రేపే కొండపోచమ్మ సాగర్ ప్రారంభం..చినజీయర్ ను కలిసిన సీఎం

హైదరాబాద్‌, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత ఎత్తయిన కొండపోచమ్మసాగర్‌ ఎత్తిపోతలు శుక్రవారం మొదలు కానున్నాయి. మంత్రి హరీశ్‌రావు ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఎత్తిపోతలు ప్రారంభానికి ముందు చండీయాగం, సుదర్శనయాగం నిర్వహించనున్నారు. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు కొండపోచమ్మసాగర్‌కు 30 కి.మీ.ల దూరంలోని కొండపోచమ్మ దేవాలయంలో చండీయాగం ప్రారంభిస్తారు. అదే టైంలో మర్కూక్‌ పంపుహౌస్‌ వద్ద సుదర్శనయాగం చేపడతారు. ఉదయం 7 గంటలకు  సీఎం కేసీఆర్‌ దంపతులు దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, చండీయాగం పూర్ణాహుతిలో పాల్గొంటారు. అక్కడి నుంచి ఎర్రవెల్లిలోని ఫామ్​హౌస్​కు  చేరుకుంటారు. ఎర్రవెల్లి, మార్కూక్‌  ఊళ్లలో నిర్మించే రైతు వేదికలకు కేసీఆర్‌ శంకుస్థాపన చేస్తారు. అక్కడి నుంచి మర్కూక్‌ పంపుహౌస్‌కు చేరుకొని, చినజీయర్‌ స్వామికి సీఎం కేసీఆర్​ స్వాగతం పలుకుతారు. సుదర్శనయాగం పూర్ణాహుతిలో సీఎం దంపతులు పాల్గొంటారు. ఆ తర్వాత మర్కూక్‌ పంపుహౌస్‌లో మోటారు స్విచ్‌ ఆన్‌ చేసి ఎత్తిపోతలు ప్రారంభిస్తారు. గోదావరి నీటికి పూజలు నిర్వహిస్తారు. అతిథులకు పంపుహౌస్‌ వద్ద భోజనాలు ఏర్పాటు చేశారు.

చినజీయర్ ను కలిసిన సీఎం

మరోవైపు సీఎం కేసీఆర్ బుధవారం చినజీయర్ స్వామిని కలిశారు. ప్రగతి భవన్ లో సమీక్ష అనంతరం ముచ్చింతల్ లోని చినజీయర్ స్వామి ఆశ్రమానికి వెళ్లారు.

Latest Updates