ఆర్టీసీ దెబ్బ: ఉద్యోగుల డిమాండ్లకు కేసీఆర్ ఓకే

ఎక్కడో స్విచ్ వేస్తే.. మరెక్కడో లైట్ వెలగడమంటే ఇదేనేమో! ఆర్టీసీ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తుంటే.. టీఎన్జీవో, టీజీవోల డిమాండ్లు నెరవేరబోతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కడ ఆర్టీసీ సమ్మెకు మద్దతు ఇస్తారోనన్న భయం.. సర్కారునే వారి దగ్గరకు నడిపింది. నేరుగా ఉద్యోగ సంఘాల నేతలకు సీఎంవో నుంచి ఫోన్ చేసి మరీ చర్చలకు పిలిపించారు. నేరుగా ప్రగతి భవన్ కు పిలిచి.. సమస్యలు విని, వాటి పరిష్కారానికి ఓకే చెప్పారు సీఎం కేసీఆర్.

ఆర్టీసీ కార్మికుల పుణ్యమే

పీఆర్సీ, డీఏ పెంపు వంటి పలు డిమాండ్లపై విన్నవించేందుకు ఏడాదిగా ఎన్ని ప్రయత్నాలు చేసినా దొరకని సీఎం అపాయింట్ మెంట్.. ఇప్పడు ఆర్టీసీ సమ్మె పుణ్యమా అని, ఎదురొచ్చి తలుపు తట్టింది. తమ సమ్మెకు మద్దతు కోరేందుకు ఆర్టీసీ జేఏసీ నేతలు.. టీఎన్జీవో నేతలతో ఇవాళ మధ్యాహ్నం భేటీ కావాల్సి ఉంది. మరో గంటలో ఈ భేటీ జరుగుతుందనగా.. సీఎం కార్యాలయం నుంచి టీఎన్జీవోలకు ఫోన్ వచ్చింది. సమస్యలపై చర్చలకు పిలిచారు. చకాచకా వెళ్లి తమ డిమాండ్లు వినిపించారు ఉద్యోగ సంఘాల నేతలు. వాటికి కేసీఆర్ ఓకే చెప్పారు కూడా.

21 తర్వాత దశల వారీగా

సీఎం కేసీఆర్ తో భేటీ ముగిశాక ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల నేతలు మాట్లాడుతూ తమ డిమాండ్లకు సానుకూల స్పందన వచ్చిందని చెప్పారు. సమస్యలను సీఎం కేసీఆర్ సావధానంగా విన్నారన్నారు. అక్టోబర్ 21 తర్వాత ఎన్నికల కోడ్ ముగిశాక దశల వారీగా సమస్యల పరిష్కారిస్తామని సీఎం హామీ ఇచ్చారన్నారు టీఎన్జీవో నేతలు.

ఉద్యోగులకు సీఎం అభినందనలు

టీజీవో సంఘం చైర్మన్, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి, సెక్రటరీ జనరల్ మమత, టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి రాజేందర్, టీజీవో ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ తదితరులు ఇవాళ సాయంత్రం సీఎం కేసీఆర్ ను కలిశారు. 30 రోజుల ప్రణాళికను విజయవంతమైన సందర్భంగా ఉద్యోగుల శ్రమను ముఖ్యమంత్రి అభినందించారు. అక్టోబర్ 21 తర్వాత ఎన్నికల కోడ్ ముగియగానే ఉద్యోగ సంఘాల నాయకులను పిలిపించుకుని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చినట్లు టీఎన్జీవో నేత మమత చెప్పారు.

Latest Updates