గెలవంగానే ‘ధరణి’ తేవాల్సి ఉండే.. కరోనా వల్ల ఏడెనిమిది నెలలు ప‌ట్టినయ్

రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్న ఏకైక ప్ర‌భుత్వం తెలంగాణ మాత్ర‌మే అని సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. శ‌నివారం జ‌న‌గామ జిల్లాలోని కొడ‌కండ్ల‌లో రైతు వేదిక‌ను ప్రారంభించారు సీఎం . అనంత‌రం అక్క‌డ ఏర్పాటు చేసిన స‌మావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్ర‌ వ్యాప్తంగా 2601 రైతు వేదిక‌లు నిర్మిస్తున్నామ‌ని, మ‌రో వారం రోజుల్లో అన్ని వేదిక‌లు పూర్త‌వుతాయని అన్నారు. దాదాపుగా 600 కోట్లు ఖ‌ర్చు పెట్టామ‌న్నారు. గొప్ప ఉద్దేశంతో, అవ‌గాహ‌న‌తో ఈ వేదిక‌ల‌ను నిర్మించామ‌న్నారు.

ధ‌ర‌ణి పోర్ట‌ల్‌, రైతు వేదిక‌లు, రైతుబంధు, రైతుబీమా ఉట్టిగా పెట్టలేదని, రైతులంద‌రూ సంఘ‌టితం కావాల‌నే ఉద్దేశంతోనే వీట‌న్నింటిని చేప‌ట్టామ‌న్నారు. రైతు బీమా త‌న‌ బుర్రలోనే పుట్టిన ఆలోచనే అని అన్నారు. రైతులు ఎవ‌రికీ వారే ఉంటే ఆగ‌మాగం అవుతామ‌ని, సంఘ‌టితంగా ఉన్న‌ప్పుడే ఫ‌లితాలు సాధ్య‌మ‌వుతాయని అన్నారు.

ఈ సారి గెలవంగానే ధరణి తేవాల్సి ఉండేన‌ని, దరిద్రపుగొట్టు కరోనా వల్ల ఏడెనిమిది నెలలు వేస్టయినయ్ అని సీఎం అన్నారు. కరోనా పీడ ఇంకా పోలేదని.. జాగ్రత్తగా ఉండాలన్నారు. త్వరలో కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. ‘రైతు వేదిక ఒక ఆటం బాంబ్‌.. అద్భుతమైన శక్తి. ఏ పంట వస్తే లాభమో రైతు వేదికలే నిర్ణయించాలి. ప్రత్యేక అధికారుల్ని నియమించి రైతులకు సూచనలిస్తాం. 95శాతం రైతు వేదికలు ఇప్పటికే పూర్తయ్యాయి‌’ అని అన్నారు. ఈసారికి ప్రభుత్వానికి నష్టమైనా మక్కలు కొన్నామని, ఇక ముందు మక్కలు వేయొద్దని.. పంట వేసినా దాన్ని ప్రభుత్వం కొనదని తేల్చిచెప్పారు. మార్కెట్ ఉండే పంటలను మాత్రమే రైతులు సాగు చేయాలని కేసీఆర్ సూచించారు.

Latest Updates