యాక్షన్ ప్లాన్ పెండింగ్‌‌

  • బడ్జెట్, మున్సిపల్ నోటిఫికేషన్ తర్వాతే పంచాయతీ ప్లాన్​
  • అమలుకు ముందే నిధులివ్వాలని డిమాండ్‌‌
  • పంచాయతీల్లో వేధిస్తోన్న కార్మికుల కొరత
  • 1,313 పంచాయతీ కార్యదర్శుల పోస్టులు ఖాళీ
  • ముదురుతున్న జాయింట్ చెక్ పవర్ లొల్లి

హైదరాబాద్, వెలుగు: పల్లెల్లో పరిశుభ్రత, పచ్చదనం, అభివృద్ధి కోసమంటూ సీఎం కేసీఆర్ ప్రకటించిన పంచాయతీల్లో యాక్షన్ ప్లాన్ మరి కొన్ని రోజులు పెండింగ్‌‌లో పడేట్లుంది. కార్మికుల కొరత, 8 నెలలుగా వారికి జీతాలు చెల్లించకపోవడం, 1313 గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శుల పోస్టులు ఖాళీ, ముదురుతున్న జాయింట్ చెక్ పవర్ లొల్లి, లైన్‌‌మెన్లు సరిపడా లేకపోవడం వంటి సమస్యలున్నాయి. అలాగే పంచాయతీ నుంచి జడ్పీ వరకు అన్ని స్థానిక సంస్థల అధికారాలు, విధులు, బాధ్యతలపై త్వరలో స్పష్టత ఇస్తామని ఇటీవల పంచాయతీ రాజ్ శాఖపై సీఎం కేసీఆర్ చేపట్టిన సమీక్షలో తెలిపారు. దీంతో15న నుంచి జరగాల్సిన 60 రోజుల యాక్షన్‌‌ ప్లాన్‌‌ మరికొన్ని రోజులు వాయిదా పడనున్నట్టు తెలుస్తోంది.

చిచ్చుపెట్టిన చెక్ పవర్

జాయింట్ చెక్‌‌ పవర్‌‌ జీవో జారీతో రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్, ఉపసర్పంచ్‌‌ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఒక వార్డు నుంచి గెలిచి ఉపసర్పంచ్ అయిన వ్యక్తికి చెక్ పవర్ ఎలా అప్పగిస్తారని.. వారికి చెక్‌‌ పవర్‌‌ తొలగించాలని సర్పంచ్‌‌లు డిమాండ్‌‌ చేస్తున్నారు. ఇటీవల సీఎం కేసీఆర్‌‌ను కలిసిన కొంత మంది సర్పంచ్‌‌లు, సర్పంచ్‌‌ల సంఘం నేతలు ఇదే విషయాన్ని ఆయన దృష్టికి తెచ్చారు. అయితే కొత్త పంచాయతీ రాజ్ చట్టం-2018 లో ఇద్దరికి చెక్ పవర్ కల్పించారు. ఇప్పుడు సవరణలు సాధ్యం కాకపోవచ్చని ఎక్స్‌‌పర్ట్స్‌‌ అభిప్రాయపడుతున్నారు.

కార్మికులు సహకరించేనా

రాష్ట్ర వ్యాప్తంగా 12,751 గ్రామాలు ఉండగా కార్మికులు మాత్రం 36వేల మంది మాత్రమే ఉన్నారు. వీరికి నెలకు జీతం వెయ్యి, రూ.1500, రూ.2000 మాత్రమే. ఎనిమిది నెలలుగా అవి కూడా చెల్లించడం లేదని కార్మికులు అంటున్నారు. 2015లో సమ్మె చేసిన సమయంలో నెలకు రూ.8500 జీతం ఇస్తామని, అది కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే ఇంతవరకు ప్రభుత్వం ఆ ఊసే ఎత్తడం లేదు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా 1,313 పంచాయతీల్లో కార్యదర్శులు లేరు. పంచాయతీ రాజ్‌‌ శాఖలో పదోన్నతులు ఇవ్వాలని, అన్ని పోస్టులు భర్తీ చేయాలని ఇటీవల సీఎం ఆదేశించారు. ఇది పూర్తవడానికి మరికొంత సమయం పట్టే అవకాశముంది. ప్రతి గ్రామంలో తప్పనిసరిగా వైకుంఠధామం(శ్మశానం) ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ గతంలో ఆదేశించారు. ఇందుకు ప్రభుత్వ భూములు పరిశీలించాలని, లేనిచోట కొనుగోలు చేయాలని ఆదేశించారు. చాలా గ్రామాల్లో ప్రభుత్వ స్థలాలు లేవని అధికారులు గుర్తించినట్లు సమాచారం. ప్రతిచోట భూముల విలువ చాలా ఎక్కువ ఉండటంతో కొనుగోలు కష్టంగా మారింది.

రాష్ట్రంలో త్వరలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎలక్షన్లు జరగనున్నాయి. అయితే వార్డుల విభజన, ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉన్నాయంటూ కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో చాలా మున్సిపాలిటీల్లో ఎలక్షన్లపై స్టే ఇచ్చింది. ఆ విచారణలు ఇంకా పూర్తి కాలేదు. మున్సిపల్ ఎలక్షన్లకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. పంచాయతీల్లో యాక్షన్ ప్లాన్ వాయిదా పడే అవకాశాలున్నాయి. మరోవైపు ఈ నెల 16లోపు బడ్జెట్‌‌కు ప్రతిపాదనలు పంపాలని అన్ని శాఖలను ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణరావు ఉత్తర్వులు జారీ చేశారు. సెప్టెంబర్‌‌లో బడ్జెట్ ప్రవేశ పెట్టే సూచనలున్నాయి. ఆ తరువాతే యాక్షన్ ప్లాన్ ఉండే అవకాశాలున్నాయి.

నిధులివ్వకుండా ప్లాన్​ అమలెట్లా?

సీఎం పంచాయతీ యాక్షన్ ప్లాన్ ను ప్రకటించారేగానీ ఎంత ఖర్చవుతుంది, ఏమేం చేయాలన్న ప్లాన్, నిధుల గురించి వెల్లడించలేదు. గతంలో గ్రామ జ్యోతి, మన ఊరు– మన ప్రణాళిక అని తీసుకొచ్చారు. నిధులివ్వక అవేవీ అమలు కాలేదు. 14వ ఆర్థిక సంఘం నిధులు తప్ప.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులేవీ ఇవ్వడం లేదు. నిధులు విడుదల చేస్తేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. – పర్వతాలు, పంచాయతీ కార్యదర్శుల సెంట్రల్ ఫోరం అధ్యక్షుడు

Latest Updates