పంటల లెక్కను పక్కాగా తీయాలి

ఏ గుంటలో ఏ పంట వేస్తున్నారో
రికార్డు చేయాలన్న సీఎం కేసీఆర్​
ఏటా పంటల మార్పిడి జరగాలి.. జిల్లాల వారీగా అగ్రికల్చర్ కార్డు
డిమాండున్న పంటలే వేయాలి.. సాగు పాలసీపై త్వరలో సదస్సులు
సొంత ఖర్చుతో మంత్రులు రైతు వేదికలు నిర్మించాలి
25లోగా ఏఈవో పోస్టులు భర్తీ చేయాలని ఆదేశం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పండే పంటల లెక్కను పక్కాగా తీయాలని వ్యవసాయ శాఖను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఏ గుంటలో ఏ పంట వేస్తున్నారనేది తేల్చాలని, ఈ వానాకాలం నుంచే అది జరగాలని స్పష్టం చేశారు. ఇప్పట్నించి జిల్లాల వారీగా అగ్రికల్చర్ కార్డును తయారు చేయాలని, ఇది ప్రతి ఏడాది కొనసాగాలన్నారు. ఏటా పంటల మార్పిడి ఉంటుందని, దానికి తగ్గట్టు కార్డు రూపొందించాలని ఆదేశించారు. ఖాళీగా ఉన్న ఏఈవో పోస్టులను ఈ నెల 25 లోగా  భర్తీ చేయాలన్నారు. మంత్రులు సొంత ఖర్చుతో రైతు వేదికలు నిర్మించాలని ఆయన ఆదేశించారు. పంటల విధానంపై గురువారం ప్రగతిభవన్​లో సీఎం కేసీఆర్​ సమావేశం నిర్వహించారు. దాదాపు 7 గంటల పాటు జరిగిన ఈ మీటింగ్ లో మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా వ్యవసాయాధికారులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, కలెక్టర్లు, జిల్లా రైతు బంధు సమితుల అధ్యక్షులు, వ్యవసాయ యూనివర్సిటీ అధికారులు, సైంటిస్టులు పాల్గొన్నారు. పండించిన పంటకు మంచి ధర దక్కాలనే కొత్త వ్యవసాయ పాలసీని తెస్తున్నట్టు కేసీఆర్  చెప్పారు.

ఒకే పంట వేస్తే నష్టం

రైతులంతా ఒకే పంట వేయడం వల్ల నష్టపోతున్నారని, ఇప్పట్నించి ప్రభుత్వం చెప్పినట్టు పంటలు వేస్తే ఆ సమస్య ఉండదని సీఎం కేసీఆర్ అన్నారు. ‘‘ప్రభుత్వం ఎన్నో విధాలుగా ఆలోచించి, నియంత్రిత పద్ధతిలో పంటలు సాగు చేస్తే లాభం ఉంటుందని సూచిస్తున్నది. ఏ సీజన్ లో ఏ పంట వేయాలి? ఎక్కడ ఏ పంట సాగు చేయాలి? ఏ రకం సాగు చేయాలి? అనే విషయాలను సైంటిస్టులు నిర్ణయించారు. ఏ పంటకు మార్కెట్లో డిమాండ్ ఉందో ఆగ్రో బిజినెస్ విభాగం వారు తేల్చారు. దాని ప్రకారం ప్రభుత్వం రైతులకు తగు సూచనలు చేస్తున్నది. తెలంగాణ రైతులు ప్రపంచంతో పోటీ పడి గొప్ప రైతులుగా మారాలి. మార్కెట్ లో మంచి డిమాండ్ ఉన్న పంటలు వేయాలి. అప్పుడే మంచి ధర వస్తుంది’’ అని ఆయన చెప్పారు.

వరి 40 లక్షల ఎకరాల్లోనే

ఈ వానాకాలంలో రైతులు తెలంగాణ సోనా రకం వరిని సాగు చేయాలని కేసీఆర్  సూచించారు. నిరుడు వానాకాలంలో 40 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారని,ఈ సారి కూడా అంతే విస్తీర్ణంలో సాగు చేయాలన్నారు.  ‘‘నిరుడు 53 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. ఈ సారి కొంచెం పెంచి 70 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేపట్టాలి. ఈ సారి 15 లక్షల ఎకరాల్లో కంది సాగు చేయాలి. గోదావరి ప్రాజెక్టుల కింద వెంటనే నీరు వచ్చే ప్రాంతంలో దీర్ఘకాలిక వరి రకాలు సాగు చేయాలి. కృష్ణా ప్రాజెక్టు పరిధిలో ఆలస్యంగా నీరు వచ్చే ప్రాంతాల్లో స్వల్పకాలిక వరి రకాలు వేసుకోవాలి’’ అని ఆయన సూచించారు. సోయాబీన్, పసుపు, మిర్చి, కూరగాయలు తదితర పంటలు ఎప్పటిమాదరిగానే పండించాలన్నారు.  ‘‘వానాకాలంలో మక్కల సాగు లాభసాటి కాదు. కాబట్టి ఆ పంట వేయొద్దు. యాసంగిలో మక్కలు సాగు చేసుకోవచ్చు. వానాకాలంలో మక్కలు పండించే అలవాటు ఉన్న వాళ్లు పత్తి, కంది తదితర పంటలు వేసుకోవాలి’’ అని ఆయన సూచించారు.

మంత్రులు సొంత ఖర్చుతో రైతు వేదికలు నిర్మించాలి

ప్రతి మంత్రి సొంత ఖర్చుతో క్లస్టర్ లో రైతు వేదికలు నిర్మించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఎర్రవెల్లి వ్యవసాయ క్లస్టర్​లో తాను సొంత ఖర్చుతో ఆ వేదికను నిర్మిస్తానని ప్రకటించారు. దీంతో రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ముందుకు వచ్చారు. రాష్ట్రంలోని 2602 క్లస్టర్లలో నాలుగైదు నెలల్లో రైతు వేదికల నిర్మాణం పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. అన్ని రైతు వేదికల్లో ఏఈవోకు ఆఫీసు, కంప్యూటర్, వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించుకోవడానికి వీలుగా టీవీ తదితర సౌకర్యాలు ఉండాలన్నారు. ‘‘రాష్ట్రంలో అమలు చేసే పంట సాగు విధానంపై అవగాహన కల్పించేందుకు రానున్న నాలుగైదు రోజుల్లోనే క్లస్టర్ల వారీగా రైతు సదస్సులు నిర్వహించాలి. మంత్రులు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, డీసీసీబీ చైర్మన్లు, డీసీఎంఎస్ చైర్మన్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్లు, సింగిల్ విండో చైర్ పర్సన్లు, ఎంపీటీసీలు, సర్పంచులను ఈ సదస్సులకు ఆహ్వానించాలి” అని సీఎం ఆదేశించారు. జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులకు నెల రోజుల పాటు ఉచితంగా వాహనం సౌకర్యం కల్పించాలని నిర్ణయించినట్లు చెప్పారు. వారు నెల రోజుల పాటు  విస్తృతంగా పర్యటించి, సాగు విధానంపై అవగాహన కల్పించాలన్నారు.

వాళ్లు రైతు హంతకులు

కల్తీ విత్తన వ్యాపారులు రైతు ఆత్మహత్యలకు కారణమవుతున్నారు. వాళ్లు రైతు హంతకులు.  ముఖ్యంగా పత్తి, మిర్చి విత్తనాలను కల్తీ చేస్తున్నారు. అలాంటి వారిని గుర్తించి, పీడీ యాక్టు కింద అరెస్టు చేసి, జైలులో వేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్ లను ఏర్పాటు చేస్తున్నం. ఇందులో రైసు మిల్లులు, దాల్ మిల్లులు, ఆయిల్ మిల్లులు, ఇతర ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు వస్తయ్​. సెజ్ లకు అవసరమైన స్థలాల ఎంపికను ఆయా జిల్లాల అధికారులు త్వరగా పూర్తి చేయాలి.

ఎక్కువ మంది రైతులు ఓకే చెప్పారు

‘‘నియంత్రిత పద్ధతిలో పంటల సాగు చేయాలన్న నిర్ణయాన్ని రాష్ట్రంలో ఎక్కువ మంది రైతులు స్వాగతిస్తున్నట్లు సర్వేలో తేలింది. ఇది మంచి పరిణామం. ఈ పద్ధతితో రైతులకు మేలు కలుగుతుంది. ప్రభుత్వానికి కావాల్సింది ఇదే” అని సీఎం కేసీఆర్​ అన్నారు. ఏ పంట సాగు చేయాలి , ఏ పంట వేస్తే మంచి ధర వస్తుందనే దానిపై వ్యవసాయ శాఖలో రెండు కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మార్కెట్ లో మంచి డిమాండ్ ఉన్న పంటలు పండిస్తే  రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. పసుపు మార్కెట్లు వెంటనే తెరిచి కొనుగోళ్లు చేపట్టాలని  అధికారులను ఆదేశించారు. పూర్తి స్థాయి క్రాప్ ఎన్యూమరేషన్ జరగాలన్నారు. నియంత్రిత పద్ధతిలో జరిగే సాగు విధానంపై రైతులకు అవగాహన తరగతులు నిర్వహించాలని ఆదేశించారు.

Latest Updates