నేరుగా ఊర్లకే యూరియా

  • మూడు నాలుగు రోజుల్లో సమస్య తీరిపోవాలి: కేసీఆర్​
  •  రైతులకు ఎంత అవసరమైతే అంత ఇవ్వాలి
  • అధికారులకు కేసీఆర్​ ఆదేశం
  • ఒక్కో పోర్టుకు ఒక్కో అధికారి వెళ్లాలి
  • రైతులు ఎదురుచూసే పరిస్థితులు తొలగిపోవాలి
  • యూరియాపై సీఎం సమీక్ష
  • 25 ప్రత్యేక గూడ్సు రైళ్లు కేటాయించాలని రైల్వే అధికారులకు ఫోన్​

యూరియా కోసం రైతులు ఎదురుచూసే పరిస్థితులు పోవాలి. రైతులకు సరిపోయేంత వెంటనే సరఫరా చేయాలి. రేయింబవళ్లు పర్యవేక్షించి సమస్యను పరిష్కరించాలి. పోర్టుల్లో ఉన్న యూరియా స్టాకును వెంటనే రైళ్లు, లారీల ద్వారా తెప్పించి, స్టాక్​ పాయింట్లలో పెట్టకుండా నేరుగా గ్రామాలకు తరలించాలి. మూడు నాలుగు రోజుల్లో దాదాపు లక్ష టన్నుల యూరియా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోని రైతులకు అందాలి. – కేసీఆర్​

హైదరాబాద్‌‌, వెలుగు:

రాష్ట్రంలో రైతులందరికీ సరిపోయేంత యూరియా ను వెంటనే సరఫరా చేయాలని అధికారులను సీఎం కేసీఆర్​ ఆదేశించారు.  రేయింబవళ్లు పర్యవేక్షించి సమస్యను పరిష్కరించాలని సూచించారు. పోర్టుల్లో ఉన్న యూరియా స్టాకును వెంటనే రైళ్లు, లారీల ద్వారా తెప్పించి, స్టాక్​ పాయింట్లలో పెట్టకుండా నేరుగా ఊర్లకు తరలించాలన్నారు. యూరియా సమస్యపై శుక్రవారం ప్రగతిభవన్‌‌లో  సీఎం కేసీఆర్​ సమీక్షించారు. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనంతగా యూరియా డిమాండ్ ఏర్పడడానికి గల కారణాలను వ్యవసాయశాఖ అధికారులు ఆయనకు వివరించారు. యూరియా కోసం రైతులు ఎదురుచూసే పరిస్థితి తొలగిపోవాలని, మూడు నాలుగురోజుల్లో దాదాపు లక్ష టన్నుల యూరియా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోని  రైతులకు అందాలని సీఎం ఆదేశించారు.

రవాణాకు 25 స్పెషల్​ గూడ్స్​ రైళ్లు

సాధారణ పద్ధతుల్లో యూరియా రవాణా జరిగితే మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉండడంతో.. ఇందుకోసం ప్రత్యేక గూడ్స్ రైళ్లను కేటాయించాలని రైల్వే అధికారులను సీఎం కేసీఆర్​ కోరారు. ఈ మేరకు సౌత్ సెంట్రల్ రైల్వే చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ శివప్రసాద్, చీఫ్ ఫ్లీట్ ట్రాఫిక్ మేనేజర్ నాగ్యాతో ఆయన ఫోన్​లో మాట్లాడారు. పోర్టుల్లో ఉన్న యూరియా స్టాకును జిల్లాలకు తరలించడానికి 25 స్పెషల్ గూడ్స్​ ట్రెయిన్స్​ను  కేటాయించాలని కోరారు. వాటిల్లో యూరియాను లోడ్ చేయించి, వేగంగా జిల్లాలకు తరలించాలన్నారు.

జగిత్యాల, మంచిర్యాల, ఆదిలాబాద్, పెద్దపల్లి, వరంగల్, మహబూబాబాద్, కరీంనగర్, సనత్ నగర్, ఖమ్మం, కొత్తగూడెం, జడ్చర్ల, తిమ్మాపూర్ తదితర రైల్వే స్టేషన్లకు నేరుగా గూడ్స్​ రైళ్ల  ద్వారా యూరియా పంపాలని కోరారు. దీనికి రైల్వే అధికారులు అంగీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం కోరినట్లు శుక్రవారమే గూడ్స్​ రైళ్లు కేటాయిస్తామని తెలిపారు.

ప్రగతిభవన్​ నుంచి పర్యవేక్షణ

యూరియాను రాష్ట్రానికి రప్పించే పనిని ప్రగతి భవన్ లో నుంచే  పర్యవేక్షించాలని వ్యవసాయ మంత్రి నిరంజన్​రెడ్డి, రవాణా శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, అధికారులను సీఎం ఆదేశించారు. గూడ్సు రైళ్లలో యూరియా స్టాక్ లోడ్ చేసే పనిని పర్యవేక్షించడానికి ఒక్కో పోర్టుకు ఒక్కో వ్యవసాయశాఖ అధికారిని పంపాలన్నారు. స్టాక్ రైల్వే స్టేషన్లకు చేరుకోగానే, అక్కడ లారీలను సిద్ధంగా ఉంచాలన్నారు. రైల్వే స్టేషన్ల నుంచి మండలాలు, గ్రామాలకు నేరుగా యూరియా పంపాలని సూచించారు. సరఫరాకు అవసరమయ్యే లారీలను రైల్వేస్టేషన్ల వద్ద సిద్ధంగా ఉంచాలని రవాణా శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి,  సీఎస్‌ సునీల్ శర్మను  ఆదేశించారు. పోర్టుల నుంచి యూరియాను రాష్ట్రానికి రప్పించడానికి రైళ్లతోపాటు, 4 వేల లారీలను వాడాలని సీఎం నిర్ణయించారు. రాష్ట్రంతో పాటు ఏపీ లారీలను వెంటనే పోర్టులకు పంపాలన్నారు. ఏపీ రవాణా శాఖ మంత్రి పేర్ని నానితో సీఎం కేసీఆర్‌ ఫోన్లో మాట్లాడారు. గంగవరం పోర్టు నుంచి వీలైనన్ని ఎక్కువ లారీలతో యూరియా పంపించేందుకు సహకరించాలని ఆయనను కోరారు. అవసరమైన ఏర్పాట్లు చేస్తామని ఏపీ మంత్రి హామీ ఇచ్చారు.  ఇదిలా ఉంటే.. యూరియా డిమాండ్ ఏర్పడడానికి గల కారణాలను వ్యవసాయశాఖ అధికారులు సీఎంకు  వివరించారు. గత నాలుగేండ్లలో ప్రతి ఖరీఫ్ సీజన్​లో  6 లక్షల టన్నుల వరకే  యూరియా అవసరం ఉండేదని, ఈసారి ఆగస్టు చివరి నాటికే 6 లక్షల టన్నుల యూరియా రైతులకు చేరిందని తెలిపారు. ఈ సారి వరి, మక్క, పత్తి పంటలకు ఏకకాలంలో యూరియా అవసరం పడడం, పంటల సాగు పెరగడంతో డిమాండ్  ఏర్పడిందని వారు అన్నారు.

కదిలిన యంత్రాంగం

సీఎం కేసీఆర్ ఆదేశాలు మేరకు మంత్రులు, అధికారులు యూరియాను తెప్పించే పనులను  ప్రగతి భవన్ నుంచి పర్యవేక్షిస్తున్నారు. వివిధ కంపెనీల ప్రతినిధులను ప్రగతి భవన్​కు పిలిపించి రైల్వే శాఖకు రేక్స్ కోసం ఇండెంట్ ఇచ్చారు. పోర్టులకు 25 ర్యాక్స్​పంపడానికి రైల్వే శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఒక్కో గూడ్సు రైలుతో  2600 టన్నులు యూరియా తెప్పిస్తున్నారు. రైళ్ల ద్వారా 60 వేల టన్నుల యూరియా రెండు మూడు రోజుల్లో ఆయా జిల్లాలకు చేరేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.  యూరియా మూడు నాలుగు రోజుల్లో గ్రామాలకు చేరుతుందని, రైతులు ఓపికగా పట్టాలని మంత్రులు సూచించారు. యూరియా కొరతను ఆసరా చేసుకుని ఎవరైనా రేట్లు పెంచి అమ్మే అవకాశం ఉందని, రైతులు మోసపోవద్దని వారు కోరారు. మూడు నాలుగు రోజుల్లో సమస్య పూర్తిగా తొలగిపోతుందని మంత్రులు భరోసా ఇచ్చారు.

Latest Updates