హై అలర్ట్: ఫారిన్ నుంచి వచ్చిన వాళ్ల కోసం రాష్ట్రమంతా జల్లెడ

కరీంనగర్ లో నిన్న ఒక్క రోజులో ఎనిమిది కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఢిల్లీలో ఫ్లైట్ దిగి.. కరీంనగర్ వచ్చిన పది మంది ఇండోనేషియా దేశీయుల్లో ఎనిమిది మందికి వైరస్ సోకింది. దీంతో ఇలా శంషాబాద్ లో కాకుండా ఇతర రాష్ట్రాల్లోని విమానాశ్రయాల్లో దిగి తెలంగాణలోకి వచ్చిన విదేశీయులు, ఫారెన్ కి వెళ్లొచ్చిన మన ప్రజలను గుర్తించేందుకు హై అలర్ట్ ప్రకటించింది ప్రభుత్వం. రాష్ట్రమంతా పల్లెలు, పట్నాలు అంతా జల్లెడ పట్టి ఫారిన్ నుంచి వచ్చిన వారందరినీ గుర్తించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. దీనిపై పర్యవేక్షణకు కలెక్టర్, ఎస్పీ, డీహెచ్ఎంవోలతో కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

కరీంనగర్ ఘటన నేపథ్యంలో ఆయన గురువారం ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో హైలెవర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో తీసుకోవాల్సిన చర్యలపై మాట్లాడారు. మార్చి 1 తర్వాత విదేశాల నుంచి వచ్చిన వాళ్లందరినీ గుర్తించాలన్నారు సీఎం కేసీఆర్. ఇందు కోసం జిల్లా స్థాయిలో కలెక్టర్, ఎస్పీ, డీహెచ్ఎంవోలతో కమిటీ ఏర్పాటు చేశామన్నారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, పోలీసులు కూడా ఎంక్వైరీ చేసి ఏ ఒక్కరినీ మిస్ చేయకుండా గుర్తించాలని ఆదేశించారు. గ్రామ కార్యదర్శులు, మున్సిపల్ కమిషనర్లు దీనిపై బాధ్యత తీసుకోవాలని, విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలను వైద్య శాఖ అధికారులకు సమాచారం అందించాలని అన్నారు సీఎం కేసీఆర్. ప్రజలు కూడా వారంతట వారే స్వచ్ఛందంగా అధికారులకు రిపోర్ట్ చేయాలని, లక్షణాలు లేకున్నా హోమ్ క్వారంటైన్ లో ఉండాలని సూచించారు. ఎవరికైనా కరోనా సింప్టమ్స్ కనిపిస్తే 104కి డయల్ చేసి సమాచారం ఇవ్వాలని, వారిని ఆస్పత్రులకు తరలిస్తామని చెప్పారు సీఎం. ముందు జాగ్రత్తే శ్రీరామ రక్ష అని, స్వీయ నియంత్రణ పాటిస్తేనే కరోనా నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోగలమని అన్నారు.

Latest Updates