త్వరలో సీఎం కేసీఆర్​ గృహప్రవేశం

ఫామ్​ హౌస్​​​లో పూర్తికావొచ్చిన నిర్మాణం

హైదరాబాద్, వెలుగు: ఎర్రవెల్లి ఫాంహౌస్​లో సీఎం కేసీఆర్​ కొత్త ఇంటి నిర్మాణం పూర్తయింది. ఈ వారంలోనే గృహప్రవేశం ఉండొచ్చని టీఆర్ఎస్​ వర్గాలు చెప్తున్నాయి. శుక్రవారం మంచి ముహూర్తం ఉందని, ఆ రోజున సీఎం కుటుంబ సభ్యులతో కలిసి కొత్త ఇంట్లోకి వెళతారని పార్టీలోని ఓ సీనియర్ నాయకుడు చెప్పారు. గృహప్రవేశం తర్వాత మూడు రోజుల పాటు సీఎం అక్కడే బస చేస్తారని సమాచారం. ఈ సందర్భంగా ప్రత్యేక హోమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసింది.

నాలుగు నెలల్లో పూర్తి

ఈ ఏడాది జూన్ 26న కేసీఆర్ ఫాంహౌస్ లో కొత్త ఇంటి నిర్మాణం కోసం భూమి పూజ చేసిన విషయం తెలిసిందే. అదే రోజు ఉదయం 11 గంటలకు కొత్త సెక్రటేరియెట్, 11. 15 గంటలకు అసెంబ్లీ భవనాలకు భూమి పూజ చేశారు. తర్వాత ఆగస్టు నెలలో ఫాంహౌస్​లో పనులు మొదలుపెట్టారు. తర్వాత పలుమార్లు ఫాంహౌజ్​కు వెళ్లిన సీఎం.. నిర్మాణ పనులను పరిశీలించారని ఓ సీనియర్ నేత చెప్పారు. ‘కొత్త ఇంటి నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి. అవన్నీ అయ్యాక గృహప్రవేశం చేయాలంటే మంచి రోజులు లేవు. ఈ నెల 12 వరకే ముహూర్తాలున్నాయి. తర్వాత ఫిబ్రవరి దాకా ముహూర్తాలు లేవు. అందువల్ల ఈ వారంలోనే గృహ ప్రవేశం చేసే అవకాశముంది’’ అని తెలిపారు.

Latest Updates