ఆయనో కర్మ యోగి: సీఎం కేసీఆర్

హైదరాబాద్: రాష్ట్ర శాసన సభ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పకడ్బందీ జాగ్రత్త చర్యల నడుమ సెషన్స్ మొదలయ్యాయి. సమావేశాల ప్రారంభంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సభ్యులకు కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. శానిటైజర్స్ వాడాలని, రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి పౌష్టికాహారం తీసుకోవాలన్నారు. ఇటీవల చనిపోయిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతిపై సంతాప తీర్మానాన్ని ప్రవేశ పెట్టాలని సీఎం కేసీఆర్ ను కోరారు. ప్రణబ్ మృతిపై సభ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోందని కేసీఆర్ అన్నారు.

‘ప్రణబ్ మృతితో భారత్ ఒక శిఖర సమానుడైన నాయకుడ్ని కోల్పోయింది. అర్ధ శతాబ్దం పాటు దేశ రాజకీయాల్లో కీలక భూమిక పోషించిన కర్మ యోగి ప్రణబ్ ముఖర్జీ. 1970 తర్వాత భారత దేశ అభివృద్ధి చరిత్రలో ప్రణబ్ పేరు లేని పేజీ లేదంటే అది అతిశయోక్తి కాదు. ప్రణబ్ దాదా క్రమ శిక్షణ, కఠోర శ్రమ, అంకితభావంతో అంచెలంచెలుగా ఎదిగారు. మిత్ర పక్షాలను కలుపుకుని వెళ్లడంలో విశ్వసనీయమైన నేతగా, కుడి ఎడమలను సమన్వయం చేసుకునే సవ్యసాచిగా ఆయన అందరి మన్ననలు పొందారు. రాజకీయాలను, పార్లమెంటరీ నిబంధలనలను ఔపోసన పట్టిన దురంధరుడిగా ప్రణబ్ ను చెప్పొచ్చు. ప్రతిపక్షాలను సిద్ధాంతాల పరంగానే తప్ప వ్యక్తిగతంగా విమర్శించే వారు కాదు. పార్లమెంట్ లో మాట్లాడే సమయంలో తప్పులు దొర్లితే వెంటనే క్షమాపణలు కోరేవారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య విలువలకు నిలువెత్తు ప్రతీకగా ప్రణబ్ ముఖర్జీ చరిత్రలో నిలిచిపోతారు’ అని కేసీఆర్ పేర్కొన్నారు.

Latest Updates