గురుకులాల్లో ఒక్కో విద్యార్థికి రూ. లక్ష ఖర్చు

  • విదేశీ విద్యకు వెళ్లే వారికి రూ.20 లక్షల సాయం: కేసీఆర్

హైదరాబాద్: రాష్ట్రంలో నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం కేసీఆర్ అన్నారు. శుక్రవారం ఉదయం అసెంబ్లీలో ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టారు. కేజీ టు పీజీ ఉచిత విద్యావిధానంలో భాగంగా పెద్ద సంఖ్యలో రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీలను ఏర్పాటు చేశామన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల కోసం కేవలం 296 గురుకులాలు అరకొర వసతులతో ఉండేవని, రాష్ట్ర సాధించుకున్నాక కొత్త ప్రభుత్వం అన్ని హంగులతో, రికార్డు స్థాయిలో 542 కొత్త గురుకులాలు ఏర్పాటు చేసిందని సీఎం చెప్పారు.

వచ్చే విద్యా సంవత్సరం నుంచి బీసీల కోసం మరో 119 రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రారంభిస్తున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థినుల కోసం 51 డిగ్రీ గురుకులాలను ప్రారంభించామని చెప్పారు. ఈ గురుకులాల్లో ఒక్కో విద్యార్థిపై ఏడాదికి సగటున రూ. లక్ష చొప్పున ఖర్చు చేస్తున్నామని సీఎం తెలిపారు. వారికి మంచి భోజనం, వసతి, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. విదేశీ విద్య కోసం వెళ్లే అన్ని వర్గాల వారికి రూ.20 లక్షల ఆర్థిక సహాయం చేరస్తున్నామని అన్నారు.

Latest Updates