అలసత్వం ప్రదర్శిస్తే.. ఉద్యోగాలు ఊడతయ్: సీఎం కేసీఆర్

ఈ నెల 6 నుంచి… గ్రామాల్లో పాటించాల్సిన 30 రోజుల ప్రణాళికను సీఎం కేసీఆర్ విడుదల చేశారు. రాజేంద్రనగర్ లో కలెక్టర్లు,  పంచాయతీరాజ్ శాఖ  అధికారులతో సమావేశమైన ఆయన…  30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికపై దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమం పూర్తిగా కలెక్టర్ల ఆధ్వర్యంలో జరుగుతుంది. ప్రతి గ్రామంలో 30 రోజుల ప్రణాళిక అమలును పర్యవేక్షించేందుకు… మండల  స్థాయిలో ఎంపీవోను నియమించనున్నారు.

గ్రామాలను  పరిశుభ్రంగా  ఉంచేందుకు  చర్యలు  తీసుకోవడం,  పచ్చదనం పెంచే కార్యక్రమాలు చేపట్టడం,  ప్రజల విస్తృత భాగస్వామ్యాన్ని పెంపొందించడం,  వార్షిక,  పంచవర్ష ప్రణాళికలను తయారుచేయడం, నిధుల వినియోగం, ప్రజాప్రతినిధులు, అధికారుల్లో జవాబుదారీతనాన్ని పెంపొందించడమే ప్రధాన లక్ష్యాలుగా నిర్ణయించారు.

30 రోజుల  ప్రణాళికలో భాగంగా… తొలి రోజైన సెప్టెంబర్ 6న… అన్ని గ్రామాల్లో గ్రామసభ నిర్వహించాల్సి ఉంటుంది. అందులో… ముఖ్యమంత్రి సందేశం, కార్యక్రమ ఉద్దేశ్యం ప్రజలకు వివరిస్తారు. గ్రామస్తులు ఇచ్చే సలహాలు, సూచనలను స్వీకరిస్తారు. రెండో రోజు కో ఆప్షన్ సభ్యులను ఎంపిక చేస్తారు. స్టాండింగ్ కమిటీలను నియమిస్తారు. సర్పంచుల కుటుంబ సభ్యులను కో-ఆప్షన్ సభ్యులుగా నియమించొద్దనే నిబంధన కూడా చేర్చారు.

30 రోజుల ప్రణాళిక అమలు తర్వాత…  గ్రామాల్లో వచ్చిన మార్పులను పర్యవేక్షించేందుకు…  సీనియర్ అధికారుల నేతృత్వంలో వంద ఫ్లయింగ్ స్క్వాడ్ లను ఏర్పాటు చేస్తారు.  తర్వాత.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామాల్లో ఈ స్క్వాడ్ టీంలు…  ఆకస్మిక తనిఖీలు చేస్తాయి.  ప్రభుత్వ లక్ష్యాలు సాధించిన గ్రామాలకు ప్రోత్సాహకాలు అందిస్తారు.  అజాగ్రత్త, అలసత్వం ప్రదర్శించిన వారిపై.. చర్యలు తీసుకుంటారు.

Latest Updates