అసంతృప్తి నేతలకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఫోన్లు

cm-kcr-phone-to-trs-leaders-who-didnt-get-place-in-cabinet
 • వెనక్కి తగ్గిన టీఆర్​ఎస్​ అసంతృప్త నాయకులు
 • ఆ లీడర్లకు ఫోన్లు, బుజ్జగింపులు
 • పదవులు రాలేదని బాధ వెళ్లగక్కిన నేతల మాటల్లో మార్పు
 • తమ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన లీడర్లు
 • తెలంగాణ భవన్‌లో రాజయ్య ప్రెస్‌మీట్‌
 • కేసీఆర్‌, కేటీఆర్‌ తనకు అండగా ఉన్నారని వ్యాఖ్య
 • బీపీ ఎక్కువై అసెంబ్లీకి పోలేదన్న జోగు రామన్న
 • తమకు అసంతృప్తి లేదన్న బాజిరెడ్డి, గండ్ర
 • నిఖార్సయిన టీఆర్‌ఎస్‌ నాయకుడినన్న జూపల్లి
 • నాయిని మాత్రం సైలెంట్‌

టీఆర్ఎస్​లో అసంతృప్తులను చల్లార్చేందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్​ స్వయంగా రంగంలోకి దిగారు. కేబినెట్లో చోటు దక్కకపోవడంపై అసహనం వ్యక్తం చేసిన కొందరు నేతలతో ఫోన్లో, మరి కొందరిని పిలిపించుకుని మాట్లాడారని టీఆర్ఎస్​ వర్గాలు చెప్తున్నాయి. కొందరికి కొత్త హామీలివ్వడంతోపాటు మరికొందరికి భవిష్యత్​లో పదవులు ఇస్తామని భరోసా ఇచ్చారని అంటున్నాయి.

హైదరాబాద్‌, వెలుగు: మంత్రివర్గంలో చోటు దక్కలేదంటూ కొందరు టీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు మీడియా ఎదుట అసంతృప్తి వ్యక్తం చేశారు. అది మీడియాలో ప్రధానంగా ప్రసారమైంది. పార్టీలో పరిస్థితి పట్టుతప్పుతుందని భావించిన కేసీఆర్‌.. నేతలతో మాట్లాడాలంటూ కేటీఆర్‌ను ఆదేశించినట్టు తెలిసింది. దీంతో కేటీఆర్‌ పలువురు నేతలకు ఫోన్లు చేసి మాట్లాడారని, ఫోన్‌లో అందుబాటులోకి రాని నేతల వద్దకు తన సన్నిహితులను పంపి ప్రగతి భవన్‌కు పిలిపించుకుని, మాట్లాడారని సమాచారం. ఈ నేపథ్యంలోనే అసంతృప్తులంతా వెనక్కి తగ్గారు. మంత్రి పదవి రాకపోవడంపై తమకు అసంతృప్తేమీ లేదంటూ బాజిరెడ్డి గోవర్ధన్, గండ్ర వెంకటరమణారెడ్డి ప్రెస్​నోట్లు ఇచ్చారు. మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య అయితే.. తాను అలా అన్నట్టు వీడియో, ఆడియో సాక్ష్యాలు ఉన్నాయా అంటూ ప్రశ్నించారు. బీపీ ఎక్కువ కావడంతోనే తొలిరోజు అసెంబ్లీకి రాలేదని మాజీ మంత్రి జోగు రామన్న తెలిపారు. జూపల్లి తాను నిఖార్సైన టీఆర్ఎస్​ నాయకుడినన్నారు. అయితే మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి మాత్రం ఇంకా నోరు విప్పలేదు. సీఎం కేసీఆర్‌  త్వరలో ఆయనతో మాట్లాడాలనుకుంటున్నట్టు ప్రగతిభవన్‌ వర్గాలు అంటున్నాయి.

హైకమాండ్​కు, లీడర్లకు గ్యాప్

రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్‌ఎస్‌  హైకమాండ్​కు.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకుల మధ్య గ్యాప్‌ పెరిగినట్టు పలువురు నేతల మాటలు స్పష్టం చేస్తున్నాయి. సీఎం కేసీఆర్‌ను కలవడం సాధ్యం కావడం లేదంటూ మంత్రులు సైతం పలు సందర్భాల్లో చెప్పారు. ప్రగతిభవన్‌తో యాక్సెస్‌ ఉన్న కొందరు నేతలకు తప్ప మిగతా వారెవరికీ కేసీఆర్‌, కేటీఆర్‌లను కలవడం కుదరడం లేదని నేతలు వాపోతున్నారు. మంత్రి పదవి కోసంగానీ, మరో పదవి కోసంగానీ ఇప్పటికే హామీ ఉన్నా, ఇప్పుడు కోరుకుంటున్నా పెద్ద బాసును, చిన్న బాసును కలిసి చెప్పుకోలేని పరిస్థితి ఉందని అంటున్నారు. అయితే వివిధ సందర్భాల్లో పదవులపై హామీ లభించిన నేతలు మాత్రం తమకు అవకాశం ఇవ్వకపోతారా అని ఎదురుచూశారు. కానీ కేబినెట్​ విస్తరణలో తమకు రాకుండా, కొత్తవారికి మంత్రులుగా చాన్స్​ ఇవ్వడాన్ని సహించలేకపోయారు.

అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల తొలిరోజు లాబీల్లో మీడియా ప్రతినిధుల ఎదుట తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. కావాలనే మీడియాలో ఫోకస్‌ అయ్యేలా కొందరు నేతలు వ్యాఖ్యలు చేశారు. ఇలా తమ అసహనం పార్టీ నాయకత్వానికి చేరుతుందని భావించారు. ఆ నేతల వ్యాఖ్యలు మీడియాలో రావడం, సోషల్‌ మీడియాలో వైరల్‌ కావటంతో పార్టీ హైకమాండ్​ దిద్దుబాటు చర్యలకు దిగింది.

వరుసపెట్టి ఫోన్లు..

మాజీ డిప్యూటీ సీఎం టి.రాజయ్య, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్‌, గండ్ర వెంకటరమణారెడ్డిలతో కేటీఆర్‌ స్వయంగా మాట్లాడినట్టు తెలిసింది.

రాజయ్యకు ఫోన్​ చేసిన కేటీఆర్‌.. కేబినెట్లో సర్దుబాట్లపై వివరించినట్టు తెలిసింది. భవిష్యత్తులో అవకాశాలొస్తాయని, ఓపిక పట్టాలని కోరినట్టు సమాచారం. ఈ ఫోన్‌ తర్వాత, కేటీఆర్​ సూచన మేరకే రాజయ్య తెలంగాణ భవన్‌కు వచ్చి ప్రెస్‌మీట్‌  పెట్టారని టీఆర్ఎస్​ వర్గాలు చెప్తున్నాయి. 2018 ఎన్నికల్లో అనేక దుష్టశక్తులు అడ్డుపడ్డా కేసీఆర్‌, కేటీఆర్‌  అండగా నిలిచారని, మంత్రి పదవి రాలేదన్న అసంతృప్తి లేదని రాజయ్య అన్నారు. మంత్రులంతా కేసీఆర్‌కు బిడ్డల్లాంటి వారని, కేసీఆర్‌ నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని పేర్కొన్నారు. మాదిగ బిడ్డగా కేసీఆర్‌ తనకు అనేక అవకాశాలిచ్చారని, ఏవో ఆబ్లిగేషన్లతోనే మాదిగలకు పదవి రాలేదని తాను భావిస్తున్నానని తెలిపారు.

కాంగ్రెస్‌ నుంచి 12 మంది వస్తే ఒక్కరికే మంత్రి పదవి ఇస్తారా అంటూ అసెంబ్లీ లాబీల్లో అసమ్మతి రాగం వినిపించిన గండ్ర వెంకటరమణారెడ్డి కూడా కేటీఆర్‌ ఫోన్‌తో వెనక్కి తగ్గారు. తన కుటుంబానికి జెడ్పీ చైర్మన్‌ పదవి కేసీఆర్‌  ఆశీస్సులతోనే దక్కిందన్నారు. తాను అనని మాటలు అన్నట్టుగా ప్రచారం చేశారని ఆరోపించారు. పదవుల కోసం టీఆర్‌ఎస్‌ లోకి రాలేదన్నారు.

కూకట్‌పల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీతో ఫోన్‌లో మాట్లాడటానికి ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదని సమాచారం. దాంతో సన్నిహిత నేత ఒకరిని పంపారని, దాంతో బేగంపేట క్యాంపు ఆఫీసుకు వచ్చిన గాంధీతో కేటీఆర్‌  ప్రత్యేకంగా సమావేశమయ్యారని… ఎలాంటి పరిస్థితుల్లో పువ్వాడ అజయ్‌కు అవకాశం కల్పించాల్సి వచ్చిందో  వివరించారని తెలిసింది. ప్రభుత్వ విప్‌  అంటే సహాయ మంత్రి హోదా కలిగిన పదవి అని, మరోసారి అవకాశం కల్పిస్తామని కేటీఆర్‌  అన్నట్టు సమాచారం. కేటీఆర్‌ ఎంత చెప్పినా గాంధీ శాంతించలేదని.. తనకు విప్‌ పదవి వద్దని,ఎమ్మెల్యేగానే ఉంటానని స్పష్టం చేసినట్టు తెలిసింది.

మాజీ మంత్రి జోగు రామన్నతో కేటీఆర్‌ మాట్లాడడానికి ప్రయత్నించగా తొలుత అందుబాటులోకి రాలేదని తెలిసింది. దాంతో కేటీఆర్​ రామన్న కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి మాట్లాడారని, ఇంతకుమించిన అవకాశం మరోరూపంలో వస్తుందని, అలక వీడాలని సూచించారని సమాచారం. ఇలా కేటీఆర్‌  ఫోన్​ తర్వాతే జోగు రామన్న మంగళవారం సాయంత్రం బయటికి వచ్చారు.

నిజామాబాద్‌ జిల్లాకు చెందిన సీనియర్‌ నేత బాజిరెడ్డి గోవర్ధన్‌  సైతం తనకు మంత్రి పదవి రాలేదన్న అసంతృప్తి లేదని ప్రకటించారు. తాను ఎవరిని నమ్ముతానో చివరి వరకు వారితోనే ఉంటానని, తమ నాయకుడు కేసీఆరేనని.. సోషల్‌ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం మానుకోవాలని కోరారు.

తాను పార్టీ మారుతానంటూ అవాస్తవ ప్రచారం జరుగుతోందని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కొల్లాపూర్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. తాను నిఖార్సయిన టీఆర్‌ఎస్‌ నాయకుడినని వివరణ ఇచ్చారు. పదవుల కోసం పాకులాడే వ్యక్తిని కాదని, తెలంగాణ కోసం మంత్రి పదవినే త్యాగం చేశానని చెప్పారు. అధిష్టానం నుంచి ఫోన్‌  రావడంతోనే జూపల్లి స్పందించారని ఆయన అనుచరులు పేర్కొంటున్నారు.

మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదు. సీఎం కేసీఆర్‌ స్వయంగా ఆయనతో మాట్లాడనున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

హైబీపీ వల్ల పోలే

 • రామన్న కుటుంబీకుల వివరణ

మాజీ మంత్రి జోగు రామన్న అజ్ఞాతం వీడారు. కేబినెట్‌ విస్తరణలో చాన్స్​ రాలేదని ఆగ్రహించిన రామన్న సోమవారం తన గన్‌మన్లను పంపేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. హైదరాబాద్‌లోని మినిస్టర్స్‌ క్వార్టర్స్‌ నుంచి వెళ్లిన ఆయన ఆదిలాబాద్‌లోని తన నివాసానికి కూడా చేరుకోలేదు. అయితే రామన్నకు బీపీ ఎక్కువై అసెంబ్లీకి వెళ్లలేదని ఆయన భార్య, కుమారుడు సోమవారం ఆదిలాబాద్‌లో మీడియా ప్రతినిధులకు చెప్పారు. అయితే రామన్న శామీర్‌పేట సమీపంలో ఓ టీఆర్‌ఎస్‌ నాయకుడికి చెందిన రిసార్ట్స్‌లో ఉన్నట్టు గుర్తించారు. సదరు నాయకుడితో మంత్రి కేటీఆర్‌ ఫోన్‌లో మాట్లాడారని తెలిసింది. తర్వాత రామన్న కొందరు మీడియా ప్రతినిధులతో ఫోన్లో మాట్లాడారు. తనకు మంత్రి పదవి రాలేదన్న అసంతృప్తి లేదని, తమ నాయకుడు కేసీఆర్‌  తనకు ఎంతో గౌరవం ఇచ్చారని చెప్పారు. తాను పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు.

అనని మాటలు ప్రచారం చేయొద్దు

తనకు మంత్రి పదవి రాలేదన్న అసంతృప్తి లేదని, కాంగ్రెస్‌  నుంచి టీఆర్‌ఎస్‌లోకి పదవుల కోసం రాలేదని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం  ప్రకటన విడుదల చేశారు. అసెంబ్లీ లాబీల్లో తాను అనని మాటలు అన్నట్టు ప్రచారం చేశారన్నారు.  సీఎం కేసీఆర్​ ఆశీస్సులతోనే  తమ కుటుంబానికి జెడ్పీ చైర్మన్‌ పదవి దక్కిందన్నారు.

cm kcr phone to trs leaders who didnt get place in cabinet

 

Latest Updates