సూర్య‌పేట జిల్లాలో అధికార పార్టీ ఆగడాలపై ఎస్పీకి ఫిర్యాదు

సూర్యాపేట జిల్లా : కరోనా విషయంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమ‌య్యింద‌న్నారు పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి. మంగ‌ళ‌వారం ఆయ‌న సూర్య‌పేట‌ జిల్లాలోని మట్టంపల్లి మండలంలో అధికార పార్టీ ఆగడాలు, స్థానిక పోలీస్ అధికారులపై జిల్లా ఎస్పీ భాస్కరన్ కు ఫిర్యాదు చేశారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన‌ ఉత్తమ్ కుమార్ రెడ్డి.. రాష్ట్రంలో కరోనా విస్ఫోటనంపై ప్రజల్లో ఆందోళన నెలకొందన్నారు. సలహాలు ఇస్తున్న ప్రతిపక్షాలను కేసీఆర్ తిట్టిపోస్తున్నారని..కరోనా నివారణ చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర స‌ర్కార్ విఫలమ‌య్యింద‌న్నారు.

లాక్డౌన్ సమయంలో వైద్య సదుపాయాలు సమకూర్చుకోలేకపోయారన్న ఉత్త‌మ్..గాంధీలో అసౌకర్యాలపై బాధితులు వీడియోలు పెడితే, వారి పట్ల అమానవీయంగా ఈటల ప్రవర్తిస్తున్నారన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో పడకలు కరువ‌య్యాయ‌ని..కరోనా కట్టడిలో ఈటల , సీఎం కేసీఆర్ పూర్తిగా విఫలమ‌న్నారు. పరిస్థితి మెరుగుపడాలంటే ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకోవాలన్నారు ఉత్త‌మ్.