పాత హామీలు నెరవేర్చలె.. ఇప్పుడు కొత్త హామీలా?

పాత హామీలు నెరవేర్చలె.. ఇప్పుడు కొత్త హామీలా?

హైదరాబాద్: బీజేపీ నేత, మాజీ ఎంపీ విజయశాంతి తన నివాసంలో నిరసన దీక్షకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులపై వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా ‘తెలంగాణ రైతు గోస బీజేపీ పోరు దీక్ష’కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా విజయశాంతి తన ఇంట్లో నిరసన దీక్షలో పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ వరంగల్‌‌కు గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని.. ఇప్పుడు కొత్త హామీలను ఇస్తున్నారని విజయశాంతి మండిపడ్డారు. 

‘కేసీఆర్‌ను ప్రజలెవరూ నమ్మేటట్లు లేరు. మామూలు టైమ్‌లో వరంగల్ వెళ్తే ప్రజలు ప్రశ్నిస్తారని తెలిసే కరోనా సమయంలో వెళ్లొచ్చారు. అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలి. తద్వారా రైతులను ఆదుకోవాలి. ఈ లాక్‌డౌన్ సమయంలో రైతులకు రవాణా ఇబ్బంది కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైనే ఉంది. రైతులకు రుణమాఫీ, రైతు బంధు, నష్ట పరిహారం ఇవ్వాలి’ అని విజయశాంతి డిమాండ్ చేశారు.