్టు ప్రాంతాల్లోని బస్తీలు, కాలనీలను వరద వదలడం లేదు. చెరువులకు గండ్లు పడి నీళ్ల ప్రవాహం వస్తూనే ఉంది.

సగం కాలనీలకు ఆఫీసర్లు వస్తలె

హైదరాబాద్​ లోతట్టు ప్రాంతాల్లోని బస్తీలు, కాలనీల్లోని జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితిని తెలుసుకునేందుకు కనీసం ఆఫీసర్లు, లీడర్లు రావడం లేదని బాధితులు రోడ్డెక్కుతున్నారు. 50 శాతం కాలనీల వైపు ప్రభుత్వ యంత్రాంగం కన్నెత్తి కూడా చూడటం లేదని వారు అంటున్నారు.నీటిని తొలగించేందుకు ఎటువంటి ప్రయత్నాలు జరగడం లేదని మండిపడ్డుతున్నారు. మంగళవారం పడ్డ వాన ఒక ఎత్తయితే.. శనివారం పడ్డ వాన మరో ఎత్తు. వరుసగా భారీ వర్షాలు కురుస్తుండటం, మరో మూడురోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో ముంపు బాధితులు వణికిపోతున్నారు. నిత్యావసర సరుకులు, బట్టలు అన్నీ వరదలో కొట్టుకుపోయి.. తినడానికి తిండి లేక  అవస్థలు పడుతున్నారు. సోమవారం కూడా ఖైరతాబాద్​, కూకట్​పల్లి, కుత్భుల్లాపూర్, ఉప్పల్​, బాలానగర్​, చార్మినార్, రాజేంద్రనగర్​ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది.

ముందస్తు చర్యలు లేకే..

చెరువుల కట్టలు తెగిపోయేంత వరకు కూడా ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని పలు కాలనీల వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంత వర్షం కురిసినా పెద్దగా వరద నీరు రాని ఉప్పుగూడ, రామంతాపూర్, హయత్​నగర్,  మీర్​పేట్​ తదితర ప్రాంతాల్లోనూ ఇప్పుడు  చెరువులకు గండి పడటంతో భారీగా వరద నీరు వచ్చి చేరింది. చెరువులు పొంగి, కట్టలు తెగి సిటీలోని చాలా  కాలనీలు, బస్తీలు నీటమునిగాయి.

డేంజర్ జోన్​లో 80 కాలనీలు

వారం రోజుల్లో రెండుసార్లు కురిసిన భారీ వర్షాలకు దాదాపు గ్రేటర్​లో 1,500 కాలనీలు నీట మునిగాయి.  ఇప్పటికీ  500 కాలనీల్లో నీరు నిలిచి ఉంది. 80 కాలనీలైతే డేంజర్​ జోన్​లో ఉన్నాయి. వరద నీరు తగ్గుతున్న టైంలో మళ్లీ వర్షం కురుస్తుండటంతో ఫస్ట్​ ఫ్లోర్  మొత్తం నీటిలోనే మునుగుతున్నాయి. మొన్నటి వరకు కాలనీ వాసులు పెద్ద ఎత్తున సహాయ చర్యల్లో పాల్గొన్నప్పటికీ ఇప్పుడు ఓ పక్క బురద, మరో పక్క దుర్గంధం వల్ల సాహసం చేయలేకపోతున్నారు.

పండుగలు కష్టమే..

భారీ వర్షాల కారణంగా సిటీ జనులు ఈ సారి బతుకమ్మ, దసరా పండుగలు జరుపుకునే పరిస్థితి కనిపించడం లేదు. మరో నాలుగైదు రోజుల్లో పండుగలు ఉండటం.. ఇప్పటికే ఇండ్లు నీటమునగడం, మరో మూడ్రోజులు అలర్ట్​గా ఉండాలని ప్రభుత్వం చెప్పడంతో పండుగలను జరుపుకోలేని పరిస్థితి నెలకొంది. బతుకమ్మ, దసరా కోసమని కిరాణా దుకాణాల్లో నిత్యావసర వస్తువులు, బట్టల దుకాణాల్లో బట్టలు స్టాక్​ తెచ్చిపెట్టుకోవడంతో వరదలో అన్ని కొట్టుకుపోవడంతో ఆ కుటుంబాలు రోడ్డునపడ్డాయి.

వందలోపే షెల్టర్లు..

నీట మునిగిన ఇండ్లలో ఎవరు ఉండొద్దని ప్రభుత్వం చెబుతున్నది. అయితే.. గ్రేటర్​ హైదరాబాద్​లో వరద ముంపునకు గురైన 40 వేల ఇండ్లలో ఉండే జనం లక్షల మంది ఉన్నారు. ఇంతమంది కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేయలేదు. వంద లోపే షెల్టర్లను ఏర్పాటు చేసింది. వాటిలో సరైన సౌలతులు లేవని, అందరితో కలిసి ఉంటే కరోనా సోకుతుందనే భయం బాధితులను వెంటాడుతున్నది. దీంతో కొందరు బంధువుల ఇండ్లకు వెళ్లిపోగా.. ఇంకొందరు తమ ఇండ్ల పైఅంతస్తుల్లో ఉంటున్నారు.

వానొస్తే డల్లాస్, న్యూయార్క్​ కూడా మునుగుతయ్

భారీ వర్షం పడితే డల్లాస్, న్యూయార్క్​ కూడా మునుగుతయ్. దీనికే ప్రభుత్వంపై నిందలేస్తరా?. వాన ఎంత పడ్తదో మాకు తెలుస్తదా?. ప్రజలు, గత ప్రభుత్వాల తప్పిదాలతోనే ఈ పరిస్థితి. ఇప్పుడు హైదరాబాద్​లో 18 బోట్లు మాత్రమే ఉన్నయ్​.  మరో 38 బోట్లు ఏపీ, కర్నాటక నుంచి తెప్పిస్తున్నం.

– మంత్రి కేటీఆర్​

Latest Updates